మనిషిని సామాజిక వ్యవస్థల్లో కేంద్రక స్థానంలో నిలిపిన మానవ సమాజం ఉన్నతమైనది. సాంస్కృతిక తాత్వికతలో కళలు ఉత్తమమైన శాస్త్రాలలో హేతుబద్ధ విజ్ఞాన సూత్రాల అర్థ తాత్పర్యాలను ఆత్మీయంగా మానవ జీవనంలో భాగంగా పొదివి భావోద్వేగాలను, విజ్ఞానాన్ని సమన్వయం చేసింది. ఇవే కనులుగా భాసిల్లే వైద్యం కవిత్వం నేర్పిన విద్య సమాజహితానికే పనిముట్లుగా ఉపయోగపడాలి. వైద్యాన్నీ కవిత్వాన్ని కలిపి కొత్తగా విభిన్న కోణంలో చెప్పడం ఓ గొప్ప స్ఫూర్తి స్పోరకం.
మానవ శరీరంలో శరీర భాగాల నిర్మాణ శాస్త్రాన్ని వైద్య పరిభాషలో అనాటమీ అనీ, వాటి పని తీరును తెలిపే శాస్త్రాన్ని ఫిజియాలజీ అని అంటారు. మనిషి శరీర భాగాల నిర్మాణం, వాటి పనితీరును రేఖామాత్రంగా గుండె గొంతుకై చెప్పే ప్రయత్నం ఇది. ఇక కవిత్వం ఒక సౌందర్య చైతన్య లహరి. కవిత్వం ఓ పదునైన మానవీయ ఆయుధం. కష్టాలు కన్నీళ్ళను తొలగించే సాహిత్య కళను సమాజం కోసం, సమాజ హితం కోసం అందించే తపనే ఈ వ్యాసాంతరంగం.
ఇక కనులపై సాహిత్యంలో కవిత, సినీ గేయం, కొటేషన్స్ ఎన్నో ఎందరో సృజనకారులు కనుల భాషలో వర్ణించారు. అందులో కొన్ని... 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' ఆర్యోక్తి. జీవజాల శరీరంలో కనులది విశిష్ట స్థానం. కనుల భాష లిపిలేని సడిలేని హావభావాల సంపుటి. ప్రబంధాలు పురాణాల్లో కావ్యాలలో విశ్వ సాహిత్యంలో కనుల సోయగాల వర్ణన ప్రధానమై వెలిసింది. సర్వజనుల నాలుకపై నటనమాడేలా మన తెలుగు సినీ కవులు కనుల భాషలో ప్రేమ, సంతోషానందాలు, విరహవిషాదాలు, సంవాదం, సంసారం వంటి మానవ సహజ భావోద్వేగాలను చక్కగా గొప్పగా చెప్పినారు. అలాగే ఇతర ప్రక్రయల్లోనూ కనిపిస్తుంది.
మహాభారతంలో పుట్టంధుడైన ధృతరాష్ట్రుడు, గంతలతో గాంధారి మనోవేదన పురాణ ఘట్టమే. అలాగే ఎందరో కవులు, సాహితీవేత్తలు కన్నులను తమ తమ సృజనలో గొప్పగా వర్ణించిన తీరు ఇలా ఉంది.
“The Eyes are the window to your soul” అని William Shakespeare వర్ణిస్తే Eyes speak in emotion, the language of the soul. మరో ఆంగ్ల సాహితీమూర్తి అన్నారు. కనులు మాటలాడుననీ.. మనసు పాట పాడుననీ కవితలల్లితి ఇన్నాళ్ళు.. అని అనడం కనులున్నందుకు కలలు తప్పవు అనే.
కనులలోన.. కనుబొమలలోన అని రాసినా, ఆ కనులు పండు వెన్నెల గనులు అని చెప్పినా ఎంత అందంగా అర్ధవంతంగా ఉందో ఆ కనులకే తెలుసు. ఇక భిన్నమైన పరస్పర వ్యతిరేక ఉద్వేగాలైన సుఖదుఃఖాల వ్యక్తీకరణలో వచ్చేది కంటి ధారే కదా!
కదిలే కన్నులే దృష్టి జ్ఞానం
కన్నులున్నవా కదిలే ఊహలకు అందాల చిత్రాలతో
రంగుల లోకం పోకడలన్నీ ప్రతిబింబాలుగా చిత్రించే రెటీనా
విప్పారినదే దృష్టి జ్ఞానం
కనులు చూడలేని జీవిలో
చేతులు తాకిన పలికేదే కనుల భాష
డా.టి. రాధా కృష్ణమాచార్యులు
98493 05871