బాలల కలల ప్రపంచం 'ధనక్'
బాలల కలల ప్రపంచం 'ధనక్'... Childrens dream world movie Dhanak
పిల్లలది ఒక అద్భుతమైన ఊహా ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో కలలు వుంటాయి. కథలుంటాయి, పాటలుంటాయి, బొమ్మలుంటాయి, సినిమాలుంటాయి సినిమా నటులూ వుంటారు. అంతేకాదు వారి నమ్మకాలు, విశ్వాసాలు స్వచ్ఛంగానూ స్వార్థ రహితంగానూ వుంటాయి. నమ్మిందాన్ని సంపూర్ణంగా నమ్మడం పిల్లల మనస్తత్వంలో భాగం. అలాంటి పిల్లల స్వచ్ఛతనీ, ఆత్మీయతనీ, లక్ష్య సాధనలో వారి దీక్షనీ ప్రధాన అంశంగా తీసుకుని ప్రముఖ హైదరాబాదీ దర్శకుడు నాగేశ్ కుకునూర్ రూపొందించిన సినిమా 'ధనక్'. దీనర్థం ఇంద్రధనస్సు. సినిమాలో పిల్లల కోణంలోంచి పిల్లల ప్రపంచాన్నే కాదు అసలు మొత్తం ప్రపంచాన్నే ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు నాగేశ్. ఇది ఒక రకంగా రోడ్ మూవీ. మంచి సున్నితమయిన హాస్యమూ, చివరంటా బిగితో సాగే కథనమూ ధనక్‌కి ఆయువు పట్టు. సినిమా సాగినంతసేపు రాజస్థాన్ అందాలు, ఆచారాలను ఆవిష్కరించారు. వివిధ సందర్భాల్లో మనుషుల స్వార్థాలూ, మోసాలూ కూడా కనిపిస్తాయి. ఇరానియన్ సినిమాల ప్రభావం కొంత కనిపించినప్పటికీ మంచి బాలల సినిమాగా 'ధనక్' నిలిచిపోతుంది. ఇది పిల్లలందరికీ చూపించాల్సిన సినిమా.
పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకు దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లలపై అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలను మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో ఉండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. అట్లా పిల్లల కోసం రూపొందించబడ్డ సినిమానే 'ధనక్'.
నిజానికి పిల్లలది ఒక అద్భుతమైన ఊహా ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో కలలు వుంటాయి. కథలుంటాయి, పాటలుంటాయి, బొమ్మలుంటాయి, సినిమాలుంటాయి సినిమా నటులూ వుంటారు. అంతేకాదు వారి నమ్మకాలు, విశ్వాసాలు స్వచ్ఛంగానూ స్వార్థ రహితంగానూ వుంటాయి. నమ్మిందాన్ని సంపూర్ణంగా నమ్మడం పిల్లల మనస్తత్వంలో భాగం. అలాంటి పిల్లల స్వచ్ఛతనీ, ఆత్మీయతనీ, లక్ష్య సాధనలో వారి దీక్షనీ ప్రధాన అంశంగా తీసుకుని ప్రముఖ హైదరాబాదీ దర్శకుడు నాగేశ్ కుకునూర్ రూపొందించిన సినిమా 'ధనక్'. దీనర్థం ఇంద్రధనస్సు.
నాగేశ్ కుకునూర్ పేరు వినగానే హైదరాబాద్ బ్లూస్, రాక్ ఫోర్డ్, ఇక్బాల్ లాంటి సినిమాలు మదిలో మెదులుతాయి. 1967లో హైదరాబాద్‌లో పుట్టిన నాగేశ్ ఇప్పటికే రెండు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులు అందుకున్నాడు. 'ధనక్' సైతం 64 జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ బాలల చిత్రం అవార్డును అందుకుంది. ధనక్ సినిమాలో పిల్లల కోణంలోంచి పిల్లల ప్రపంచాన్నే కాదు అసలు మొత్తం ప్రపంచాన్నే ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు నాగేశ్. ఇది ఒక రకంగా రోడ్ మూవీ. మంచి సున్నితమయిన హాస్యమూ, చివరంటా బిగితో సాగే కథనమూ ధనక్‌కి ఆయువు పట్టు. సినిమా సాగినంతసేపు రాజస్థాన్ అందాలు, ఆచారాలను ఆవిష్కరించారు. వివిధ సందర్భాల్లో మనుషుల స్వార్థాలూ, మోసాలూ కూడా కనిపిస్తాయి. లాంగ్ షాట్స్‌లో జరిగిన చిత్రీకరణ వలన విశాలమయిన ఇసుక తిన్నెల్నీ, ఇసుక తుఫాన్‌లనూ గొప్పగా చూపిస్తుంది.
కథేంటంటే..
ఈ సినిమా కథాంశానికి వస్తే ఒక మారుమూల రాజస్థాన్ గ్రామంలో ఒక పూరి గుడిసెలో ఇద్దరు పిల్లలతో ఒక కుటుంబం నివసిస్తుంది. తండ్రి ఎలాంటి పనిలేకుండా నిరాసక్తంగా వుంటాడు. చిన్నమ్మ ఇద్దరు పిల్లల పట్ల అసహనంగానూ కోపంగానూ వుంటుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరు అక్క పారి. ఆమె తమ్ముడు చోటూ. ఇద్దరూ ఒకే తరగతిలో చదువుతుంటారు. పారీ రెండేళ్లుగా పరీక్షల్లో తప్పుతూ అదే తరగతిలో ఉండిపోతుంది. దానికి కారణం చూపులేని తన తమ్ముడిని స్కూలుకు తీసుకురావడం, తీసుకెళ్ళడం జాగ్రత్తగా చూసుకోవడానికే తను పరీక్ష తప్పుతూ వుంటుంది. ఇద్దరూ రోజూ స్కూలుకు బయలుదేరగానే రూపాయి బిళ్ళతో చిత్తూ బొత్తూ వేసుకుని ఎవరు గెలిస్తే వారు కథ చెబుతూ వుండగా నడుస్తారు. చిత్రంగా ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. పారీకీ షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం కాగా, చోటూకు సల్మాన్ ఖాన్. అది మామూలు ఇష్టం కాదు దానికోసం వాదులాడుకోవడం, కొట్లాడుకోవడం కూడా చేస్తారు. కానీ పారీ తమ్ముడు చోటూ అంటే ప్రాణం పెడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధాల్ని గొప్పగా చూపిస్తాడు దర్శకుడు. ఎప్పటికయినా చోటూకు చూపురావాలనీ, తప్పకుండా వస్తుందనీ పారీ నమ్ముతుంది. ఒకరోజు స్కూలు నుంచి వచ్చే దారిలో నేత్రదానం గురించిన పోస్టర్ చూస్తుంది పారి. అందులో తన కిష్టమయిన షారూఖ్ ఖాన్ ప్రకటన వుండడంతో ఆనందపడుతుంది. తన తమ్ముడికి సాయం చేయమని కోరుకుంటూ షారూఖ్‌కి రోజుకో ఉత్తరం చొప్పున రాస్తుంది. కానీ ఆ ఊరి పోస్ట్‌మాస్టర్ చోటూకు చూపు వచ్చే అవకాశం లేదని ఆ ఉత్తరాల్ని పోస్ట్‌లో పంపకుండా కట్ట గట్టి పారీ తండ్రికి ఇచ్చేస్తాడు. జవాబు కోసం ఎదురు చూసీ చూసీ ఒక రోజు ఇంట్లో తాను రాసిన ఉత్తరాల్ని చూసి పారీ ఖిన్నురాలవుతుంది.
ఆ తర్వాత షారూఖ్ ఖాన్ రాజస్థాన్‌లో షూటింగ్ చేయడానికి వస్తున్నాడని తెలుసుకొని ఇంట్లో చెప్పాపెట్టకుండా షారూఖ్‌ని కలిసేందుకు తమ్మునితో కలిసి బయలుదేరుతుంది. అట్లా మొదలయిన వారి ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న అనేక వైవిధ్య సంఘటనలు వాటి పర్యవసానాలు ఆసక్తిగా వుంటాయి. దారిలో ఒక పెళ్లి బృందం కలుస్తుంది. దేవతగా చెప్పుకుంటున్న ఒక సన్యాసి కలుస్తుంది. తనకూ షారూఖ్ అంటే అభిమానమనీ తాను కూడా కొంతకాలం సినిమాల్లో నటించాననీ చెబుతుంది. ఇంకా ఒక అమెరికన్ కలుస్తాడు. అతను పాడే పాటలు ఇద్దరినీ ఆకట్టుకుంటాయి. ఒకసారి పారీ, చోటూలు కిడ్నాప్‌కు గురయ్యే సందర్భంలో ఒక అదివాసీ స్త్రీ వారిని రక్షిస్తుంది. అంతేకాదు దారిలో ఇసుక తుఫాన్ నుంచి బయటపడతారు. ఇలా అనేక సంఘటనల మధ్య మానవ ప్రవృత్తులూ స్వార్థాలూ కనిపిస్తాయి.
సినిమా మొత్తం పారీ, చోటూల సంభాషణలు మంచి హాస్యంతో కూడి అలరిస్తాయి. షారూఖ్ షూటింగ్ స్పాట్‌లో కూడా అక్కడ పనిచేసే ప్రొడక్షన్ మనుషుల ప్రవర్తన కూడా ఆసక్తికరంగా చూపిస్తాడు దర్శకుడు. షూటింగ్ ఒక చోటు నుంచి మరో చోటుకు మారిందని తెలుసుకుని అక్కడికి చేరుకుంటారు చివరికి షారూఖ్ సహకారంతో చోటూకు ఆపరేషన్ అయి చూపొస్తుంది. మొత్తంగా పిల్లల కోణంలోంచి లోకాన్నీ, లోక ప్రవృత్తినీ దృశ్యీకరిస్తాడు దర్శకుడు నగేశ్ కుకునూర్. సినిమా మొత్తం మీద పారీ పాత్రలో హేతల్ గడా, చోటూ పాత్రలో క్రిష్ చాబ్రియా బాగా ఆకట్టుకుంటారు. ఇరానియన్ సినిమాల ప్రభావం కొంత కనిపించినప్పటికీ మంచి బాలల సినిమాగా 'ధనక్' నిలిచిపోతుంది. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలల సినిమా అవార్డును గెలుచుకుంది. అంతేకాదు మాంట్రియాల్ ఫెస్టివల్‌లో ఉత్తమ బాలల సినిమా అవార్డును కూడా గెలుచుకుంది. 'ధనక్' నాగేశ్ కుకునూర్ తీసిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇది పిల్లలందరికీ చూపించాల్సిన సినిమా.
సినిమా: ధనక్, రచనా,నిర్మాణం, దర్శకత్వం: నగేశ్ కుకునూర్, సంగీతం: తపస్ రెల్లా, కెమెరా: చిరంతన్ దాస్
వారాల ఆనంద్
9440501281
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672