మృత ఉద్యోగికి లభించే ప్రయోజనాలు..

ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే, ఆ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు ఆ ఉద్యోగికి లభించే

Update: 2024-10-11 03:44 GMT

ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే, ఆ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు ఆ ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి పలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అందువలన మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తూ, సర్వీస్ ఉండగానే మరణించినట్లయితే తనకు ఈ కింద పేర్కొనబడిన ప్రయోజనాలు లభిస్తాయి.

లభించే ప్రయోజనాలు..

మృతి చెందిన ఉద్యోగి అంత్యక్రియలు ఖర్చుల నిమిత్తమై 20,000/-రూపాయలు చెల్లించడం, నిబంధనల ప్రకారం 16 లక్షల రూపాయలకు మించకుండా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మరణించిన ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్న 300 రోజులకు మించకుండా ఎర్న్‌డ్ లీవును అట్లే ఒకవేళ ఎర్నె‌డ్ లీవు తక్కువ ఉన్నట్లయితే దానికి సరిపడా సగం జీతం సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, జమ చేయబడిన ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ తిరిగి చెల్లింపు ఒకవేళ ఉన్నట్లయితే అట్లే సామూహిక బీమా పథకంలో నిల్వయున్న సేవింగ్స్ మొత్తం వడ్డీతో సహా చెల్లించడం, సదరు ఉద్యోగి గ్రూపును అనుసరించి కుటుంబానికి 15,000 లేదా 30,000 లేదా 60,000 లేదా 1,20,000 చెల్లించడం జరుగుతుంది. అలాగే పూర్తి పింఛనును ఉద్యోగి మృతి చెందిన ఏడేళ్ల వరకు కుటుంబానికి చెల్లిస్తారు. తదుపరి కుటుంబ పింఛనును అర్హతను అనుసరించి చెల్లిస్తారు. సాధారణ భవిష్య నిధి అనగా జిపిఎఫ్ లో జమ ఉన్న మొత్తాన్ని వడ్డీతో సహా బూస్టర్ స్కీం కింద అదనంగా పదివేల రూపాయలు మించకుండా చెల్లించడం జరుగుతుంది. మరణించిన ఉద్యోగికి సర్వీసులో ఉండగా ప్రభుత్వం ద్వారా మంజూరైన గృహ నిర్మాణం, ఇంటి కొనుగోలు, మోటార్ వాహనం, కంప్యూటర్ కొనుగోలు ఇతర లోన్లు, అడ్వాన్సులన్నీ వడ్డీతో సహా మాఫీ అవుతాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులలో ఒకరికి అర్హతల మేరకు కారుణ్య నియామకం కల్పించబడుతుంది. అలాగే మరణించిన ఉద్యోగి పని చేసిన చోటు నుండి కుటుంబం స్థిర నివాసం ఏర్పరచుకొను స్థానం వరకు ట్రావెలింగ్ అలవెన్స్ నిబంధన ప్రకారం టి ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. TSGLI పాలసీలలో ఉన్న మొత్తాన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. ఇవన్నీ మరణించిన ఉద్యోగి కుటుంబానికి లభించే ప్రయోజనాలు..

సి మనోహర్ రావు,

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి,

96406 75288


Similar News