Delimitation:డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకే భారీ నష్టం!
ప్రగతిశీల విధానాలతో ముందుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) వలన తక్కువ లోక్‌సభ స్థానాలు
ప్రగతిశీల విధానాలతో ముందుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) వలన తక్కువ లోక్‌సభ స్థానాలు పొందనుండటం, జనాభా నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధి పొందనుండటం దురదృష్టకరం. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోతాయి. ఫలితంగా స్వంతంత్ర వేర్పాటువాద ధోరణులు హెచ్చరిల్లే అవకాశాలున్నాయి. అలా రాకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దశాబ్దాల కాలంలో జనాభా పెరుగుదల తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ హుందాగా వ్యవహరిస్తుందా? లేక వివక్ష చూపిస్తుందా?
ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలనేది ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం ఉన్న సీట్లు 1971 జనాభా లెక్కల ప్రకారం విభజించినవి. అయితే, 1971 తరువాత దక్షిణ భారత రాష్ట్రాలు జనాభాను బాగా తగ్గిస్తూ వచ్చాయి. అదే సమయంలో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలు జనా భాను పెంచుతూ పోయాయి. దీంతో జనాభా ను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్ల సంఖ్య తగ్గుతుంది. జనాభాను పెంచిన ఉత్తర రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్లు పెరుగుతాయి. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటికీ ఉత్తర భారత ఆధిపత్యంపై అనేక విమర్శలున్నాయి. ఆఖరికి ఎంపీ స్థానాల్లో కూడా దక్షిణాది బలం తగ్గిపోతే, ఇక దక్షిణ భారత్ నామమాత్రం అయిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒక ఓటు – ఒక విలువ...
నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించి, ఏ నియోజకవర్గంలో ఎంత మంది జనాభా ఉండా లి, ఏ ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించే ప్రక్రియను పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంటారు. రాజ్యాంగంలోని 82, 170 ప్రకరణల ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. 1952, 1962, 1972, 2002లలో పునర్విభజనలు జరిగాయి. పునర్విభజన జరిగినప్పుడే సీట్ల సంఖ్య పెంచడం, తగ్గించడం కూడా చేస్తారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను విభజిస్తే దక్షిణ భారతానికి తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశ పౌరులందరి ఓటుకూ ఒకే విలువ ఉండాలని రాజ్యాంగం కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం యూపీలో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అంటే ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువ, యూపీ ఓటర్ విలువ తక్కువ అవుతుంది కదా. అలా జరగకుండా ఉండటం కోసం జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు. ఒక నియోజవకర్గంలో లక్ష మంది కలసి ఒక ఎంపీని ఎన్నుకుని, మరో నియోజకవర్గంలో పాతిక లక్షల మంది ఒకే ఎంపీని ఎన్నుకోవడం కాకుండా, ప్రతీ ఓటుకీ సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ జరిగినప్పుడే అది ప్రజాస్వామ్య పునాదులకు బలాన్ని చేకూరుస్తుంది.
దక్షిణాదికి భారీ నష్టమా?
1970ల మధ్య నుంచి 1980ల వరకూ భారతదేశం జనాభా నియంత్రణకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఆరుగురు, పదిమంది పిల్లలను కనవద్దు ...ఒకరిద్దరు పిల్లల్ని కంటే చాలు అంటూ ప్రభుత్వాలు విరివిగా ప్రచారం చేశాయి. ఆ దిశగా దక్షిణ భారత్‌లో మార్పు వచ్చింది. తక్కువ మంది పిల్లల్ని కన్నారు. ఫలితంగా జనాభా బాగా తగ్గింది. కానీ ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపై ప్రచారం సరిగా లేనందున జనాభా అలాగే ఉండిపోయింది. తీరా చూస్తే హిందీ రాష్ట్రాల్లో ఇప్పుడు విపరీతమైన జనాభా ఉంది. జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ సమస్యలు, తక్కువ ఉంటే ఎక్కువ లాభాలు అనే ధీమా ఉంది, కుటుంబ నియంత్రణ కారణంగా దక్షిణ భారతం హిందీ రాష్ట్రాల కంటే చాలా విషయాల్లో ముందుండడానికి దోహదపడింది. ఇప్పుడిదే శాపంగా మారబోతోందా? అనే భయం దక్షిణాది ప్రజల్లో బలంగా ఉంది.
అంతరాలు తగ్గిపోతాయనుకున్నప్పటికీ..
1976 వరకూ, డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారుతుండేది. అప్పటి వరకూ అన్నిచోట్లా జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య ఒకట్రెండు సీట్లు పెరిగినా, తగ్గినా పెద్ద తేడాలు రాలేదు. సమస్య కాలేదు. కానీ, ఆ తరువాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులు వచ్చాయి అలాగే, 1976లో ఒక రాజ్యాంగ సవరణ ప్రకారం, నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చు కానీ, ఒక రాష్ట్రానికి ఉన్న ఎంపీల సంఖ్యను మార్చకూడదనేది ఆ సవరణ సారాంశం. అంటే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య నికరంగా ఉంటుంది. అప్పట్లో దానికి పాతికేళ్ల డెడ్ లైన్ పెట్టారు. అంటే 1976 నుంచి 2001 వరకూ మొదటి డెడ్‌లైన్ పూర్తయింది. 2001 నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గిపోతాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో 2001లో మరోసారి ఈ ఫ్రీజింగ్ గడువు మరో 25 ఏళ్లకు పెంచారు. అంటే 2026 అన్నమాట. ఇప్పటి డీలిమిటేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ డెడ్ లైన్ ఇప్పుడు పూర్తయిపోతుంది. ఈ డీలిమిటేషన్లో ఆయా రాష్ట్రాలకు వచ్చే ఎంపీల సంఖ్య మార్చే అవకాశం చట్ట ప్రకారం కుదురుతుంది. చట్ట ప్రకారం 2026 తరువాత జనాభా లెక్కలు ఎప్పుడు జరిగితే అప్పుడు, వాటి ఆధారంగా నియోజవకర్గాల పునర్విభజన జరగాలన్నది మరో నిబంధన. ఇదే దక్షిణాది పార్టీల భయానికి కారణం.
అంతుచిక్కని బీజేపీ...
బీజేపీ తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, దక్షిణాదిన సీట్లు తగ్గించి, హిందీ ప్రాంతంలో సీట్లు పెంచాలని చూస్తోంది. అందుకోసం 2039 వరకూ ఆగకుండా అంతకుముందే డీలిమిటేషన్ చేయాలన్నది వారి ప్లాన్. అందుకోసం 2021 జనాభా లెక్కలను కోవిడ్ తగ్గి పోయినప్పటికీ, కావాలని ఆలస్యం చేసి 2026 తరువాత జరిగేలా చూసి, అప్పుడు వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయబోతోంది. ఇది కొందరు సోషల్ మీడియా వేదికగా చెప్పిన సొంత విశ్లేషణ. ఈ వార్తలే దక్షిణ భారత పార్టీలను కంగారు పెట్టాయి. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పడు అన్యాయం అవుతున్నాయి. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35% జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు ఈ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోతాయనే బాధ ఎక్కువగా ఉంది.
పరిష్కారం ఏంటి?
రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచ కుండా, ప్రతీ రాష్ట్రానికీ నియమిత శాతం ప్రకా రం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది చెబుతున్నారు. ఉదాహరణకు లోక్ సభలో 30 శాతం సీట్లు పెంచితే, అప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు మరో 24 చేర తాయి. అలానే ఆంధ్రాలో 25కి 7 సీట్లు చేర తాయి. అలాంటి పద్ధతి వల్ల ఇబ్బంది ఉండదు. దశాబ్దాల కాలంలో జనాభా పెరుగుదల తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ హుందాగా వ్యవహరిస్తుందా? లేక వివక్ష చూపిస్తుందా? అని జనాభా లెక్కల తరువాతే తేలుతుంది. కొందరు విశ్లేషకులు అసలు లోక్‌సభ సీట్లు పెంచాల్సిన అవసరం లేదనే వాదిస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా ప్రజలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండడ మే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి సీట్ల సంఖ్య పెంచాలని ప్రతిపాదిస్తున్నా రు ఇంకొం దరు. ఏమైనా ఈ పంచాయతీ మళ్లీ జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే తేలుతుంది.
డాక్టర్. బి. వి. కేశవులు
చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం
85010 61659