కరోనా తర్వాతే గుండెపోట్లు పెరిగాయా?
కరోనా తర్వాతే గుండెపోట్లు పెరిగాయా?... did Heart Problems increase after COVID-19
ఇటీవల ఎక్కువగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సెకన్ల వ్యవధిలో ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు గుండెపోటు అనే పదం తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చిన్న, పెద్ద, ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడనే భేదం లేకుండా అందరినీ హార్ట్ ఎటాక్ కాటేస్తుండడం చర్చనీయాంశం.
వయసుతో సంబంధం లేని మరణాలు..
కొద్ది రోజుల క్రితం ఆరోగ్యవంతుడైన ఓ యువ పోలీస్ జిమ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అలాగే నిర్మల్ జిల్లా పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్న 19 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. సికింద్రాబాద్‌లో 38 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకి గురయ్యాడు. మేడ్చేల్‌లోని సీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థి స్నేహితులతో మాట్లాడుతూ, అలాగే అయిదవ తరగతి చదువుతున్న బాలిక స్నానం చేస్తూ, పల్నాడులో 17 సంవత్సరాల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు కబడ్డీ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు ఒదిలాడు. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు, హఠాన్మరణాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నందమూరి తారకరత్న లాంటి వారు యుక్తవయస్సులోనే గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ ఒకరు, కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం వైద్యులకు కూడా అంతుచిక్కని అంశంగా మారింది.
కరోనా తర్వాత పక్షవాతం, గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆ మరణాలకు కరోనాయే కారణమని చెప్పే ఆధారాలేవీ లేవని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా బారీన పడ్డవారిలో కొద్ది మందిలో గుండె, మెదడులో రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్నా, ఆస్పిరిన్ లాంటి మందులు వాడటంతో రక్తం గడ్డ కట్టకుండా చాలావరకు దాన్ని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆరు నుంచి 12 వారాల లోపు మాత్రమే దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందని వైద్యులు బలంగా చెపుతున్నారు. అలాగే వ్యాక్సిన్ ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుందని ఆ తరువాత దాని వలన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం లేదని వైద్యులు తెలుపుతున్నారు.
సీపీఆర్ పై అవగాహన అవసరం..
అయితే, గుండెపోటు రావడానికి కారణాలు ఏవైనా గుండెపోటుకు గురైన రోగుల ప్రాణాలను పక్కనున్న వారు కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్ ( సీపీఆర్) ప్రక్రియ ద్వారా ప్రయత్నిస్తే చాలా వరకు ప్రాణం కాపాడవచ్చని అనేక పరిణామాలు రుజువు చేశాయి. సీపీఆర్‌ను హృదయ శ్వాసకోశ పునరుజ్జీవం అంటారు. అయితే దీనిని గుండెపోటు వచ్చిన అందరికీ చేయకూడదు. ప్రధానంగా గుండెపోటు రెండు రకాలు. అవి, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో రక్తం చిన్న మోతాదులో గడ్డ కట్టి గుండెపోటుకు గురవుతుంటాడు. ఈ సమయంలో రోగి గుండె, పల్స్ పని చేస్తూ స్పృహలో ఉంటారు. ఇటువంటి వారికి సీపీఆర్ చేయకూడదు. వారిని యుద్ధప్రాతిపదికన హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించాలి. రెండవరకం, అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పోతుంటారు. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ జరిగిన వ్యక్తి గుండె, పల్స్ ఆగిపోతాయి. ఇటువంటి వారికి సీపీఆర్ ప్రక్రియ ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. సీపీఆర్ ప్రక్రియ క్రమ పద్ధతిలో చేయాలి.
కార్డియాక్ అరెస్ట్ అయిన వ్యక్తిని పడుకోబెట్టి గాలి తగిలేలా తల వెనుకకు వంచి గడ్డం పైకి ఎత్తి పెట్టాలి. ఎడమ, కుడి వేళ్ళ సహాయంతో ఛాతీ మధ్యలో చేతులు, మోచేతులు నిటారుగా ఉంచి నిమిషానికి 100 నుంచి 120 పర్యాయాలు అదమాలి. కనీసం ఛాతీ 4 సెంటీమీటర్లు లోపలికి వెళ్ళేటట్లు నొక్కాలి. ఇలా 20 నిమిషాల దాకా చేయవచ్చు. మధ్యలో నోటితో కూడా శ్వాస అందించవచ్చు. ఈ విధంగా సీపీఆర్ ప్రక్రియ నిర్ణీత ప్రమాణాలతో చేస్తే కార్డియాక్ అరెస్ట్ అయిన వ్యక్తి గుండె, పల్స్ కొట్టుకోవడం ప్రారంభమయ్యి గుండెకు, మెదడుకు రక్తం, ఆక్సిజన్ ప్రసరణ పునరుద్ధరణ జరిగి రోగి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీపీఆర్ ప్రక్రియ ద్వారా సత్ఫలితాలు పొందాలంటే అది చేసే వ్యక్తికి మొదట దానిపై పూర్తి అవగాహన అవసరం. ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు. అలాగే దీనిని సామాజిక బాధ్యతగా భావించి సీపీఆర్‌పై తగిన తర్ఫీదు పొందవలసిన బాధ్యత ప్రజలపై ఉంది.
కైలసాని శివప్రసాద్
9440203999