జీవితంలో సవాళ్లను అధిగమించి, ప్రగతి సాధించడానికి మానసిక దృఢత్వం చాలా అవసరం. శారీరక సామర్థ్యం, మానసిక బలం, సామాజిక స్పృహ ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నట్టు. మంచి ఆహారం, చక్కని వ్యాయామం శరీరానికి శక్తిని చేకూరుస్తాయి. సానుకూల ఆలోచనలు మానసిక బలాన్ని చేకూరుస్తాయి. సమాజం పట్ల సరైన అవగాహన పెంచుకుంటే లోకజ్ఞానం వస్తుంది. అయితే అన్నింటికన్నా మనోబలం ముఖ్యం అంటారు విజ్ఞులు. దీని సాధన కోసం కొన్ని అలవాట్లు చేసుకోవడం అవసరం.
కృతజ్ఞతా ప్రదర్శన
కృతజ్ఞతా భావం మానవత్వానికి చిహ్నం. చేసిన మేలు మరవక పోవడం అవసరం. కొంతమంది అవసరం తీరగానే మేలు చేసిన వారిని పక్కన పెడుతుంటారు. ఇలాంటి వారిని సమాజంలో ఎవరు నమ్మరు. కృతజ్ఞతా భావాన్ని వ్యక్త పరచడం వల్ల సంతృప్తి కలుగుతుంది. వీరు బాగా నిద్ర పోతారని, తక్కువ రక్తపోటును కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. నిరాశావాదం, ప్రతికూల భావాలు, మనో శక్తిని దెబ్బ తీస్తాయి. ఆత్మ న్యూనతా భావం వల్ల ప్రతి అంశం ప్రతికూలంగా కనిపిస్తుంది. దీని వల్ల మానసిక రుగ్మతలు పెరిగి, శారీరక శక్తి క్షీణిస్తోంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలు మనసులో మెదలగానే మనసును అదుపులో పెట్టుకోవాలి. ధ్యానం లేదా విశ్రాంతి ద్వారా ఉపశమనం పొంది సానుకూల ఆలోచనలు ప్రారంభించాలి. అలాగే సమస్యలను తట్టుకోవడం చాలా కీలకం. మనం నియంత్రించలేని వాటిని స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ప్రకృతి ధర్మాలను ఆచరించాలి. ఒక్కోసారి కర్మ సిద్ధాంతం, ఆధ్యాత్మిక భావన కూడా సమస్యలను తట్టుకోవడానికి దోహద పడుతుంది. ఇలాంటి వారిలో అభివృద్ధి కుంటుబడుతుంది. దీని వల్ల బద్దకం, సోమరితనం ఆవహిస్తుంది.
ఉద్వేగ ప్రజ్ఞ పెంచుకోవాలి
భయం, బాధ ఆందోళన, దుఃఖం, కోపం లాంటి భావాలు మానసిక ఒత్తిడికి కారణంగా మారుతాయి. ప్రేమ, త్యాగం, కృతజ్ఞత, క్షమ లాంటి భావాలు సంతోషానికి బాటలు వేస్తాయి. మనిషిలో అన్ని రకాల ఉద్వేగాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటి ప్రభావం శరీరం, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉద్వేగ నియంత్రణ, నిర్వహణ అలవాటు చేసుకోవాలి. స్వీయ గౌరవం వ్యక్తిలో ఆత్మ విశ్వాసం పెంచుతుంది. ఎదుటి వారి విమర్శలను తట్టుకునే శక్తి వస్తుంది. పొరపాట్లు, తప్పులు చేయడం మానవ సహజ లక్షణం. అయితే వాటిని చూసి కృంగిపోకుండా నిలబడాలి. సరిదిద్దుకుని మరింత ఉత్సాహంతో ముందుకు పోవాలి. మనిషిని సామాజిక జీవి అంటారు సామాజిక వేత్తలు. సమాజంలో సుఖ సంతోషాలు అందుకోవాలంటే అందరి సహకారం అవసరం. సామాజిక సంబంధాలు విస్తరించుకున్న వారికి అభివృద్ధి సులభంగా అందివస్తుంది. నైతిక విలువలు, సామాజిక ధర్మాలు, సేవ, సహకారం లాంటి గుణాలు సామాజిక సంబంధాలను విస్తృత పరుస్తాయి. అయితే ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి. సమస్య ఎదురైనపుడు దానిని ఒక సవాలుగా స్వీకరించి అధిగమించాలి. ఈ ప్రక్రియ అలవాటు చేసుకుంటే ఒత్తిడి స్థానంలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
ధ్యానం అలవాటు చేసుకోవాలి
ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి శక్తి పెరుగుతుంది. ధ్యానం అంటే పద్మాసనంలో కూర్చుని చేయాలన్న నిబంధన అవసరం లేదు. తీరిక లేని వారు ప్రయాణం చేస్తున్న సమయంలో లేదా పనిచేస్తున్న చోట కొంత సమయం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. దృఢమైన శరీరంలో బలమైన మనసు ఉంటుంది అంటారు పెద్దలు. మనసు అన్నది మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు అనవచ్చు. అందుకే మనసు వికలమై నపుడు శారీరక, మానసిక, నాడీ రుగ్మతలు తలెత్తుతుంటాయి. శరీరంపై శ్రద్ధ వహిస్తే మనసు శక్తివంతం అవుతుంది. సమతుల ఆహారం, చక్కని వ్యాయామం, సరిపడా నిద్ర, సత్సంబంధాలు శారీరక ఆరోగ్యానికి దోహదపడుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు హార్మోన్లు సమతుల్య స్థితిలో ఉండి మనసును చైతన్య పరుస్తాయి.
పాకలపాటి అమర్ నాథ్
మానసిక నిపుణులు, సైకాలజిస్ట్
86882 52552