బీఆర్ఎస్ తప్పిదాల.. ఫలితం అనుభవించాల్సిందే!
వామపక్ష పార్టీలు సాధారణంగా ఏడాదికో... ఐదేండ్లకో తాము సాధించిన పోరాట విజయాలు... తీసుకున్న నిర్ణయాలలో ఏదైనా తప్పిదం అయితే
వామపక్ష పార్టీలు సాధారణంగా ఏడాదికో... ఐదేండ్లకో తాము సాధించిన పోరాట విజయాలు... తీసుకున్న నిర్ణయాలలో ఏదైనా తప్పిదం అయితే చారిత్రాత్మక తప్పిదాలు అని ప్రకటించి ముందుకు సాగేవి.. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అలాంటి చారిత్రాత్మక తప్పిదాలు ఎన్నో చేశారు. 2014లో టీఆర్ఎస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్న నాటి నుంచి బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన నాటి కాలంలో అనేక పొరపాట్లు చేశారు. తెలంగాణ పేగు బంధం తెంపుకున్న నాడే కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని గంటాపథంగా చెప్పవచ్చు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పేరు మాత్రమే మారుతుందని కేసీఆర్ అండ్ కో ఎంత చెప్పుకున్నా... తెలంగాణకు చెందిన నిధులు మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వెచ్చించడం... ఇక్కడి రైతాంగం, ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి లోకాన్ని నిర్లక్ష్యం చేయడం.. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పిదం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వంతో ఢీ కొట్టాలని... దేశంలో చక్రం తిప్పాలని భావించిన ఎన్టీఆర్, చంద్రబాబులతో పాటు కేసీఆర్ కూడా ఆ చక్రం ఇరుసులో ఇరుక్కుపోయి చతికిలపడ్డారు.
నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం...
ప్రత్యేక తెలంగాణ వస్తే ఇంటికో కొలువు వస్తుందని ఆశల పల్లకీలో నిరుద్యోగ యువతను ఉద్యమంలో ఊరేగింపునకు వాడుకున్నారు. వారి ద్వారా రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చాకా తనకు ఎదురు ఎవరూ చెప్పరని, అమరుల త్యాగాలను మరుగున పడేసేలా తాను మాత్రమే ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ పదేపదే చెప్పుకోవడం తోనే తెలంగాణ సమాజం ఆలోచనలో పడింది. పదేండ్ల పాలనలో కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ తప్ప మిగతా శాఖలను నిర్లక్ష్యం చేయడం. రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుండా పోవడమే కాకుండా ఉద్యోగుల వయోపరిమితి పెంచడంతో నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
ప్రతిపక్షం లేకుండా చేసే ఎత్తుగడ...
2014లో అత్తెసరు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ఏవో కారణాలు చూపి లాక్కోవడాన్ని తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోలేదు. 2018 ముందస్తు ఎన్నికలలో పూర్తి స్థాయి మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ సమాజం తీర్పునిచ్చిన ప్పటికీ, ప్రజా ప్రతినిధులను సంతలో పశువులను కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షించలేదు. అలాగే దాదాపు 20 ఏండ్లు తనతో పాటు ప్రయాణం చేసిన ఉద్యమ నేత ఈటల రాజేందర్‌ను అవమానకరంగా బయటకు పంపిన తీరును హర్షించలేదు. అలాగే ప్రతిపక్షం నేతలను కల్సుడు అంటుంచితే సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడంతో అది కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్లింది.
ఒంటెద్దు పోకడలతో...
ప్రతిపక్ష నేతలను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేయడం ఒకెత్తు అయితే... కేసీఆర్‌తో సమానంగా అంతకంటే ఎక్కువగానే యూనివర్సిటీ విద్యార్థులను, నిరుద్యోగులను ఒక్కతాటి మీదికి తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను అరెస్ట్ చేయించడం ద్వారా సరిదిద్దుకోలేని తప్పిదం చేశారు. అలాగే పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేస్తున్న పట్టించుకోకపోవడం, ప్రభుత్వమే భూముల అమ్మకానికి దిగడం విడ్డూరం. అలాగే ఓటర్ల అసమ్మతి ఏమాత్రం పెరిగినా ఓటమి తప్పదు.. అభ్యర్థులపై ఎంత వ్యతిరేకత పెరిగినా వారికే సీట్లవ్వడం ఓటమికి కారణం. అలాగే గతంలో 70 నుంచి 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను పేర్లు మార్చడమే కాకుండా.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు వ్యయం భారీగా పెంచడం ప్రజలు స్వాగతించలేదు. దీనికి తోడు ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకునిపోయాయి. ప్రతిపక్షం పదేపదే ఎత్తి చూపినా ఒంటెద్దు పోకడలు పోవడం.. అహంకారపూరితంగా వ్యవహరించడం వంటివే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో మరి ఆలస్యం చేయడం వంటి అనేక పొరపాట్లు కేసీఆర్ చేశారు. దీంతో ఎలాగైనా ఓటుతో బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.. తీర్పు చెప్పేశారు.
సత్యారం భీమప్ప
జర్నలిస్ట్
99593 80524