ఇదీ సంగతి:రంగు మారుతున్న రాజకీయం

ఇదీ సంగతి

Update: 2022-03-17 18:45 GMT

పాలకుల దాడి మొదలైపోయింది. సమస్యలన్నీ పక్కకుపోయాయి. 'ఇంటికో ఉద్యోగం' హామీ హుష్‌కాకి కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో కేంద్రం తన నిజ రూపాన్ని చూపడం మొదలు పెట్టేసింది. వృద్ధాప్యంలో ఊతకర్రలా పని చేసే 22.50 కోట్ల మంది ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించే పనికి పూనుకుంది. దీని ద్వారా 450 కోట్ల రూపాయలు పొదుపు చేస్తారట. 45 సంవత్సరాల అనంతరం పీఎఫ్ మీద ఇంత తక్కువ వడ్డీని నిర్ణయించారు. 20 లక్షల రూపాయలు ఉంటే సంవత్సరానికి 8 వేలు, 50 లక్షలు అయితే 20 వేల రూపాయల వరకు వడ్డీ తగ్గుతుందన్న మాట.

ఉద్యోగ విరమణ అనంతరం ఉపయోగపడుతుందని జీతం నుంచి ప్రతి నెలా కోత విధించి పీఎఫ్‌లో పొదుపు చేస్తాం. దానికి సముచితంగా వడ్డీ రేటును ప్రభుత్వం ఇస్తుంది. లైఫ్‌కు సెక్యూరిటీ ఉంటుంది. కానీ, బీజేపీ ప్రభుత్వం 0.4 శాతం వడ్డీని తగ్గించేసి వృద్ధుల జీవితాల మీద దాడి చేసింది. భవిష్య నిధి ఆసరాతో కూడా కేంద్రం ఆడుకుంటున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తీసుకుంటున్న పొదుపు చర్యలలో ఇది భాగమని, దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయమని అంటున్నారు. ఇంతే కాదు, 30 కోట్ల మంది తమ బిడ్డల కోసం పొదుపు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 9.3 శాతం నుంచి ఇప్పటికే 7.3 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్ పొదుపు చేసిన మొత్తం మీద వడ్డీని తగ్గించారు. కిసాన్ వికాస్ పత్రం వడ్డీని 8.7 శాతం నుంచి 6.97 శాతానికి తగ్గించారు. ఇలా పలు పథకాలలో 8.4 శాతం ఉన్న వడ్డీని 6.6 శాతానికి, 8.5 శాతం ఉంటే 6.8 శాతానికి తగ్గించారు.

అందుకేనా పొదుపు మంత్రం?

30 కోట్ల మందికి చెందిన 14 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం డిపాజిట్ల రూపంలో ప్రభుత్వం వద్ద ఉంది. వీటి నుంచి కేంద్రం ఇప్పటికే 19 వేల కోట్లు తీసుకుంది. బ్యాంకుల రుణం ఎగవేత రూ. ఐదు లక్షల కోట్లు దాటింది. సామాన్యుడు బ్యాంకులలో తన కష్టార్జితాన్ని డిపాజిట్ చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈక్విటీ బజార్ స్థితి పర్వాలేదు. బంపర్ రిటర్న్స్ ఉన్నాయి అంటున్నారు. దేశంలో 35 లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఉంటే, ఆదాయం రూ. 29 లక్షల కోట్లు ఉంది. అందుకే ప్రభుత్వం పొదుపు, ప్రైవేటీకరణ అంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను లీజుకు ఇవ్వడం, అమ్మడం. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఇప్పటికే 40 శాతం ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారు.

కరోనా కాలంలో 26 శాతం మంది తమ పీఎఫ్ ను డ్రా చేసుకుని కుటుంబాలను గట్టున పడేసుకున్నారు. మందులకు, వైద్యానికి పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు పీఎఫ్ మొత్తాన్ని వినియోగించారు. పని ఎక్కువ శాలరీ తక్కువ అనే స్థితి ప్రైవేట్ రంగంలో వచ్చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం, పీఎం విమానం కోసం, పర్యటనల కోసం బ్యూరోక్రాట్, ప్రజాప్రతినిధుల జీతభత్యాల కోసం వేల కోట్ల రూపాయలు మనమిచ్చే జీఎస్‌టీ నుంచి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పొదుపు పేరిట ప్రజలు దాచుకున్న సొమ్ముకు న్యాయంగా ఇవ్వాల్సిన వడ్డీ రేటును మాత్రం తగ్గించి అన్యాయం చేస్తున్నారు.

డెమోక్రసీ పరిభాష మారింది

బ్యాంకుల ఫ్రాడ్ 50 శాతం దాటిపోయింది. దేశంలో డెమోక్రసీ పరిభాష మారిపోయింది. ఎన్నికలు, అందులో గెలవడం, ఉన్నదంతా కార్పొరేట్లకు అప్పజెప్పి పాలకులు నిఘావర్గంగా పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. బ్యాంకుల రిటర్న్ ఆఫ్ 5.4 లక్షల కోట్లు ఉందంటే పరిస్థితి ఈ ఏడున్నర ఏండ్లలో ఎలా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేసిన కార్పొరేట్లు 100 మందిలో 30 మందినే ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఇందులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ రేజర్వేషన్లు ఉండవు. జీతాలు తక్కువే. 2025 వరకు ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశాలు అతి తక్కువ.

మొన్నటి దాకా కరోనా, ఇప్పుడు యుద్ధం పేరు మీద అధిక ధరలను, నిరుద్యోగాన్ని, అసమానతలను, ప్రైవేటీకరణను ఎదుర్కోక తప్పే పరిస్థితి కనబడడం లేదు. కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే పీఎం నరేంద్ర మోదీ చెప్పారు. 2024 దాకా ఇదే మాట, ఇదే బాట తప్పదు. ఐదు ట్రిలియన్ల ఎకానమీ ఇక 2029కి పోస్ట్‌పోన్ అయింది. 'నయా భారత్' నినాదం 2045 కి వాయిదా పడింది. అప్పటిదాకా దేశ్‌వాసీలకు కష్టం తెలియకుండా చూస్తారు. 80 కోట్ల మందికి ఇస్తున్న ఫ్రీ రేషన్ మరి కొంత మంది పేదలు పెరిగినా 100 కోట్ల మందికైనా ఇస్తూనే ఉంటారు. నిరుద్యోగం అప్పటికి పూర్తిగా ఎలాంటి వాయిస్ లేకుండా చచ్చిపోతుంది కాబట్టి, ఎలక్షన్ ఏదైనా గెలుస్తున్నవారినే గెలిపిస్తాం. ఇదే శపథం చేస్తూ సైలెంట్‌గా ఓటేద్దాం.

అధికారం కోసం నానా తంటాలు

బ్యాంకులు దివాలా తీస్తే మనకెందుకు? విద్య కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు పోయిన మనోళ్లు యుద్ధంలో ఇరికి బాధలు పడితే మనకెందుకు? రైతులను చంపితే మనకెందుకు? 378 దినాలు పోరాడుతూ 750 మంది రైతులు చనిపోతే మనకెందుకు? ప్రశ్నించేవాడిని దేశద్రోహి అని కేస్ పెట్టి జైలులో తోస్తే మనకెందుకు? అత్యాచారం చేసి చంపిన యువతి శవాన్ని కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా దహనం చేస్తే మనకెందుకు? గంగలో కరోనా మృతుల శవాలు తెలియాడిన దృశ్యాలతో మనకేమి సంబంధం? పాలన ఎటు పోతే మనకెందుకు? ఫ్రీ రేషన్, అన్నీ ఫ్రీ ఇచ్చేందుకు సిద్ధమైన వారే మనకు కావాలి.

అలాంటివారు మాత్రమే మనకు కావాలి. 'ట్రెండ్ ఈజ్ నౌ గోయింగ్ ఆన్' ఏ రకంగానైనా సరే అధికారంలోకి రావాలి. తర్వాత దానిని నిలబెట్టుకోడానికి నానా గడ్డి కరవాలి. జనాన్ని బోల్తా కొట్టించాలి. ఇదే స్వచ్ఛ పాలన. ఇదే 'సబ్ కా వికాస్- సబ్ కా సాత్' పాలన నిర్వచనం అయిపోయింది. ఎన్నికలలో ఓటమిని తట్టుకోలేని, గెలిస్తే సంతోషపడి, అదేదో గొప్ప అన్నట్లు దేశంలో ప్రొటోకాల్ సేవలు ఉన్నాయి. రాజకీయాలు అన్నీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.

వారు అప్రమత్తం కావాలి

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం లేకుంటే దేశంలో సంపూర్ణంగా పాలన చేయవచ్చనే ఉద్దేశంతో వారి రాజీనామాలు కోరే విధంగా అందులోని జీ-23 లీడర్‌ల‌తో ఒక లొల్లి మొదలు పెట్టించారు. రాహుల్, ప్రియాంక ఐడియాలజీ బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది. కపిల్‌సిబాల్ సుప్రీమ్‌కోర్టు న్యాయవాది. ఆయన అయినా, గులాం నబీ ఆజాద్ అయినా ఎన్నికలలో గెలువరు. నామినేట్ కాబడుతారు. వీరి లాంటి వారు గాంధీ కుటుంబ రాజీనామాలు కోరడం విడ్డూరంగా ఉంది.

బీజేపీ ఏమి కోరుకుంటుందో వీరూ అదే కోరుకుంటున్నారు. వాట్స్‌యాప్ యూనివర్సిటీ జ్ఞానం ఉన్న నేతలకు చరిత్ర ఏమి తెలుసు? దాదాపు 100 దేశాలలో 1982 కు ముందే, గాంధీ చిత్రం రాక ముందే, ప్రపంచంలో గాంధీ విగ్రహాలు పెట్టారు. గాంధీని దేశం నుంచే మాయం చేసి గాడ్సేను ముందుకు తెచ్చే కుట్రలో భాగంగా చరిత్రను వక్రీకరిస్తూ, ఒకే పక్షము సినిమాలతో విద్వేషాలు రెచ్చగొట్టే చర్చ, ప్రమోషన్లు జరుగుతున్నాయి. బుద్ధిజీవులు అలర్ట్ కావాలి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Tags:    

Similar News