మేడిగడ్డపై బీజేపీ మౌనం వెనుక…

Behind BJP's silence on Medigadda...

Update: 2024-02-18 01:00 GMT

మొన్నటిదాకా కేంద్రంలో చక్రం తిప్పుతామన్న కేసీఆర్ నేడు మరొకరి పొత్తు కోరాల్సి రావడంతో విధి బలీయమైనదని మరోసారి రుజువైంది. 1989లో ఎన్టీఆర్ జీవితంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.

మేడిగడ్డపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లు యుద్ధం తరహాలో వాగ్బాణాలు సంధించుకుంటుంటే బీజేపీ మౌనం వెనుక అర్ధాలు వేరులే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మేడిగడ్డ అంశాన్ని ఎన్నికల సమయంలో మొదట చర్చకు తెచ్చింది బీజేపీ నాయకుడు బండి సంజయ్. ఈ అంశాన్ని కాంగ్రెస్ పట్టుకుని ప్రధాన ఎన్నికల ప్రధాన అస్త్రంగా వాడుకుంది. ఎన్నికల్లో విజయం సాధించింది.

ఆ కుటుంబానికే లబ్ధి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మార్పించినట్లు వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పై దూకుడుగా ఉన్న సంజయ్ వల్ల ప్రమాదమని ఆయనను మార్పించినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య స్నేహం నడుస్తున్నదనేది వాస్తవం అనుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు హామీతోనే నేడు మేడిగడ్డపై బీజేపీ మౌనం వహించినదని భావిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, వారి పాలనలో జరిగిన అవకతవకలు ఒక్కోటి బయటపడి ఆ పార్టీని బలహీనపరుస్తున్నది. ఈ దశలో ఎన్నికలకు వెళ్లాలంటే సరైన ఎజెండా లేదు బీఆర్ఎస్‌కు. కాగ్ నివేదిక కూడా వ్యయానికి తగ్గ ఫలితం రాలేదని చెప్పింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో, తమ వాటా నీటిని ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారని విమర్శలు వస్తున్నాయి. ట్రిబ్యునల్ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాకపోవడంతో విమర్శలకు గురైనారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యవేక్షణ కొరవడడం, అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

వారిపైనే దాడి తక్కువ!

అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఎదురు లేకుండా నడిచిన బీఆర్ఎస్ పార్టీకి నేడు అన్నీ ఎదురు దెబ్బలే. ఫలితంగా ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలంటే వచ్చే స్థానాలపై గ్యారెంటీ లేదు. అందుకే బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నదని, త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు ఊహిస్తున్నారు. అలాగే కేటీఆర్ కూడా గతంలోలాగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేకపోతున్నారని, సభలో హరీష్ రావు, రేవంత్ ఎదురు దాడికి తట్టుకోలేక పోతున్నారని అర్థమవుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలను ఈడీ దాడులతో వేధిస్తున్నదనే వాదన ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకులపై మాత్రం ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా, వారిపై దాడి జరిగింది తక్కువే! దాని వెనుక మర్మం వారితో పరోక్ష స్నేహమేనని అర్థమవుతున్నది. మొన్నటిదాకా తాను కేంద్రంలో చక్రం తిప్పుతామన్న కేసీఆర్ నేడు మరొకరి పొత్తు కోరాల్సి రావడం విధి బలీయమైనదని మరోసారి రుజువైంది. 1989లో ఎన్టీఆర్ జీవితంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన రాష్ట్రంలో ఓడిపోయి, ఎంపీ సీట్లు అనుకున్నవి రాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉపప్రధాని పదవి దక్కాల్సిన అవకాశం పోయింది. అందుకే పెద్దలు ఓడలు బళ్ళు, బళ్లు ఓడలవుతాయి అంటారు.

యం.వి.రామారావు,

సీనియర్ జర్నలిస్టు

72869 64554

Tags:    

Similar News