నైమిశారణ్యంలో వేద శాస్త్ర కేంద్రం
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గంగా లోయ ప్రాంతం వైదిక సంస్కృతికి మూలాధారం అని భావిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గంగా లోయ ప్రాంతం వైదిక సంస్కృతికి మూలాధారం అని భావిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన వేదాలకు దైవిక మూలం ఇక్కడ ఉందని విశ్వసిస్తారు. ఈ సంస్కృతిని వైదిక సంస్కృతి అని పిలుస్తారు. వేద విజ్ఞానం, వైదిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీతాపూర్ జిల్లా, నైమిశారణ్యంలోని ఠాకూర్‌నగర్‌లో ‘వేద విజ్ఞాన అధ్యయన, పరిశోధనా కేంద్రం’ ఏర్పాటు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది.
నైమిశారణ్యం మూలం..
మిష అంటే మాయ, మొహం లేదా ఆలోచన. ‘న’ మిష అంటే ఎటువంటి మొహం, మాయ లేనిది అని అర్థం. ఆ పదమే కాలగమనంలో ‘నైమిషా’గా పరివర్తన చెంది ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఋషులు, ధ్యానులు, జ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు జీవితంలో అన్ని బంధాలను, మోహాలను విడిచి పెట్టి ముక్తి మార్గ సాధనలో భాగంగా ధ్యానం కోసం చేరుకునే స్థలం. ఇది మహాభారతం, పురాణాలలో ప్రస్తావించబడిన పురాతన అడవి. ఇది లక్నో నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నది ఒడ్డున ఉంది.
వేద విజ్ఞాన కేంద్రం
ఎనభై ఎనిమిది వేల మహర్షుల పవిత్ర క్షేత్రమైన నైమిశారణ్య సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శ్రీ నైమిశారణ్య ధామ్ తీర్థ వికాస్ పరిషత్’ ను ఏర్పాటు చేసి ఇక్కడ చేపట్టే ప్రతి ప్రాజెక్టు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తయ్యేలా పర్యవేక్షిస్తోంది. అంతేకాక వేద విజ్ఞాన అధ్యయన పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. వేద శాస్త్రానికి సంబంధించిన అంశాలపై పరిశోధనా రచనలు చేపట్టి వాటిని ఈ కేంద్రం ద్వారా ప్రచురిస్తారు. ఈ సంస్థ వేద విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందించడమే కాకుండా, వేద నిర్మాణశైలి లేదా వాస్తు శాస్త్రంలో మాస్టర్స్ కోర్సులను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కేంద్రంలో యాభై వేల పుస్తకాలతో ఒక పెద్ద గ్రంధాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లోని మన్ మందిర్ వంటి వేదశాల, వేద మ్యూజియం, వేదోద్యన్, తారా మండల్, సైన్స్ లాబొరేటరీ, ఖగోళ శాస్త్ర విద్యార్థుల కోసం ప్లానెటోరియం లాంటివి ఈ కేంద్రంలో నెలకొల్పనుండడం విశేషం. అంతేకాకుండా గురుకుల సంప్రదాయాల ప్రకారం తరగతి గదులు నిర్మించనున్నారు. ఆలయ నమూనాను పోలి ఉండేలా వేద వాస్తు ప్రకారం ఈ సముదాయాన్ని నిర్మించనుండడం మరో ప్రత్యేకత. వేదాలను సూచించే పుస్తకాలను, విగ్రహాలను ప్రతిష్టించే ఒక వేద దేవాలయం కూడా అక్కడ రూపుదిద్దుకోనుంది. అంతేకాకుండా విద్యార్థులు పూర్తి శ్రద్ధాసక్తులతో వేద విద్యను అభ్యసించేందుకు, పరిశోధనలు చేపట్టేందుకు అనువుగా 300 మంది విద్యార్థులకు సరిపడా వసతి గృహాన్ని కూడా నిర్మించనున్నారు.
- యేచన్ చంద్రశేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్
88850 50822