మేధావులకు ఆ బాధ్యత లేదా?

మేధావుల మౌనం దేశానికి శాపం కాకూడదు. మేధావులు వారి కొంత సమయం సమాజసేవ చేయడానికి ఉపయోగించండి. భారతదేశంలో పుట్టడం

Update: 2024-06-27 00:45 GMT

మేధావుల మౌనం దేశానికి శాపం కాకూడదు. మేధావులు వారి కొంత సమయం సమాజసేవ చేయడానికి ఉపయోగించండి. భారతదేశంలో పుట్టడం ఒక వరం, ఆ దేశం గాలి పీల్చి, రైతు పండించే ధాన్యం తిని కండలు పెంచాము. సైనికుల వలె అందరం సేవ చేయలేము, యుద్ధంలో ప్రాణాలు దేశం కోసం వదలలేము, కానీ మన చుట్టూ ఉన్న సమాజం మార్పుకు ప్రయత్నిస్తే అదే దేశ సేవ అదే భగవత్ సేవ.

నాయకులే దుర్మార్గులా?

ప్రస్తుత సమాజంలో, ప్రజల్లో పెరుగుతున్న అనిస్థితి, అశాంతి, ఇంత మార్పులకు కారణం పాశ్చాత్య ధోరణి, ఇంటి పెద్దల నేతృత్వ లోపం. సమాజంలో విజ్ఞుల మౌనం. ప్రతి తరానికి అభివృద్ధితోపాటు కొంత సాంకేతిక అభివృద్ధిలో మార్పులు అవసరం. కానీ ఆ సాంకేతిక అభివృద్ధితో పాటు ఎన్నో విషయాలలో విశృంఖలత్వం పెరిగింది. పౌరులలో సామాజిక బాధ్యత కొరవడింది. ప్రతీది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉండటం, ప్రోత్సాహకాల కోసం వేచి చూడటం. రాజకీయ నాయకుల ఆటలలో పావులుగా మారడం జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యానికి కారణం మనకు మన దేశం పట్ల కానీ, మన సమాజం పట్ల కానీ, కనీసం మన మీద మనకు బాధ్యత గౌరవం లేకపోవడం. అంతేకాక ప్రజలు అవినీతిపరులైతే నాయకులు దుర్మార్గులు అవుతారు.

పథకాలు చేయూతనివ్వాలి

నాయకుడు స్వలాభం చూసుకుంటే రాష్ట్రం ఇంకా రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవడం తథ్యం. స్వాతంత్ర్య పీఠికలో మనం రాసుకున్న సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం మచ్చుకకు కూడా కనపడటం లేదు. స్వేచ్ఛకూ, సమానత్వానికి అర్థాలు మారి ఇప్పటి ప్రజల పోకడలు చెప్పనలవిగా ఉన్నాయి. ప్రభుత్వాలు తెచ్చే ప్రతి పథకంలో ప్రజలను సోమరులను చేసేట్టుగా ఉన్నాయి. కానీ చేయూత పరిచేట్టుగా లేవు. ప్రజలను లంచాలకు, ఉచితాలకు అలవాటు చేశారు. ఇది ఇలానే ఉంటే వచ్చే భావితరాలకు మన దేశం ప్రస్తుత చరిత్రను నల్ల సిరాతో రాస్తారు.

మేధావుల మౌనం శాపం కాకూడదు..

ప్రజలు సైతం ఎవరో వచ్చి ఏదో చేస్తారని వేచి చూచే ధోరణి మానాలి. ప్రతి పౌరునికి తన పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. దాన్ని బాల్యం నుంచే చైతన్య పరచాలి. అబ్దుల్ కలాం గారి “కలలు కనండి సాధించడానికి కృషి చేయండి" అన్న పిలుపుకు ఎంతోమంది పిల్లలు స్పందించారు. అలానే ఎంతో మంది మేధావులు ముందుకు వచ్చి మన భావితరాల వారిని చైతన్య పరచాలి, సమాజం పట్ల మంచి పౌరులుగా ఉండేలా ప్రయత్నించాలి. “పిల్లలు - సమాజం ఒకటే ! పిల్లల మంచి భవిత మన బాధ్యత”. ఉపాధ్యాయులు బడిలో చెప్పే పాఠాలు వారికి జీవితంలో నిలదొక్కుకునే జ్ఞానాన్ని అందిస్తాయి. కానీ ఆ జ్ఞానం ఎలా ఉపయోగించాలి అని చెప్పేది మేధావులు మాత్రమే. మంచి జీవనశైలి విద్యార్థి దశలో మలిచినట్లయితే వచ్చే తరమైన బంగారు భారతాన్ని అందించవచ్చు.

దేశం కోసం ప్రాణాలొదలద్దు కానీ...

జీవితంలో కొంత కుటుంబ బాధ్యతలు నెరవేరిన తర్వాత, సమాజ శ్రేయస్సు కోసం మనమందరం ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే మేధావులు వారి కొంత సమయం సమాజ సేవ చేయడానికి ఉపయోగించండి. భారతదేశంలో పుట్టడం ఒక వరం, ఆ దేశం గాలి పీల్చి, రైతు పండించే ధాన్యం తిని కండలు పెంచాము. సైనికుల వలె అందరం సేవ చేయలేము, యుద్ధంలో ప్రాణాలు దేశం కోసం వదలలేము, కానీ మన చుట్టూ ఉన్న సమాజం మార్పుకు ప్రయత్నిస్తే అదే దేశ సేవ అదే భగవత్ సేవ.

- శ్రీదేవి నెల్లుట్ల

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్

Tags:    

Similar News