ఆ పార్టీల గేమ్ ప్లాన్‌ మార్చిన రేవంత్!

ఆ పార్టీల గేమ్ ప్లాన్‌ మార్చిన రేవంత్!... BRS, BJP plans changed by Revanth reddy hath se hath jodo yatra

Update: 2023-02-20 18:45 GMT

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన సాధించింది పెద్దగా ఏమి లేదు. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్ అయ్యాక జరిగిన ప్రతి ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే దీనికి కేవలం రేవంత్ రెడ్డి నాయకత్వమే కారణం కాదు. పార్టీలో రేవంత్ పెద్దరికాన్ని అంగీకరించలేని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు దీనికి కారణం. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడులో కాంగ్రెస్ స్థానాన్ని దక్కించుకో కపోగా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరనే అభిప్రాయాలు ప్రజల్లో విశ్లేషకుల్లో వెల్లువెత్తాయి. మరోవైపు ఆ పార్టీ జాతీయ నాయకుడు చేపట్టిన భారత్ జోడో యాత్ర సైతం రాష్ట్రంలో ప్రభావం చూపలేదు.

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పరస్పర విమర్శలు, తిట్ల దండకంతో రాష్ట్రంలో మీడియా అటెన్షన్ పొందుతూ ప్రధాన వార్తల్లో కాంగ్రెస్ నాయకులకు కనీస చోటు దక్కకుండా వ్యూహాత్మక గేమ్ ప్లాన్ ద్వారా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ గేమ్ ప్లాన్‌తో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండాల్సిన కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పరిమితం చేసేలా రెండు పార్టీలు పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా జరిగిన ఉపఎన్నికలలో బీజేపీను రెండో స్థానానికి పరిమితం చేశారు. ఈ ఎత్తుగడలతో రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్నామ్యాయం బీజేపీ అనేవిధంగా రాష్ట్ర ప్రజల్లో అభిప్రాయం నెలకొల్పేలా చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగయిందనే అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి. అయితే, ఈ మధ్యే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించిన 'హాత్ సే హాత్ జోడో యాత్ర'కు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ యాత్ర ద్వారా రేవంత్ ప్రజల్లోకి చొచ్చుకుపోయి, అధికార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ యాత్రకు మీడియా స్పేస్ అధికంగా దక్కుతోంది. ఈ పరిస్థితులను రేవంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటూ నియోజకవర్గ స్థాయి నాయకుల అక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వ పోకడలను ప్రజల్లో నిలదీస్తూ పదునైన విమర్శలతో ముందుకు సాగుతున్నారు దీంతో ఈ విమర్శలను ప్రధాన మీడియా కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీగా మార్చారు రేవంత్ రెడ్డి. తద్వారా బూత్ స్థాయిలో నైరాశ్యంగా ఉన్న కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్తేజం మొలకెత్తి, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొనేలా పరిస్థితులు తయారవ్వచ్చు.

మొత్తం మీద రేవంత్ చేపట్టిన 'హాత్ సే హాత్ జోడో యాత్ర' తెలంగాణాలో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోస్తుందా? బీజేపీ, బీఆర్ఎస్‌ల గేమ్ ప్లాన్‌ను మార్చేసి అధికార బీఆర్ఎస్‌కి తామే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజల్లో అభిప్రాయం కలిగేలా చేస్తుందా?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ చేపట్టిన ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అధిక ఉత్సాహాన్ని నింపిందనడంలో అతిశయోక్తి లేదు. పార్టీలో రేవంత్ పెద్దరికాన్ని అంగీకరించలేని కొందరు నాయకులు, సీనియర్లు వారి తీరును మార్చుకుని భేషజాలకు తావివ్వకుండా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్‌తో కలిసి అడుగేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా కనీసం రెండో స్థానాన్ని బీజేపీకి అప్పజెప్పకుండా జాగ్రత్తపడి ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకోవచ్చు.

శ్రీనివాస్ గుండోజు

99851 88429

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News