ఎన్నికలే హద్దుగా పద్దు

Budget 2024: Elections are the main agenda of Budget 2024

Update: 2024-02-01 01:00 GMT

ఈ సారి బడ్జెట్‌ వరాల జల్లు కురిపించదు.. తాయిలాలు మాత్రమే పంచుతుంది. ఎందుకంటే ఇది ఎన్నికల ముందు సమర్పించే బడ్జెట్. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు.. ఇందులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అయ్యే సాధారణ ఆదాయ వ్యయ అంచనాలు, అలాగే ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరుతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అందుకే దీన్ని తాత్కాలిక బడ్జెట్‌గానే పరిగణించాలి. అందుకే ఇందులో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పెద్ద మార్పులు లేదా కొత్త దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లు ఉండే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్‌ జులైలో ఉంటుంది.

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం సహజమే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కేటాయింపులు పెంచుతూ మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు ఆకట్టుకునేలా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ ఉండే అవకాశముంది. అలాగే దేశీయ ఆవిష్కరణలు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రాయితీలను ప్రకటించే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని పెంచి ఊరట కలిగించాలనే ప్రయత్నం చేయవచ్చు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళగా

2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1970-71వ ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. తన తొలి బడ్జెట్‌ను 2019లో ప్రవేశపెట్టారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆరవ ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. బడ్జెట్‌ ప్రతులను ఒక సూట్‌కేసులో అప్పటి ఆర్థికశాఖ మంత్రులు సూట్‌కేసులో తీసుకొచ్చేవారు. కానీ రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్మలమ్మ ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు.

మహిళా సాధికారతకు కేంద్రం పెట్ట పీట

ఈ బడ్జెట్‌లో భారీ మార్పులు, పథకాలకు అవకాశం లేదు. కానీ ఇది కొత్త ప్రభుత్వం తీసుకురాబోయే పూర్తి బడ్జెట్‌కు ఓ సూచనగా నిలుస్తుంది. దీంతో ఆయా రంగాల నిపుణులు మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు పద్దులో కేంద్రం పెట్టపీట వేస్తుందా, లేదా అని మహిళలు ఎదురు చూస్తున్నారు. ఆధునిక భారతీయ మహిళలు బడ్జెట్‌లో ఆశిస్తున్న మార్పులు ఏవో చూద్దాం. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం, నిర్భయ ఫండ్, సక్షం అంగన్‌వాడీ, పోషణ్‌కు కేటాయింపులతో మహిళా సంక్షేమ పథకాలపై కేంద్రం దృష్టి సారించనుంది. గత దశాబ్దంలో మహిళలకు బడ్జెట్‌ కేటాయింపులు 30 శాతం పెరిగాయి. ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు పెంచాలని స్త్రీలు కోరుతున్నారు. నేరుగా నగదు బదిలీకి వీలు కల్పించే పథకాలను ఆశిస్తున్నారు. అదే విధంగా మహిళా రైతులకు పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.12,000 వరకు పెంచాలని కోరుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని భావిస్తున్నారు. అలానే 7.5 శాతం వడ్డీతో 2సంవత్సరాలకు 2 లక్షల వరకు పొదుపు చేసుకునేలా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరుతున్నారు.

ఆర్థిక వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ

బడ్జెట్ అంటే కేవలం సంక్షేమ పథకాలే కాదు. ఇది ఆర్థిక వృద్ధిని పెంచడం, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంపై కూడా ఫోకస్‌ చేస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో డిమాండ్‌ను పెంచేందుకు, మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోనుంది. రాబోయే ఎన్నికలు ఉన్నప్పటికీ, బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా మధ్యంతర పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకుని అమలు చేయవచ్చు. ఆర్థిక వృద్ధిలో అంచనాల పెరుగుదలతో, మధ్యంతర బడ్జెట్ 2024-2025 ఆర్థిక సంవత్సరం కోసం అధిక ప్రత్యక్ష పన్ను వసూళ్లను అంచనా వేయవచ్చు. మొత్తం పన్ను వసూళ్లలో 12-13% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. 2023-2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14% తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

మోదీ సర్కార్ తాయిలాలు

సమాజంలోని ఐదు కీలక వర్గాలను మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుని తాయిలాలు ప్రకటించే యోచన చేస్తోంది మోదీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కనుక ఐదు వర్గాలను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్‌ను తయారు చేస్తున్నట్లు ఉహాగానాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు మహిళలు, బీద బడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, గిరిజనులపై బడ్జెట్‌లో ఎక్కువగా దృష్టి సారించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. ఇప్పటికే పైన పొందుపర్చిన ఐదు వర్గాల వారికి ఇస్తున్న పథకాలలో మరిన్ని మేలు చేసే అంశాలను చేర్చడంతో పాటు ఇంకొన్ని కొత్త పథకాలను తీసుకొచ్చేలా మోదీ సర్కార్ ప్రణాళిక రూపొందించవచ్చు. విద్య నైపుణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ రంగలో వర్తించే పథకాల ద్వారా యువత కలలు, వారి అభివృద్ధి కోసం చేయబోయే కార్యక్రమాలను నొక్కి వివరిస్తున్నారు. ఇలానే మిగతా పథకాలపై కూడా దృష్టి సారించి మహిళలు, పేదలు, యువత, రైతులు, గిరిజనుల ఓటు బ్యాంకే లక్ష్యంగా బడ్జెట్‌ను రూప కల్పన చేసి మరో మారు కేంద్రంలో అధికారం చేపట్టడమే నిర్మలమ్మ లక్ష్యం.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News