శాస్త్రి మృతిపై తీరని సందేహాలు

శాస్త్రి మృతిపై తీరని సందేహాలు... death mystry of lal bahadur sastri

Update: 2023-01-16 18:30 GMT

భారతదేశ మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై సందేహాలు తీరనే లేదు. తాష్కెంట్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నా, అది ప్రణాళికాబద్ధమైన హత్యగా చర్చకు తెరలేపింది. 1965 ఆగస్టులో, పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భారత సైన్యం విజయానికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెకోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. ఈ దశలో ఐక్యరాజ్య సమితి పాక్‌తో విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది.

విషప్రయోగ ఆరోపణలతో

ఈ ఒప్పందానికి అంగీకరించే విధంగా శాస్త్రిపై తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. 1965లో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్ ఖాన్ తాష్కెంట్‌లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మృతి చెందాడు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చరిత్రలో మునుపెన్నడూ లేదు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. శాస్త్రి భౌతిక ఖాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. అంతకు ముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడారు. పాలుతాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. తర్వాత దాదాపు పదిహేను నిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తి 15 నిమిషాల్లో మృతి చెందినట్లు చెప్పడంపై సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

సాక్ష్యులందరూ ప్రమాదానికి గురై

శాస్త్రి వెంట ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్‌ చుగ్‌ కూడా తాష్కంట్‌ వెళ్ళాడు. అతనూ పక్కగదిలోనే ఉన్నా, కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయనకు కూడా సోవియట్‌ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు. భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతిక కాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి విష ప్రయోగం వల్ల మరణించాడని ఆయన భార్య లలితా శాస్త్రి ఆరోపించారు. శాస్త్రి మరణం చుట్టూ ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ఆయన కుమారుడు సునీల్ శాస్త్రి, తండ్రి మరణానికి వెనుక ఉన్న మర్మాన్ని తెలియ చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరాడు. పోస్టు మార్టం చేయనప్పటికీ తన తండ్రి శరీరంపై గాట్లు ఏర్పడానికి కారణమేంటని అడిగాడు. తమ తాతకు తాష్కెంట్‌లో హోటల్ బుక్ చేయాలనుకుని, ఆయనకు సోవియట్ ప్రభుత్వం ఒక కాటేజ్ కేటాయించిందని, అందులో టెలీప్రింటర్, టెలిఫోన్ కూడా లేవని శాస్త్రి మనవడు సంజయ్ పేర్కొన్నారు. మృతదేహం ఢిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించిందని, ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించారు.

ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్‌ చుగ్‌ బయలు దేరాడు. కారులో ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీకొనగా, చుగ్ అక్కడికక్కడే మరణించాడు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్‌ కూడా ఆయనతో పాటు తాష్కంట్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చాడు. ఆయనను కూడా కమిటీ సాక్షిగా లెక్కించి. వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకు వేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాధ్‌ రెండుకాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయాడు. భారత ప్రభుత్వం ఆయన మరణం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.

ఈ ఉదంతంపై సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. శాస్త్రి, భారత అణు పితామహుడు హోమీబాబా మరణాలు ఒకే నెలలో రెండు వారాల వ్యవధిలో జరిగాయి. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది. దీనిపై కేంద్రం రాజ్‌నారాయణ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయన నివేదిక ఇప్పటివరకు వెలుగు చూడలేదు. ఆఖరికి ఇది భారత పార్లమెంట్‌ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు. ఇదే అతిపెద్ద విషాదం.

రామకిష్టయ్య సంగన భట్ల

9440595494

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News