‘చిన్నా’రులకు ఇంట్లో కూడా డేంజరే!
Chinna Movie was a Sensitive and Hard hitting
ఈ మధ్య ఒక దినపత్రికలో ఓ పదమూడేళ్ళ బాలిక తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హత్య చేసిందని, ఇందుకు తన ప్రియుడు(19), స్నేహితుల సహాయం తీసుకుందని వార్త ప్రచురితమైనది. ఇది ఎంతో విచారించదగ్గ అంశం. మృతురాలికి పిల్లలు లేని కారణంగా ఆ దంపతులు కాకినాడకు చెందిన పసికందును దత్తతకు తీసుకొని, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ అదే ఆమె మరణానికి కారణమైంది. మృతురాలి భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించాడు. ఆనాటి నుంచి కూతురే సర్వస్వంగా బ్రతుకుతున్నది. కానీ కూతురు ‘ముద్దును’ తన చెడు తిరుగుళ్ళకు ‘స్వేచ్ఛ’గా భావించింది. వ్యసనాలకు బానిసై, చివరకు చేరదీసిన తల్లినే చంపేసింది. ఇటువంటి దినపత్రికలలో వచ్చినవి కొన్నే... రానివెన్నో.. పిల్లల పెంపకంపై ప్రశ్నలు కురిపించే కోణం ఇదొకటి..
మరోవైపు పసిపిల్లలపై పెరుగుతున్న అత్యాచారాలకు లోటు లేదు. ఏడిస్తే ‘సెల్’ ఫోన్ చేతులలో పెట్టి లాలిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ అనేటటువంటివి నేర్పే సమయం మీడియాకు, పేరేంట్స్‌కు లేదనే అనుకోవాలి. పదమూడేళ్ల పిల్లలు అత్యాచారాలకు లోనవుతున్నారు. హత్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబం, పిల్లల మానసిక స్థితి, సమాజం దృష్టిలో ఇటువంటి పిల్లల దృక్కోణం ఏమిటి అనేది ఓ సున్నితమైన అంశం. ఇటువంటి కథను సినిమాగా తీస్తే... అమ్మో అని భయపడే వారు ఉంటారు. ‘భలే’ అనే కావలసినంత మసాలా దినుసులు చేర్చి ‘నోళ్లు’ చప్పరించే సినిమాలు తీసేవారు కొందరు ఉంటారు. కానీ, సినీ నటుడు సిద్ధార్థ ఎటువంటి భయం లేకుండా, ఇటువంటి కథను అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో చక్కని కథనాన్ని జోడించి, ఎస్. యు. అరుణ్ కుమార్‌ను దర్శకునిగా పెట్టుకొని ‘సిన్సియర్’గా తమిళంలో చేసిన ప్రయత్నం ‘చిత్తా’. తెలుగులో ‘చిన్నా’గా విడుదల అయిన సమయంలో ‘ఈ చిత్రాన్ని బాగోలేదని ఎవరైనా అంటే తెలుగులో తన సినిమాలను విడుదల చేయనని’ నిర్భయంగా చెప్పిన నటుడు సిద్ధార్థ. ఈ చిత్రం తమిళంలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
‘చైల్డ్ అబ్యూజ్’ నిందితుని తరఫున..
వర్తమానంలో ఆడపిల్లలకు కావలసిన స్వేచ్ఛ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రమాదమే అనేటట్టుగా మారింది సమాజ రీతి. ఆడపిల్లలను సింహంలా పెంచాలనే నీతిని బోధించే చిత్రాలు వస్తున్నాయి. ‘చిన్నా’లాంటి అంటే హెచ్చరించే సినిమాలు వస్తున్నాయి. సందేశాల వరకు ఓ.కే.. కానీ.. వాస్తవం..! ‘సమాజపరమైన కథలకు సొమ్ములు రావు. ప్రశంసలు, అవార్డులు నిర్మాత కడుపు నింపవని’ ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు (తీర్పు, కంచుకోట ఫేమ్) అన్నారు. కానీ... సిద్ధార్థ వంటి నటులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ‘చిన్నా’ చిత్రం కథ పాతదే.. గతంలో కమలహాసన్ ‘మహానది’, సాయి పల్లవి ‘గార్గి’ వంటి సినిమాలు ‘చైల్డ్ అబ్యూజ్’ పై వచ్చాయి. క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. కనుకనే నిర్మాత సిద్ధార్థ, దర్శకుడు అరుణ్ కుమార్‌లు సున్నితమైన కథాంశానికి కాస్త సస్పెన్షన్‌ను జోడించి ‘మంచి టెంపో’తో సినిమాను నడిపారు.
ఈ కథలో ‘యాదాద్రి’ కథ జరిగే ప్రాంతం. హీరో చిన్నా (సిద్ధార్థ) మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగి. ఇతని ప్రియురాలు శక్తి (నిమిషా సజయన్) పారిశుద్ధ్య కార్మికురాలు. కాలేజీ డేస్ నుంచి వీరిది లవ్. చిన్నా అన్నయ్య అకాల మరణంతో అతని కూతురు చిట్టిని, వదినను బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా అతని జీవితం సాఫీగా పోతున్న సమయంలో చిట్టి స్నేహితురాలు, తన స్నేహితుడైన ఎస్సై, మేనకోడలు 'మున్ని' (సబియా తస్నిమ్) లైంగిక దాడికి గురవుతుంది. అందరి వేళ్లు, కళ్ళు చిన్నా వైపు తిరుగుతాయి. ఒక వీడియో కూడా బయటకు రావడంతో ‘చిన్నా’ వదిన కూడా చివరకు నమ్ముతుంది. ఇలా ఉండగా ‘చిట్టి’ మిస్ అవుతుంది. 'మున్ని'పై అత్యాచారం చేసింది చిన్నాయేనా చిట్టి ఏమైంది... చివరకు కథ ఏమైంది అనేది దర్శకుడు నైపుణ్యవంతంగా, అశ్లీలతకు తావివ్వకుండా చిత్రాన్ని ‘క్రిస్పీ’గా నడిపించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. నిజానికి ‘చైల్డ్ అబ్యూజ్’ లాంటివి జరిగినప్పుడు నిందితులపై బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, సభ్య సమాజం కూడా తీవ్రమైన ద్వేషం ప్రకటిస్తారు. వీలైతే ‘చంపమంటారు’ కూడా. ఇది సరైనదేనా అనే ప్రశ్నలు కూడా చిత్రంలో ఉన్నాయి. కానీ… బాధితుల పక్కన నిలబడి, నిజానిజాలు తెలుసుకొని, వారికి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వకపోవడం అన్యాయం అనే ప్రశ్నను చిత్రం లేవదీస్తుంది. ఈ పాయింట్‌ను ప్రజెంట్ చేసిన తీరు బావుంది. ఇక ఇంట్లో బాబాయిలు, మామయ్యలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిస్తూనే, బయటివారితో ఎలా మెలగాలనే విషయాన్ని చిన్నపిల్లలకు నేర్పాలనే విషయాన్ని సినిమా చర్చకు తెస్తుంది.
లాభాలు రాకపోయినా..
నిజానికి కథ కొత్తది కాదు. చాలా సినిమాలలో మాదిరిగా రొటీన్ కథాకథనాలు జరిగిపోతుంటాయి. కానీ… వాటి తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించడం వెనుక దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సిద్ధార్థ వంటి నటుడు ఇంతటి ఆరోగ్యవంతమైన కథను ఎంపిక చేసుకొని, దానిని అంతే సిన్సియర్‌గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయం. దర్శకుడు సాంకేతిక నిపుణులను శ్రద్ధగా ఉపయోగించుకున్నాడు. ఇటువంటి చిత్రాలకు ‘బీజీఎం’ కథకు ప్రేక్షకుల దగ్గరకు దర్శకుడి నుంచి చూపించాలి. ఆ పనిని నేపథ్య సంగీతమందించిన విశాల్ చంద్రశేఖరన్ చక్కగా చేశారు. సంగీతమందించిన దిబు నిసన్ థామస్, సంతోష్ నారాయణన్ లు కూడా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. కెమెరా పనితనం నిర్మాతకు తగిన విధంగానే ఉన్నాయి. కథ కన్నా కథనం మిన్నగా ఉన్న ‘చిన్నా’ను తల్లిదండ్రులు చూడాలి. ఓటిటిలో ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన బాగుందనుకోవచ్చు. ప్రయోజనాత్మక చిత్రాలన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. వీటి వలన నిర్మాతలకు లాభాలు రాకపోవచ్చు. కానీ… పది కమర్షియల్ సినిమాలు తీసిన వారు కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం తీయాలని తను ఆత్మసంతృప్తిని పొందాలనుకుంటున్నారని ‘ప్రముఖ ఉత్తరాది దర్శకుడు రాజకపూర్ అభిప్రాయం. రాఘవేంద్రరావు, కే.ఎస్. ప్రకాష్ రావు, సి. పుల్లయ్య, విశ్వేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ వంటి దిగ్గజ దర్శకనిర్మాతలు అలానే సందేశాత్మక చిత్రాలు తీశారు. ముఖ్యంగా రాజ్ కపూర్‌ది ఈ విషయంలో అగ్రస్థానమనే చెప్పాలి. సిద్ధార్థ్ కూడా ఆ ప్రయత్నం చేయడం అభినందనీయం.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395