డాక్టర్ ఎం. రాజమన్నార్ సేవలు చిరస్మరణీయం!
కేరళలోని అలెప్పి తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన అంబాజీపేట కొబ్బరి మార్కెట్ అంతటి ఖ్యాతి సంపాదించేందుకు అంబాజీపేట
కేరళలోని అలెప్పి తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన అంబాజీపేట కొబ్బరి మార్కెట్ అంతటి ఖ్యాతి సంపాదించేందుకు అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం క్రియాశీల భూమిక నిర్వహించింది. అందుకు కారణం డాక్టర్ మట్ల పూడి రాజమన్నార్.
నేను ప్లస్ టు చదివే రోజుల్లో ఈ పరిశోధన కేంద్రంపై నేను రాసిన ఒక వ్యాసం తెలుగు దినపత్రికలో ప్రచురితమైనది. ఈ సందర్భంలో కొబ్బరిని ఆశించే తెగుళ్లు, వాటి నివారణ, కొత్త వంగడాలు తదితర అంశాలపై సునిశితంగా దృష్టి కేంద్రీకరించి అధ్యయనం చేయడం జరిగింది. పరిణామ ప్రపంచంలో మొక్కల పాత్ర అనిర్వచనీయమైనదనీ, వాటిని కాపాడుకునేందుకు మొక్కలను నాశనం చేస్తున్న తెగుళ్లను నివారించేందుకు పరిశోధనలు జరిపి వాటికి మందులను కనుగొనేందుకు విశేష కృషి చేస్తున్న శాస్త్రవేత్తల క్రియాశీల భూమిక అప్పుడే నాకు తెలిసింది. దీనిలో భాగంగా జీవరాసుల సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నంలో పెథాజిస్ట్‌లు చేస్తున్న కృషిని దగ్గరగా తెలుసుకోవడం జరిగింది. అదే సమయంలో అంబాజీపేట కొబ్బరి పరిశోధన స్థానం అధిపతిగా పనిచేస్తున్న పాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాజమన్నార్ పరిశోధనాత్మక కృషి నా దృష్టికి వచ్చింది.
మొక్కల పరిశోధనలో జీవితం వెచ్చించి..
ప్లాంట్ పాథాలజీలో అనేక పరిశోధనలు జరిపి విశేషమైన కృషి చేసిన డాక్టర్ రాజమన్నార్ సేవలు అనిర్వచనీయం. మొక్కలకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనం చేసి పరిశోధన ద్వారా ఆయా వ్యాధులకు తగిన వ్యాధి నిరోధక మందులను తయారు చేసేందుకు తన జీవితాన్ని వెచ్చించారు ఆయన. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఇ)నుండి డాక్టోరల్ ప్రోగ్రాంలో గోల్డ్ మెడల్ సాధించిన రాజమన్నార్, కొబ్బరిని ఆశిస్తున్న మైకోప్లాస్మా అనే బాక్టీరియాపై పరిశోధనలు జరిపి దానిపై నివేదించారు. భూమిలోని శిలీంద్రం ద్వారా వ్యాపించి కొబ్బరి చెట్టును నిర్వీర్యం చేసే ఈ తెగులు నివారణకు ట్రైకోడెర్మా కన్సార్షియం మందును కనుగొనడంలో ఆయన పాత్రను మరువలేం. భారతదేశంలోని 45.5 మిలియన్ సెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. దేశంలో పంటల సాగు విస్తీర్ణంలో ఇది నాలుగో వంతు. ఇక 125 మిలియన్ టన్నుల ఉత్పత్తులతో ప్రపంచంలో వరి ఉత్పత్తులలో మనదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్నది.
తెగుళ్లపై డజన్ల కొద్దీ పరిశోధనలు..
ఇంతటి ప్రాధాన్యత కలిగిన వరి పంటల ఉత్పత్తులను ఈ స్థాయిలో పెంపొందించేందుకు ఈ పంటలను నాశనం చేస్తున్న తెగుళ్లపైన ఆయన అనేక పరిశోధనలు జరిపి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు రాజమన్నార్ తన వంతు కృషి చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తూ వారితో మమేకమయ్యారు. యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తూ తన జ్ఞానాన్ని భావితరాల భవిష్యత్తుకు వెచ్చిం చారు. ప్రతిరోజు ప్రతిక్షణం తన ఊపిరి ఉన్నంతవరకు వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. తన పర్యవేక్షణలో ఎందరో శాస్త్రవేత్తలకు ప్రేరణ ఇచ్చారు. వ్యవసాయ పరిశోధనల వైపుకు విద్యార్థుల దృష్టిని మళ్లించేందుకు స్ఫూర్తిని నింపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆయన కృషి చేశారు. 1991 ప్రాంతంలో పర్యావరణానికి సవాలుగా మారిన ఫ్లైట్లో ఫ్లోరా అనే మొక్కలను దెబ్బతీసే ఓమైసెట్స్ తెగులుపై పరిశోధన జరిపి నివారణకు కృషి చేశారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా..
డాక్టర్ మట్ల పూడి రాజమన్నార్ 1947వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా సీసల గ్రామంలో జన్మించారు. 1971లో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1973లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఖ్యాతిగాంచి మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూచే ప్రారంభించబడిన ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్ బల్లబ్ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పీజీ పట్టా పొందారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ నుండి రీసెర్చ్ ఫెలోషిప్ అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి పరిశోధన కేంద్రాల్లో పాథాలజీ విభాగం అధిపతిగాను, నైరా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గాను, మార్టేరు రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్లో శాస్త్రవేత్తగాను పనిచేశారు. పదవీ విరమణ అనంతరం కూడా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. తన 77 వ ఏట విజయవాడలోని ఆయన స్వగృహంలో ఈనెల 7వ తేదీన మృతి చెందారు. నేటి యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారా ఆయనకు ఘనమైన నివాళి అర్పించాలని ఆశిస్తున్నాను.
(డాక్టర్ ఎం. రాజమన్నార్ సంస్కరణలో)
- నేలపూడి స్టాలిన్ బాబు
83746 69988