2003 డీఎస్సీ టీచర్ల గోడు పట్టదా!?
Central government employees can opt for the old pension scheme joined in 2003, when implemented in Telangana
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ని రద్దు చేయండి మహాప్రభో.. అని రాష్ట్రంలోని సుమారు రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు చాలా కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నారు. సంఘాల ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమకు ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ వేతనంలో పది శాతం మొత్తం ప్రతినెలా మినహాయించుకోవడం, రిటైరయ్యాక పెన్షన్ ఎంత వస్తుందో తెలియకపోవడం, కనీస పెన్షన్‌కి గ్యారంటీ లేకపోవడం, పీఆర్సీ, డీఏలు ఇవ్వకపోవడం తదితర సహేతుకమైన కారణాలతో సీపీఎస్ విధానాన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముప్పై, ముప్పై ఐదేళ్లు సర్వీస్ చేసినందుకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో హక్కుగా పొందాల్సిన పెన్షన్, పాలకుల భిక్షగా మారడం వారికి ఆవేదన కలిగిస్తోంది. రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ రద్దుకు సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ కేసీఆర్ సర్కార్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో యూనియన్ల హేతుబద్ధమైన డిమాండ్ మేరకు ఒక క్లారిఫికేషన్ జారీ చేసింది. ఈ క్లారిఫికేషన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2003 డీఎస్సీ టీచర్లకు ఓల్డ్ పెన్షన్ స్కీం విధిగా అమలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఓల్డ్ పెన్షన్ స్కీం పొందడం వారి హక్కు. అయినా, దీనిపై తెలంగాణ సర్కార్ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తుండడం అర్హులైన 2003 డీఎస్సీ టీచర్లకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రంలో అమలు..!
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 2004 జనవరి 1 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. 2020 ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వం మెమో నం. 57/04/2019 జారీ చేసింది. జనవరి 2004 నాటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి, ఆలస్యంగా నియామక ఉత్తర్వులు అందుకున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులు మాత్రం ‘ఓల్డ్ పెన్షన్ స్కీంకి అర్హుల’ని పేర్కొంటూ మెమోతో స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయితే, సదరు నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్ ఫలితాలు 2004 జనవరి 1కి ముందే ప్రకటించి ఉండాలనే షరతు విధించింది. క్లారిఫికేషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఓపీఎస్‌లోకి మారడానికి సమ్మతి తెల్పుతూ 2020 మే 31లోగా ఆప్షన్స్ సమర్పించాలని కూడా నిర్దేశించింది. సంఘాలు అభ్యర్థించడంతో గత మార్చి 3వ తేదీ నాడు మరో ఉత్తర్వు జారీచేసి, ఆప్షన్స్ సమర్పించడానికి ఈ ఏడాది 31 ఆగష్టు వరకు గడువు పొడిగించింది. ఈ గడువులోగా ఆప్షన్స్ ఇవ్వని పక్షంలో సదరు ఉద్యోగులు సీపీఎస్ విధానంలోనే కొనసాగుతారని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వోద్యోగుల విషయంలో ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగుతోంది.
ఏపీలో అలా.. టీఎస్ ఇలా..!
ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. కాగా, 2003 డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్‌లో జారీచేసి, ఫలితాలు 2004 జూన్ నెలలోనే ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇదే రీతిలో నియామకమైన ఇతర ఉద్యోగులు ‘ఓల్డ్ పెన్షన్ స్కీం’కి నూటికి నూరు శాతం అర్హులు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కనుగుణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం 2004 సెప్టెంబర్‌కి ముందే ఎంపిక ప్రక్రియ పూర్తయి, సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుకు 2020 సెప్టెంబర్ లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లే ఉంది. 2004 సెప్టెంబర్ 1కి ముందు సెలక్షన్ ప్రాసెస్ పూర్తయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆలస్యం అయిన కారణంగా సీపీఎస్ పరిధిలో చేరిన ఉపాధ్యాయుల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలని 2020 మే నెలలో డీఈవోలను కోరారు. ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లు, ఎంఈఓల నుంచి సమాచారం సేకరించి డీఈవోలు వెంటనే ఉన్నతాధికారులకు వివరాలు సమర్పించారు. అంతే! ఆ తర్వాత ఈ విషయంలో అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. అర్హులైన ఉపాధ్యాయుల వివరాలు తీసుకొని మూడేళ్లు గడిచినా నేటికీ ఓపీఎస్ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. సదరు ఉత్తర్వులు జారీచేస్తే రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుతుంది. వారంతా ఓపీఎస్ పరిధిలోకి వస్తారు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు ఆర్థిక భారం పడదు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించిన పది శాతం సీపీఎస్ వాటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికే తిరిగి వస్తాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీరని వేదన కలిగిస్తోంది.
సీఎం చొరవ చూపాలి!
విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపి, సహేతుకమైన కారణాలతో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మెమోని రాష్ట్రంలో సత్వరం అమలు చేయాలి. ఏపీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఇప్పటికే నిర్దిష్టమైన చర్యలు తీసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి నియామకమైన 2003 డీఎస్సీ టీచర్లకు ఏపీలో ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపునకు మూడేళ్ళ క్రితమే ఉత్తర్వులు జారీచేయగా, ఇక్కడ దానికి భిన్నంగా ఎలా ఉంటుంది? ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారు అన్నప్పుడు సత్వరం స్పందించాలి కదా! ఉపాధ్యాయులు మొరబెట్టుకుంటున్నా, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా తెలంగాణ సర్కార్ ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఎంత మాత్రం తగదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలి. 2004 సెప్టెంబర్ 1 నాటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆలస్యమైన కారణంగా సీపీఎస్ పరిధిలోకి వచ్చిన 2003 డీఎస్సీ టీచర్లతో పాటు ఇదే పద్ధతిలో అపాయింటైన ఇతర ఉద్యోగులకు ఓపీఎస్ అమలుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. అదే విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి, 2004 నుంచి నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలుకు సత్వరం చర్యలు తీసుకోవాలి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అదే బాటలో కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు సైతం సీపీఎస్ రద్దుకు ముందుకు వెళ్తున్నాయి. సామాజిక భద్రత ఏమాత్రం లేని సీపీఎస్ విధానాన్ని రాష్ట్రంలో రద్దు చేసి దేశంలోని మిగతా రాష్ట్రాలకు సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలవాలి.
-మానేటి ప్రతాపరెడ్డి,
TRTF గౌరవాధ్యక్షుడు,
98484 81028