సెంటర్-స్టేట్... టామ్ & జెర్రీ
Center vs states fighting like tom and jerry, is this federalism?
కేంద్రం, రాష్ట్రాల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అయింది. ఒకదాన్ని మరొకటి లెక్కచేయట్లేదు. గతంలో ఎన్నడూ లేనంతటి ఘర్షణ నెలకొన్నది. నీతి ఆయోగ్ సమావేశానికి పదిమంది ముఖ్యమంత్రులు ఆబ్సెంట్ అయ్యారు. పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్‌కు కూడా ఇరవై పార్టీలు దూరంగానే ఉండిపోయాయి. ప్రధాని మోడీ వైఖరికి నిరసనగానే ఇదంతా జరిగింది. రాష్ట్రాలను కలుపుకుపోవడంలో మోడీ విఫలమయ్యారనేది సుస్పష్టం. కేంద్రానికి సహకరించేది లేదని ప్రాంతీయ పార్టీలూ అంతే స్పష్టమైన మెసేజ్‌ను పంపాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
రాజకీయ పార్టీలన్నీ సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు చెప్పేవే. కానీ ఆచరణలో మాత్రం అవే తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఒకదానిపై మరొకటి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నదనేది ప్రాంతీయ పార్టీల బలమైన ఆరోపణ. రాష్ట్రాలకు సహకారం అందించడంలో రాజకీయ పక్షపాతం చూపిస్తున్నారంటూ మోడీపై సూటిగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. చాలాకాలంగా ఇలాంటివి వినిపిస్తున్నా ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలన్నీ జట్టు కట్టడానికి భూమిక సిద్ధం చేసుకుంటున్నాయి.
బలపడుతున్న యాంటీ మోడీ టీమ్
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇరవై విపక్ష పార్టీలూ సంయుక్తంగానే ప్రకటించాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం జరగాలని పట్టుబట్టాయి. అంతకుముందు సైతం దర్యాప్తు సంస్థలను మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటూ 14 విపక్ష పార్టీలు ఏకమై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో యాంటీ మోడీ టీమ్ మరింత బలపడింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరికొన్ని కొత్త సమీకరణాలు తెరమీదకు రాక తప్పదు.
మోడీ హయాంలో కో ఆపరేటివ్ ఫెడరలిజం మంటగలిసిందనే విమర్శలు కేసీఆర్ సహా చాలామంది నుంచి వినిపించాయి. గవర్నర్ వ్యవస్థను తప్పుపడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ఉసిగొల్పుతున్నారని, దాడులతో లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ అవినీతి కామన్ కావడంతో మోడీ ఈ అస్త్రాన్ని ఎంచుకున్నారు. చివరకు విపక్షాలను ఏకం చేసింది కూడా సీబీఐ, ఈడీ దాడులే. దర్యాప్తు సంస్థలను నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 14 పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒకటి.
విపక్షం వీక్‌నెస్‌పై మోడీ వాత
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నేత చిదంబరం, డీకే శివకుమార్ మొదలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వరకు అందరూ ఈడీ, సీబీఐ ఎంక్వయిరీలకు హాజరైనవారే. మమతా బెనర్జీ మేనల్లుడు, లాలూ ప్రసాద్ కుమారుడు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సమీప బంధువులు, ఉద్ధవ్ థాక్రేకు కుడిభుజంగా ఉన్న నేతలు.. ఇలా పదుల సంఖ్యలో అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయినవారే. కర్ణాటక సీఎంగా ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎడ్యూరప్ప ఈ ఆరోపణలతోనే పదవి పోగొట్టుకున్నారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన 40% కమీషన్ స్లోగన్‌తో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.
నిజానికి, ఏ పార్టీ వీక్‌నెస్ ఏంటో మోడీకి బాగానే తెలుసు. కీలెరిగి వాత పెట్టడంలో ఆయన సిద్ధహస్తులు. సహజంగానే ఈ దాడులే విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ మేరకు అపవాదునూ ఆయన మూటగట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్ సహా పలు బీజేపీయేతర పార్టీలకు మోడీ రాజకీయ శత్రువుగా మారిపోయారు. అందులో భాగమే నీతి ఆయోగ్ సమావేశాన్ని, పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం. సహకారాత్మక సమాఖ్యతత్వం అనే అంశాన్ని విపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. మోడీని తూర్పారబడుతున్న పార్టీలేవీ సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి నీతి ఆయోగ్ వేదికగా ప్రశ్నించడానికి సిద్ధపడలేదు.
యూటర్న్‌కి మారుపేరు కేసీఆర్
నిన్నమొన్నటి వరకూ మోడీతో స్నేహం చేసినవారూ ఇప్పుడు వ్యతిరేకమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అందుకు నిదర్శనం. నోట్ల రద్దు, జీఎస్టీ, సాగు చట్టాల్లాంటి అనేక అంశాల్లో మద్దతు పలికారు. ఆ తర్వాత యూ-టర్న్ తీసుకున్నారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి మోడీకి వ్యతిరేకంగా చర్చలు జరిపారు. ఫ్రంట్ పాలిటిక్స్ బెడిసికొట్టాయి. కలిసొచ్చేవారు లేరని డిసైడ్ అయిపోయారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒంటరిపోరు అనివార్యమైంది. అప్పుడప్పుడూ కేజ్రీవాల్‌తో అంశాలవారీగా కలిసిపోతున్నారు. వీరిద్దరి స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో వారికే ఎరుక.
మోడీ విధానాలను కేసీఆర్ తూర్పారపడుతున్నా ఆయనకు ఈయన ఏమాత్రం తీసిపోరు. ఇద్దరి విధానాలూ ఒకలాంటివే. పార్లమెంటు భవనాన్ని మోడీ ప్రారంభించినట్లుగానే కొత్త సెక్రటేరియట్‌నూ కేసీఆర్ ఓపెన్ చేశారు. ఈ రెండింటినీ వారు సొంత ప్రాపర్టీగా భావిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని గులాబీ నేతలు తప్పుపడుతున్నారు. కానీ సెక్రటేరియట్‌కు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడాన్ని మాత్రం సమర్ధించుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎలెక్టెడ్ పర్సన్ రాష్ట్రపతి అయితే కేంద్రం ద్వారా నామినేట్ అయిన వ్యక్తి గవర్నర్ అంటూ వివరణ ఇస్తున్నారు.
ఓటు బ్యాంక్ పాలిటిక్స్
అటు మోడీ, ఇటు కేసీఆర్ సెక్యులర్ అనే చెప్పుకుంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ సెక్యులర్ అనే కొలమానాలు అక్కర్లేదు. పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. కానీ సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో అవి కనిపించలేదు. కేవలం ఒక మతానికి సంబంధించిన యజ్ఞాలు, పూజలకే పరిమితమైంది. బీజేపీకి హిందుత్వ ముద్ర ఉండడంతో ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగా కేసీఆర్ పోటీ పడుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హిందుగాళ్ళు.. అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లతో కరీంనగర్ సిట్టింగ్ చేజారిపోయింది. అంతకుముందు ఒక్క ఎంపీ సీటు ఉంటే ఆ ఎన్నికల్లో బీజేపీ బలం నాలుగు సీట్లకు పెరిగింది.
రాజశ్యామల, సుదర్శన, చండీయాగం లాంటివెన్నో చేసిన కేసీఆర్‌ను మించిన హిందు ఎవరు అనే వాదనతో గులాబీ నేతలు డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించారు. కేసీఆర్ కుమార్తె కవిత సైతం హిందూ ఆలయాల సందర్శన మొదలుపెట్టారు. హనుమాన్ చాలిసా పారాయణం ప్రోగ్రామ్‌ను అందుకున్నారు. జైశ్రీరామ్ అనే బీజేపీ నినాదానికి పోటీగా రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్‌కీ అనే స్లోగన్ వినిపిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆ లోగోలో యాదాద్రి టెంపుల్‌ను కూడా చేర్చారు. ఇక వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు.
తప్పులెన్నువారు...
పార్లమెంటులో సాధువులతో కలిసి మోడీ దిగిన గ్రూపు ఫోటోను బీఆర్ఎస్ సోషల్ యాక్టివిస్టులు షేర్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. సెక్యులర్‌గా ఉండాల్సిన పార్లమెంటు భవనాన్ని ఒక మతానికి వేదికగా మార్చేశారంటూ కామెంట్ చేశారు. బీజేపీ సోషల్ మీడియా యాక్టవిస్టులు సైతం రెచ్చిపోయారు. మోడీని హిందుత్వ అని విమర్శించే గులాబీ నేతలను ఎండగడుతున్నారు. గతంలో సీఎం చైర్‌లో చిన జీయర్‌ను కూర్చోబెట్టిన కేసీఆర్ ఫోటోను బైటకు తీశారు. ఇది సెక్యులర్ స్ఫూర్తేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకరి తప్పులను మరొకరు బహిర్గతం చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ మాత్రమేకాక అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీతో రాజకీయంగా ఢీకొంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల వరకూ ఇలాంటి సర్కస్ ఫీట్లు చాలా కనిపిస్తాయి. ఫలితాల తర్వాత ఆ పార్టీల మధ్య ఐక్యత అలాగే కొనసాగుతుందా మళ్లీ కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఆయనకు వ్యతిరేకంగా ఈ రాజకీయ పోరు కంటిన్యూ అవుతుందా? అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌తోనే కలిసి ఉంటాయా? ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశించిన పదవులు, మంత్రివర్గంలో పోర్టుఫోలియోలు రాలేదనే అసంతృప్తితో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ మొదలవుతాయా? సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందా ఇలాంటి అనేక సందేహాలకు వచ్చే ఏడాది జూన్ తర్వాత సమాధానం లభిస్తుంది.
ఎన్. విశ్వనాథ్
99714 82403