జీవితాన్ని దర్శించడానికి విశ్లేషించడానికి, ‘సినిమా’ ఒక విధానం. అంతేకాదు మానవ సృజనకు మాస్ మీడియాగా అధిక శాతం ప్రజలకు చేరుతున్న ఒక కళాత్మక రూపం సినిమా. సినిమా దృశ్య ప్రవాహం గానూ, రసాత్మకంగానూ వున్నప్పుడు చిరకాలం చరిత్రలో మిగిలిపోతుంది. ఆ సినిమా కథాత్మకంగానూ, కథేతరంగానూ రెండు రకాలుగా ఉండి ఫిక్షన్, నాన్ ఫిక్షన్‌గా పిలవబడుతున్నది. నాన్ ఫిక్షన్ సినిమా ప్రధానంగా డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ప్రసిద్ధి పొందింది. వీటినే ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్‌గా కూడా పిలుస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రక్రియను అటు ప్రభుత్వాలూ, ఇటు స్వచ్ఛంద సంస్థలూ చరిత్రను నిక్షిప్తం చేయడానికీ, ప్రచారానికీ ఉపయోగిస్తున్నారు. వాటిని సినిమా హాళ్ళల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, టీవీల్లోనూ ఇంటర్నెట్లోనూ వాడడానికీ ఉపయోగిస్తున్నారు. కేవలం ప్రచారానికీ, ఉన్నది ఉన్నట్టు రికార్డ్ చేయడానికీ ఉపయోగిస్తూ డాక్యుమెంటరీ ఫిల్మ్ అర్థాన్ని ఆ రూప లక్ష్యాన్నీ మౌలికతను మార్చేస్తున్నారు. దాంతో వీడియో షూట్ చేసిన ప్రతి ఫూటేజ్‌ని డాక్యుమెంటరీ ఫిల్మ్ అని పిలవడం జరుగుతున్నది.
మొదలైంది ఇప్పుడే!
నిజానికి డాక్యుమెంటరీ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, టూరిజం, చారిత్రక రంగాలతో పాటు సామాజిక సమస్యల విశ్లేషణల చిత్రీకరణ వ్యాఖ్యానాల పరంగా సాగుతాయి. ఇప్పటివరకు అనేక చారిత్రక ఘట్టాల్ని, అపురూప కళాత్మక అంశాల్ని దృశ్యీకరించడంతో పాటు అనేకానేక ప్రజా సమస్యలపైనా డాక్యుమెంటరీ చిత్రాలు ప్రజల్ని చైతన్యవంతం చేశాయి. ప్రపంచవ్యాప్త పోరాటాల్లో ప్రధాన భూమికను పోషించాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కదిలే బొమ్మల ప్రదర్శన మొదలయిన కాలం నుంచి ఫీచర్ సినిమాతో పాటు డాక్యుమెంటరీ సినిమాలు కొనసాగుతున్నాయి. డాక్యుమెంటరీ అన్న మాటను మొదటిసారిగా వాడిన వాడు జాన్ గ్రియర్సన్. ఆయన రాబర్ట్ ఫ్లాహెర్తి తీసిన ‘మోనా’ సినిమాకు ఆ పేరు పెట్టాడు. తర్వాత అమెరికా చలనచిత్ర అకాడమీ డాక్యుమెంటరీ చిత్రాలను ‘ప్రత్యేకమయిన సాంఘిక, శాస్త్రీయ, ఆర్థిక పరమయిన విషయాలతో, వాస్తవంగా జరిగిన లేదా వాస్తవాన్ని సూచించడానికి జరిపిన సన్నివేశాల చిత్రమని వివరించింది. దీనిలో వాస్తవికత, విషయానికే ప్రాధాన్యం కానీ వినోదానికి కాదని వివరించింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా 1894-1922 మధ్య రూపుదిద్దుకున్నాయి. నిజానికి కథా, చిత్రనిర్మాణం ముందస్తుగా రాసుకున్న కథ, కథనాలలో సులువుగా మైదానంలో కారు నడపడం లాంటిది. కానీ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం, జాతరలాగా రద్దీ వున్న మహానగర దారిమీద కారు నడపడం లాంటిది. డాక్యుమెంటరీ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే 1922లో ఫ్లాహార్టి తీసిన ‘మోనా’, ‘నానూక్ ఆఫ్ ద నార్త్’ చిత్రాలు ఒక ఒరవడిని సృష్టించాయి. ఆ తర్వాత డాక్యుమెంటరీ సినిమాల్లో ప్రచార సరళి పెరిగి నాజీ కాలం నుంచి వాటిని పాలకులు తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. మరోవైపు సోవియెట్ యూనియన్ ‘కీనో ప్రవ్దా’ పేరు మీద సినిమాటిక్ వాస్తవాన్ని ఒక ఉద్యమంగా ఉపయోగించుకుంది.
మనదేశంలో డాక్యుమెంటరీల మొదలు..
ఇక మనదేశంలో 1898లో హీరాలాల్ సేన్ తీసిన ‘ఫ్లవర్ ఆఫ్ పార్సియా’ను మొదటి డాక్యుమెంటరీ సినిమాగా చెబుతారు. తర్వాత హరిశ్చంద్ర భాత్వాడేకర్ పలు డాక్యుమెంటరీలు తీశాడు. 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగాన్ని ( A TRYST WITH DESTINY)ని స్వతంత్ర ఫిల్మ్ మేకర్ Ambles J Patel రెండు కెమెరాలు, ధ్వని పరికరాలతో ఆ చరిత్రాత్మక దృశ్యాన్ని చిత్రీకరించాడు. అప్పటికి ఇంకా మన దేశంలో పూర్తిస్థాయి నిర్మాణ యూనిట్ లేదు. కానీ ఏడు దశాబ్దాల తర్వాత మన దేశంలో పూర్తిస్థాయి డాక్యుమెంటరీ నిర్మాణాలు జరుగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తులుగానూ, సంస్థలుగానూ డాక్యుమెంటరీల నిర్మాణం కొనసాగుతూనే వుంది. 1948 ఏప్రిల్‌లో కేంద్రప్రభుత్వం ‘ ఫిల్మ్స్ డివిజన్’ ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వార్తా చిత్రాల నిర్మాణం పంపిణీ బాధ్యతలతో అది ఏర్పడింది. దేశంలోని వివిధ భాషల్లో 1949-50 ల్లోనే 90కి పైగా చిత్రాల్ని తీసింది. ఆ క్రమంలో ఫిల్మ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ఎస్ శాష్ట్రి తీసిన ‘ ఐ ఆమ్ 20’, ఫాలి బిలిమోరియా తీసిన ‘ది హౌస్ దట్ ఆనంద బిల్ట్’ , సుఖదేవ్ తీసిన ‘ఇండియా 1967’, ఏం.ఎఫ్ హుసేన్ తీసిన ‘ త్రూ ది ఐస్ ఆఫ్ పెయింటర్’ లాంటివి విలక్షణమైనవిగా మిగిలిపోయాయి. తర్వాత 1950లలో బర్మా షెల్ కంపెనీ పలు డాక్యుమెంటరీ సినిమాల్ని నిర్మించింది. ఇక యూరోప్‌లో శిక్షణ పొంది వచ్చిన పి.వి పతి, ది.జి.టెండూల్కర్, కె.ఎస్.హిర్లేకర్, పాల్ జిల్స్, బిల్లీమొరా తదితరుల కృషితో భారతీయ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం విజయవంతంగా ముందుకు సాగింది.
అనంతర కాలంలో డిజిటల్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింతర్వాత భారతీయ డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం గొప్పగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. 1990ల్లో దూరదర్శన్‌లో డాక్యుమెంటరీల ప్రసారం జరిగేది. ఇక 1995లో డిస్కవరి చానల్, 1998లో జియోగ్రాఫికల్ చానల్‌లు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీల స్థితి మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్లానేట్, లైఫ్ స్టైల్ ఛానెల్ ఏర్పాటుతో మరింత ప్రోత్సాహం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇట్లా టీవీలతో పాటు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ ట్రస్ట్ లాంటి సంస్థలు డాక్యుమెంటరీల నిర్మాణానికి ప్రధాన వేదికలుగా నిలిచాయి. ఇక డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణ శిక్షణకు సంబంధించి సమాచార కార్యదర్శి అన్వర్ జమాల్ కిద్వాయి కృషి ఎన్నదగింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ పరిశోధనా కేంద్రాల్ని ప్రారంభించి యూజీసీ తదితర సంస్థలతో నిధుల్ని సమకూర్చారు.
గొప్ప డాక్యుమెంటరీ ఫిలింలు..
డాక్యుమెంటరీ నిర్మాణ రంగంలో భారతీయ డాక్యుమెంటరీ దర్శకుల్లో ఆణిముత్యాల్లాంటి వాళ్ళు ఎందరో ఎదిగి వచ్చారు. అత్యంత సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి ప్రజా ప్రయోజనకరమైన, ప్రజా ఉద్యమ నేపధ్యంలోంచి డాక్యుమెంటరీలను నిర్మించి సామాజిక దర్పణాల్ని ఆవిష్కరింపజేశారు. మైక్ పాండే గ్రీన్ ఆస్కార్ అవార్డును అందుకొని ఆసియా ఖండంలోనే మొదటివాడుగా నిలిచాడు ‘రోగ్ ఎలిఫెంట్స్ ఆఫ్ ఇండియా’, ‘షోర్ వేల్ శార్క్స్ ఆఫ్ ఇండియా’ లాంటివి పాండెకు అంతర్జాతీయ ఖ్యాతిని సమకూర్చాయి. ఇక ఆనంద్ పట్వర్ధన్ గత అనేక దశాబ్దాలుగా అత్యంత ప్రభావవంతమయిన డాక్యుమెంటరీలతో ప్రపంచవ్యాప్తంగా తన ముద్రను వేశాడు. ప్రజా సమస్యలూ, పౌర హక్కులపైన ఆయన కృషి అనితర సాధ్యమయింది. ఆనంద్ తీసిన 'Waves of Revolution', 'Prisoners of Conscience' , ‘బాంబే హమారా షహార్’, ‘వార్ అండ్ పీస్’, ‘ఫాదర్ సాన్ అండ్ హోలీ వాటర్’, ‘జై భీమ్’ లాంటివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఆయన సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు, కోర్టులు జోక్యం చేసుకోవడం లాంటివి సర్వ సాధారణమయినాయి. రాకేశ్ శర్మ తీసిన ‘ఫైనల్ సొల్యూషన్’ లాంటివి, సంజయ్ కక్ తీసిన ‘లాండ్ మీ లాండ్ ఇంగ్లండ్’, ‘గీలి మిట్టీ’, ‘హార్వెస్ట్ ఆఫ్ రైన్’ లాంటివి, అమర్ కన్వర్ తీసిన ‘ ఎ సీసన్ ఔట్ సైడ్’, ‘నైట్ ఆఫ్ ప్రొఫెసి’ లాంటి డాక్యుమెంటరీలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాహుల్ రాయ్ తీసిన ‘వెన్ అవర్ ఫ్రెండ్స్ మీట్’ సబా దేవన్ తీసిన ‘ బర్ఫ్ స్నో’, వందన కొహలి తీసిన ‘ అబిస్’ లాంటివి వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు సమాజంలోని భిన్నకోణాల్ని ఆవిష్కరించి గొప్పగా నిలిచాయి.
ఇట్లా వ్యక్తిగత స్వతంత్ర ప్రయత్నాలు జరగడంతో పాటు సంస్థలుగా ఫిల్మ్స్ డివిజన్ 1990 నుంచి ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్, అనిమేషన్ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నది. అంతేకాకుండా కరీంనగర్ ఫిల్మ్ సొసైటితో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కూడా డాక్యుమెంటరీ చిత్రాల ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాయి. వాటి ఫలితంగా ఉత్తమమయిన డాక్యుమెంటరీలకు మంచి వేదికలు ఏర్పాటవుతున్నాయి. మనదేశంలో ఎన్నో గొప్ప గొప్ప డాక్యుమెంటరీ సినిమాలు నిర్మాణమవుతూనే వున్నాయి. ఫిల్మ్స్ డివిజన్, పిఎస్‌బీటి లాంటి సంస్థలు ప్రోత్సహిస్తూనే వున్నాయి. వాటిలోంచి కొన్ని గొప్ప భారతీయ డాక్యుమెంటరీ చిత్రాలు గులాబీ గాంగ్, ఇన్ సైడ్ మహా కుంభ్, ద వర్ల్ద్ బెఫోర్ హర్, ద స్టోరీ ఆఫ్ ఇండియా, ఇండియా అంతచ్ద్, బార్న్ ఇంటు బ్రోతల్స్, చిల్డ్రన్ ఆఫ్ ఫైర్, స్మైల్ పింకీ, సూపర్ మాన్ ఆఫ్ మాలెగావ్, బియాండ్ ఆల్ బౌండరీస్, అమ్మ అండ్ అప్పా, చిల్డ్రన్ ఆఫ్ ఇన్ఫెర్నో, ప్రాస్టిట్యూట్స్ ఆఫ్ గాడ్, ఐ కన్ లవ్ టూ, జారీనా పోర్త్రైట్ ఆఫ్ ఇజ్దా, మ్యాంగో గర్ల్స్.
వారాల ఆనంద్
94405 01281