నడుస్తున్న చరిత్ర:మంత్రి గారికి పౌర వినతి

ప్రజాప్రతినిధి కూడా ఒక వ్యక్తే అయినా ఆయన జనసమూహానికి ప్రాతినిధ్యం వహించే శక్తి. జనం ఆశలు, ఆకాంక్షలు, విలువల కోసం పాటుపడే సమష్టి రూపం. ఒక రాష్ట్రానికి మంత్రి అంటే కోట్లాది ప్రజల కలలను నిజం చేసేందుకు కృషి

Update: 2022-05-09 18:45 GMT

తెలంగాణాలో ముఖ్యమంత్రితో కలిసి 17 మంది మంత్రులున్నారు. వీరిలో రాజకీయ నేపథ్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి, ప్రజలతో, అధికారులతో, పాత్రికేయులతో, సాటి పెద్దలతో, వివిధ వృత్తులలోని నిష్ణాతులతో ఎలా వ్యవహరించాలో తెలిసినవారూ ఉన్నారు. పాలన ఎలా ఉన్నా, తమ శాఖలపై తమ పెత్తనం ఎంతున్నా గుంభనంగా, మాట మర్యాదలో లోటు రాకుండా చూసుకుంటారు. రాష్ట్ర గౌరవాన్ని, ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతూ మాట్లాడుతుంటారు. మంత్రి హోదాకు ఉండవలసిన కనీస హుందాతనమది.

ప్రజాప్రతినిధి కూడా ఒక వ్యక్తే అయినా ఆయన జనసమూహానికి ప్రాతినిధ్యం వహించే శక్తి. జనం ఆశలు, ఆకాంక్షలు, విలువల కోసం పాటుపడే సమష్టి రూపం. ఒక రాష్ట్రానికి మంత్రి అంటే కోట్లాది ప్రజల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నవాడిగా, తన శాఖ ద్వారా సేవలందిస్తూనే జనం అవసరాలను ప్రభుత్వానికి విన్నవించే చొరవగల ప్రజానేతగా నిలవాలి. ఇవేవి చేయకుండా అవకాశం దొరికినప్పుడల్లా 'జై కేసీఆర్-జై కేటీఆర్' అని అరుస్తూ తనకు పదవి కట్టబెట్టినందుకు వారిని ఆకాశానికెత్తుతూ గడపడమే పనిగా పెట్టుకుంటే ఆ మంత్రి ద్వారా రాష్ట్ర ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమిటనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.

ఓటరుగా, రాష్ట్ర పౌరుడిగా ఎవరికైనా తమ నేతల గుణగణాలను, మంచి చెడులను ప్రకాశంగా మాట్లాడుకునే హక్కు ఉంటుంది. నమ్మి ఓటేసి గెలిపించినపుడు అందుకు బదులుగా వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారనే సమాలోచన జన కనీస ధర్మం. మంత్రుల సద్గుణాలపై, సకర్మలపై రాష్ట్ర భవిత, ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది గనుక వారి కదలికలపై ప్రజల కన్ను ఉండాల్సిందే. రాష్ట్ర ప్రజల గౌరవ మర్యాదలకు ప్రతినిధిగా నిలిచే మంత్రి ఈ విలువలను గుర్తెరుగకుండా, స్థల కాల సందర్భ విచక్షణ లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ భరించడం పౌరనీతి కాదు. అధినేతలకు చీమ కుట్టినట్లు లేకున్నా పౌరులు మౌనంగా సహించడం జాతికి నష్టంగా భావించాలి. ఒక తెలంగాణ మంత్రిపై చేసే ఉదాహరణలతో కూడిన ఈ పరామర్శ ప్రజల అభిమతానికి అద్దం పట్టడమే తప్ప వ్యక్తిగత విమర్శ కాదు. పౌర హక్కును, స్వేచ్ఛను అధిగమించి కూడా కాదు. ఇందులోని ప్రతి అంశం ఇదివరకే మీడియా ద్వారా నలుగురికి తెలిసినదే. వాటిని క్రోడీకరించి వరుస క్రమంలో పెట్టడం మాత్రమే జరిగింది.

ఉద్యమంతో సంబంధం లేకున్నా

ప్రస్తుతం తెలంగాణ మంత్రి మండలిలో ఉన్న కొందరితోపాటు ఈ మంత్రికి కూడా తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. అగ్ర సామాజికవర్గానికి చెందిన ఈయన విద్యా వ్యాపారిగా ఎదిగి కోట్లు గడించి రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయానుభవం లేకున్నా, తెలంగాణ ఆకాంక్షలు తెలియకున్నా మంత్రి పదవి దక్కడానికి ఆయన కులం, ధనం అర్హతలుగా భావించవలసి వస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుండి ఆయనపై వివిధ రకాల అరోపణలు మీడియాలో ప్రధాన వార్తలుగా కనబడుతున్నాయి. ఆత్మ గౌరవం కోసం నిలబడే తెలంగాణ బిడ్డగా వాటి ప్రస్తావన, వేదన తప్ప వ్యక్తిని లక్ష్యం చేసుకొనే మాటలు కావు.

ఆయన ఇంజనీరింగ్ కాలేజీ న్యాక్ గుర్తింపు కోసం అక్రమ మార్గాలు తొక్కిందని, ఆ కాలేజీని ఐదేండ్లపాటు నల్ల చిట్టాలో పెడుతున్నట్లు యూజీసీ నిర్ణయం తీసుకుంది.తమ కాలేజీ విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్‌షిప్ చేసినట్లు కల్పిత పత్రాలు సమర్పించారని పేర్కొంది. ఈ విషయం ఆనాడు పత్రికలలో వచ్చిందే. అదే నెలలో ఆయన తమ స్థలాన్ని కబ్జా చేస్తున్నాడని ఒక మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై ఎఫ్‌ఐఆర్ కూడా తయారైనట్లు మీడియాలో ప్రసారమైంది. తమ ఇంటికి సమీపంలోని ఒక మున్సిపల్ పార్క్‌లో గుడి కట్టేందుకు ఈయన ప్రయత్నిస్తున్నట్లు వార్త వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలలో ప్రార్థన స్థలాలను నిర్మించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ గుడి వల్ల తమ పిల్లల చదువుకు అంతరాయం కలుగుతుందని స్కూలు యాజమాన్యం కోర్టును ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతానికి అది కోర్టు స్టే వలన ఆగిపోయింది.

అదే అసలు విషాదం

అసెంబ్లీలో ఆయన చేసే ప్రసంగాలు అందరికి వినోదపరచడం అసలైన విషాదం. శాసనసభ విలువైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో విజ్ఞులకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. గత అసెంబ్లీ సమావేశాలలో ఈ మంత్రి ప్రసంగమంతా కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలతోనే పొంగిపొర్లింది. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడ ఉందని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని సభలో బిగ్గరగా అరుస్తూ, ఒక్కొక్క పేపర్ తడబడుతూ చదువుతూ అరగంట సేపు మాట్లాడారు. ఆయన మాటలకు స్వపక్ష, విపక్ష సభ్యులు విరగబడి నవ్వడం వీడియోలలో చూడవచ్చు.

గత మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల నుండి ఈ మంత్రి డబ్బులు వసూలు చేసి పార్టీ టికెట్ కు సిఫారసు చేశాడని పార్టీ వర్గాలే బయటపెట్టాయి. ఇలా గొడవలు పెట్టుకొని బజారులో పడవద్దని పార్టీ పెద్దలు చెప్పడంతో సద్దుమణిగిందని పత్రికలలో వచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి తన 'వాటా' కోసం బెదిరించిన ఆడియో చాలా తెలుగు టీవీ ఛానళ్లలో కనిపించింది. అది తన గొంతు కాదు ఎవరో తన లాగా మిమిక్రి చేసి మాట్లాడినారని మంత్రి సర్ది చెప్పడంతో మీడియా దాన్ని అంతటితో వదిలేసింది. పాత్రికేయుల సమావేశంలో భుజాలు తొడలు చరుస్తూ తన ప్రత్యర్థులపై 'సాలే, కుత్తే' లాంటి పరుషపదాలు ప్రయోగించడం కూడా సర్వత్రా ప్రచారమైంది.

మర్యాదకు లోటు లేకుండా

తెలంగాణాలో ముఖ్యమంత్రితో కలిసి 17 మంది మంత్రులున్నారు. వీరిలో రాజకీయ నేపథ్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి, ప్రజలతో, అధికారులతో, పాత్రికేయులతో, సాటి పెద్దలతో, వివిధ వృత్తులలోని నిష్ణాతులతో ఎలా వ్యవహరించాలో తెలిసినవారూ ఉన్నారు. పాలన ఎలా ఉన్నా, తమ శాఖలపై తమ పెత్తనం ఎంతున్నా గుంభనంగా, మాట మర్యాదలో లోటు రాకుండా చూసుకుంటారు. రాష్ట్ర గౌరవాన్ని, ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతూ మాట్లాడుతుంటారు. మంత్రి హోదాకు ఉండవలసిన కనీస హుందాతనమది.

ఈ మధ్య ఈయన ఒక తెలుగు సినీ దిగ్గజ నటుడిని వందల మంది హాజరైన సభలో ఏకవచన ప్రయోగంతో సంబోధించడం వేదిక మర్యాదకు కంటకంగా, కనీస విలువలకు దూరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి వ్యక్తిగత ధోరణిలో ఏదేదో మాట్లాడి జాతి గౌరవాన్ని తగ్గించినట్లే ఎవరికైనా అనిపిస్తుంది. ఇది వ్యక్తిగత విమర్శ కానేకాదు, ఏవీ లేనివి సృష్టించబడలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ గర్వపడేలా వ్యవహరించాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. తమ సొమ్ము, తామిచ్చిన హోదా సద్వినియోగం కావాలని జనం కోరుకోవడం అత్యాశ కాదు. మంత్రి అంటే ఒక మానవాకారం కాదు, మూడున్నర కోట్ల మంది ఆత్మగౌరవం.

బి.నర్సన్

9440128169

Tags:    

Similar News