ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించండి!

తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉమ్మడి కార్యాచరణ

Update: 2024-09-27 01:00 GMT

తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉమ్మడి కార్యాచరణ సమితి (జేఏసీ) గా ఏర్పాటై 36 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఇందులో ఆర్థిక భారం లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఒక ప్రధాన అంశం. దీన్ని పరిష్కరిస్తే అటు నాలుగు దశాబ్దాలుగా వివక్షకు గురైన జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారంతో పాటు, ఇటు పాఠశాల విద్యారంగంలో పర్యవేక్షణ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం 1992లో పదోన్నతుల కోసం కామన్ సర్వీసు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ న్యాయస్థాన సూచనలతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. 1992లో సుందరేశన్ ఏకసభ్య కమిటీ విద్యాశాఖలోని విద్యార్థుల బోధనకు సంబంధం ఉండే పర్యవేక్షణ మరియు పాలనా సంబంధమైన పోస్టులను బోధనలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అర్హత కల్పించాలని , కార్యాల య సంబంధమైన పాలనా పోస్టులకు బోధనేతర సిబ్బందికి అవకాశం కల్పించాలని సిఫార్సులు చేసింది. ఆ మేరకు 1998లో కామన్ సర్వీస్ రూల్స్ విడుదలయ్యాయి. తర్వాత 2005లో మరోసారి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం ఉత్త ర్వులు ఇచ్చినప్పుడు న్యాయ వివాదంతో ఈ రెండు సార్లు అమలు కాలేదు.

ఆర్టికల్ 309 ప్రకారం..

2015‌లో ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ‘‘జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులైనందున లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించే స్వేచ్ఛ కలిగి ఉందని, అట్టి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఆ మేరకు 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు జరిగాయి. అయితే ఈ సవరణలను 2018లో హైకోర్టు కొట్టివేస్తూ రాష్ట్రపతికి లోకల్ కేడర్‌గా ఆర్గనైజేషన్ చేసే అధికారమే ఉందని, ఏకీకృతం చేసే అధికారం లేదని ఆదేశాలిచ్చింది. అంటే ఈ ఆదేశాల ప్రకారం మండల / జిల్లా పరిషత్ పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్లుగా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతి పొంది ఆ తరువాత ఆర్టికల్ 309 ప్రకారం ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను జారీ చేస్తూ వారి సేవలను ఏకీకృతం చేయవచ్చు. అంటే లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడం వరకు ఆర్టికల్ 371డి కి సంబంధం ఉంటే, సర్వీసుల ఏకీకృతం చేయడం ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుంది. ఇట్లా తెలంగాణ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వం ఉన్న హక్కులను పునరుద్ధరించడానికి కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి చారిత్రక అవకాశం వచ్చింది.

న్యాయవివాదాలు లేనందున..

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 33 జిల్లాలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వులను 2018లో అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులలో పేరా 3(3)లో పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఏకీకృతం గురించిన సవరణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2021లో పంచాయతీరాజ్ శాఖలోని వివిధ పోస్టులను లోకల్ కేడర్లుగా వర్గీకరిస్తూ 204 జీవోను 2021లో ఇచ్చారు. విద్యాశాఖలోని పోస్టులను జీవో 158 ద్వారా, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను జీవో 245 ద్వారా, మండల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులను జీవోలు 256 , 257 ద్వారా లోకల్ కేడర్లుగా వర్గీకరించారు. దీని ఫలితంగా సుప్రీంకోర్టు / హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం వేరువేరు లోకల్ క్యాడర్లుగా ప్రభుత్వ పాఠశాల మరియు జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వర్గీకరింపబడినట్లు అయింది. కనుక న్యాయవివాదాలేమీ లేనందున అవసరమైతే న్యాయ సలహాలను కూడా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 309 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి రెండు కేడర్లను ఏకీకృతం చేస్తూ సర్వీస్ రూల్స్ రూపొందించే అధికారం ఉంది.

వివాదాన్ని ముగించే అవకాశం..

రాష్ట్రవ్యాప్తంగా 612 మండలాలకుగాను 596 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా, 66 పోస్టులకు గాను 64 డిప్యూటీ డీఈవో పోస్టులు, 33 జిల్లాలకు గాను 26 డీఈవో పోస్టులు ఖాళీలు ఉండి విద్యా పాలన కుంటుపడింది. పర్యవేక్షణ పడకేసింది. ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన , హాజరు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాల వంటి అంశాలను పర్యవేక్షించే అవకాశం లేదు. కోర్టు పరిధిలో ఉన్నదనే కారణంగా గత రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ప్రభుత్వం 21డీఈవో, 28 డిప్యూటీ ఈవో, 59 ఎంఈవో పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ పోస్టుల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి, భర్తీ చేసి, కామన్ సర్వీస్ రూల్స్ విడుదల చేసి పదోన్నతులు ఇచ్చి పర్యవేక్షణ సంక్షోభాన్ని నివారిస్తే గత నాలుగు దశాబ్దాల వివాదాన్ని ముగించే చారిత్రక అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది.

- కె. వేణుగోపాల్

పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్,

98665 14577

Tags:    

Similar News