ఇప్పుడైనా 'బాబు' కళ్లు తెరుస్తారా?
chandrababu should think about his role in national politics
చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణల్లో ఒక స్పష్టత చోటు చేసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అర్థంకాని బ్రహ్మపదార్థంగా వున్నాయి. ఇక ఆ రాజకీయ మబ్బులు విడిపోయే సందర్భం వచ్చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా వుండడంతో బీజేపీని ఓడించే ఒక వ్యూహాన్ని ఆ బృందం రచించలేకపోయింది.
పొత్తులేని పోటీకి ససేమిరా!
ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ అధికార పార్టీ, తెలుగు దేశం ప్రతిపక్షపార్టీ. ఎన్నికల రంగంలో ఇంకా జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, సీపీఐ వున్నాయి. అయితే, ఈ ఆరు పార్టీల్లో ఒక్కదానికీ శాసన సభలో ప్రాతినిధ్యం లేదు. జగన్ నాయకత్వంలోని వైసీపీకి మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. సొంత బలం మీదనే గెలవాలనేది జగన్ అభిమతంగా వుంది. 2019 ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత చంద్రబాబుకు 2014 ఎన్నికల సెంటిమెంట్ వెంటాడుతోంది. తనూ, మోదీ, పవన్ కల్యాణ్ మళ్లీ కలిస్తే మరొక్కసారి ఘన విజయాన్ని సాధించవచ్చని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనని ఎప్పటినుంచో అంటుండంటో ఆ పార్టీల నుండి పొత్తుఖాయమని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటితో ఈ పొత్తు అధికారికం అయింది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే ఒకే ఒక్క మాట తప్ప ఏపీలో బీజేపీకి ఓట్లు లేవు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి సొంతంగా ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్‌కే 5.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన ఏపీలో బీజేపీ కన్నా పవన్ కళ్యాణ్ పార్టీ 6, 7 రెట్లు పెద్దది.
బీజేపీతో..వన్ సైడ్ లవ్!
రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. స్థూలంగా వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు.
కేంద్రంలో బీజేపీ విషయంలో జగన్ ‘రాజును మించిన రాజభక్తిని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజిక వర్గం తప్ప అత్యధికులు బీజేపీకి పూర్తి వ్యతిరేకులు. మరీ ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. ఆయనకు లోక్ సభలో 22 మంది సభ్యులున్నారు, ప్రస్తుతం లోక్ సభకన్నా విలువైన రాజ్యసభలో 12 మంది సభ్యులున్నాయి. అయినప్పటికీ, ఒక్క మంత్రి పదవిని కూడా కోరుకోకుండా జగన్ బీజేపీకి ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన ఏపీలో ‘బీజేపీ కానీ బీజేపీ’. బీజేపీ దృష్టిలో జగన్ కాంగ్రెస్‌తో విభేదించి బీజేపీ పంచచేరిన రాజకీయ నాయకుడు. చంద్రబాబు బీజేపీతో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు. అంచేత, బీజేపీ జగన్‌ను నమ్మినంతగా చంద్రబాబును నమ్మదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బీజేపీ భావిస్తోంది. ఆ తరువాతి 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభల్లోనూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్‌ను గట్టిగానే విమర్శించారు. వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్‌తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని ఒక్కసారి కూడా అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్ లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు.
ఏపీలో బీజేపీ వ్యూహమిదే!
జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును ఆహ్వానించలేదు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో సీపీఎం,సీపీఐ అవమాన భారంతో కుమిలిపోతున్నాయి. దీంతో ఎవరో ఒకరి పంచన చేరి ఈ సారైనా ఒక్క సీటు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని అవి తపిస్తున్నాయి. టిడిపితో పొత్తు కోసం సీపీఐ, వైసీపీతో పొత్తు కోసం సీపీఎం ప్రయత్నిస్తున్నట్టు గట్టిగానే వినిపించింది. ఇక ఏపీ కాంగ్రెస్ గత పదేళ్ళుగా పూర్తి నైరాశ్యంలో వుంది. కాంగ్రెస్ ద్వారా ప్రయోజనాలు పొందినవారు క్రమంగా ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. పార్టీ భవిష్యత్తును నమ్మి నిధులు ఖర్చు పెట్టేవారు లేరు. రాహుల్ గాంధీ ‘భారత జోడో’ యాత్ర తర్వాత మాత్రమే కాంగ్రెస్ ఆఫీసులో కొందరు కార్యకర్తలు కనిపిస్తున్నారు. కొన్ని కార్లు ఆగుతున్నాయి. కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన. బీజేపీ నాలుగు పార్టీల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బీజేపీ ఖాతాలోకే పోతాయనే అభిప్రాయం ఏపీలో కొన్నాళ్ళుగా స్థిరపడిపోయింది. అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద ఉన్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా పోయింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబర్ 9 సోమవారం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడికి పంపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు గురయ్యాయి. దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు అరెస్టుకు ముహూర్తం పెట్టారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఏపీ ప్రభుత్వం ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు.. చేయలేరు. చేస్తారని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకులు ఎవ్వరూ వుండరు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి లాభమా నష్టమా అనేదే ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తున్న అంశం. టీడీపీ బుధవారం పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు ఏ జిల్లాలోనూ కనీస స్పందన రాలేదు. తెలుగుదేశం రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్ ప్రభావం బొత్తిగా కనిపించలేదు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం వైసీపీకి కన్నా బీజేపీకే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. వాళ్ళు ఆశిస్తున్నది కూడా ఇదే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత కనుక చంద్రబాబు అరెస్టు కేసులో జగన్‌ను మాత్రమే విమర్శించారు. సోము వీర్రాజును తప్పించినపుడే పవన్ కళ్యాణ్‌కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది. పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ కింది భూమిని లాగడానికని. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్‌ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం. టిడీపీ రాష్ట్ర బంద్ పిలుపు విఫలం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు బీజేపీ ప్రేమలో వుండడమే. రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో ప్రవేశించాక చంద్రబాబుకు కొత్త రాజకీయాల కొత్త కోణాలు అర్థం అయ్యుంటాయి.
బాబు గేమ్ చేంజరే..కానీ
ఎన్‌టి రామారావు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా వున్న కాలంలోనే వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండే చంద్రబాబుకు జాతీయ రాజకీయాలతో ఒక అనుబంధం వుంది. హెచ్.డి దేవ గౌడను ప్రధానిని చేసిన యునైటెడ్ ఫ్రంట్‌కు, అనంతరం వాజ్ పాయిను ప్రధానిని చేసిన ఎన్‌డిఏకు కూడా అయనే కన్వీనర్‌గా వున్నారు. తన సూచన మేరకే ఏపిజే కలాంను వాజ్‌పాయి రాష్ట్రపతి చేశారని వారు తరచూ గుర్తు చేస్తుంటారు. కానీ ఇవ్వాల్టి పరిస్థితి వేరు. చంద్రబాబు అరెస్టు అయితే ఎన్‌డీఏ నాయకులు స్పందించలేదు. ‘ఇండియా’ నాయకులు పరామర్శించలేదు. రెంటికీ చెడ్డ రేవడి అయినట్టు వారికి జైల్లో జ్ఞానోదయం అయ్యుంటుంది. లాంఛనంగా, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ఖండనలు ఇచ్చారు. అలా అనుకుంటే పురందేశ్వరి కూడా బాబు అరెస్టును ఖండించారు.
తను ఇప్పుడు వుండాల్సింది ‘ఇండియా’లో అని చంద్రబాబు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోతాయి. వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘ఇండియా’లో వున్నాయి. పొత్తుల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని సీతారాం ఏచూరి వంటివారు చెప్పి ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలతో టీడీపీతో కలిసే అవకాశాలు పెరుగుతాయి. చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ మరింతగా ప్రమోట్ చేస్తుంది. జగన్ తాను బీజేపీ కాదంటూనే దాని వెంట ఉండక తప్పదు.
-డానీ
సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు
90107 57776