ఇండియా ఇన్ స్పేస్

ఆదిమానవుల కాలం నుంచి నేటి ఆధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం వరకు విశ్వావిర్భావం, నక్షత్రాల, గ్రహాల గమనాలపై మానవుని అన్వేషణ, ఆసక్తి, అభిరుచి, జ్ఞాన శోధన మరియు పరిశోధనల ప్రయత్నాల పరంపర వంటివి ఆగకుండా ,అలుపన్నది లేకుండా కొనసాగుతూనే వుంది

Update: 2024-08-23 07:45 GMT

దిమానవుల కాలం నుంచి నేటి ఆధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం వరకు విశ్వావిర్భావం, నక్షత్రాల, గ్రహాల గమనాలపై మానవుని అన్వేషణ, ఆసక్తి, అభిరుచి, జ్ఞాన శోధన మరియు పరిశోధనల ప్రయత్నాల పరంపర వంటివి ఆగకుండా ,అలుపన్నది లేకుండా కొనసాగుతూనే వుంది.రాత్రి పూట ఆకాశ వీధుల్లో కనిపించే ఎన్నో అద్భుతాలు "అంతరిక్ష అయస్కాంతం"లా మనిషి కెమెరా కంటిని ఆకర్షిస్తూనే వున్నాయి. చిన్నప్పుడు పిల్లలు తినడానికి మారాం చేస్తే అమ్మ చందమామ రావే,జాబిల్లి రావే అని చందమామను చూపిస్తూ,మాటలతో మరిపిస్తూ,మురిపిస్తూ "గోరు వెన్నెల ముద్దలు" తినిపించే స్థాయి నుంచి జాబిల్లి ఉపరితలాన్ని స్పర్శించే స్థాయికి ఎదిగింది మానవ మేధస్సు కృషి..!త్వరలోనే అమ్మ జోల పాట చందమామ ఉపరితలంపై పాడే రోజులు రాబోతున్నాయి..!చుక్కల్లో జాబిల్లి మనకు ఎప్పటికీ ప్రత్యేకమే.మన గ్రహానికి సంబంధించిన ఒకే ఒక సహాజ ఉపగ్రహాం చంద్రుడు.అందుకే ఈ "నెలరాజు"పై ప్రపంచ శాస్త్రవేత్తలకు కూడా ప్రత్యేక అభిమానం.

నేడు మనందరికి గర్వకారణమైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా గత సంవత్సరం(2023) ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు యావత్ ప్రపంచం ఆసక్తితో చూస్తుండగానే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది.ఆ క్షణాన ప్రతి భారతీయుడి గుండె వందేమాతరం నినాదంతో సగర్వంగా మన త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసింది.ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటికొచ్చి చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించి,పరిశోధించి శాస్త్రీయ సమాచారాన్ని మన శాస్త్రవేత్తలకు పంపించింది.ఒక హాలీవుడ్ సినిమా నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో భారత్ చేసిన ప్రయోగం చంద్రయాన్ -3మిషన్ సాయంతో చంద్రునిపై అడుగుపెట్టిన నాల్గవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో సురక్షితంగా చేరిన మొదటిదేశంగా నవచరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అసామాన్యమైన కృషిని ఆగస్టు 26,2023న మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మనందరి తరపున కొనియాడారు.ఆ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి "శివశక్తి" అని నామకరణం చేసి ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగష్టు 23,2024 ను పురస్కరించుకుని దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా మన అంతరిక్ష విజయాలు,మన శాస్త్రవేత్తల ప్రయాణం,రోదసికి నేటి సాంకేతికత అనుసంధానం, అప్లికేషన్లు వంటి ఎన్నో విషయాలకు సంబంధించిన అంశాలపై వివిధ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు తదితర కార్యక్రమాలతో భారత ప్రభుత్వం మరియు ఇస్రో వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వసంస్థలతో కలిసి నేటితరపు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతుంది.వారిలో ఆసక్తిని పెంచి భవిష్యత్ లో ప్రముఖ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కృషి చేస్తుంది.

భారత అంతరిక్ష రంగం పితామహుడు,విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త పద్మవిభూషణ్ విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం, గౌరవార్థం ల్యాండర్ కు విక్రమ్ అనే పేరు పెట్టి ఈ అవనిపైనే కాక అంతరిక్షంలో సైతం మన విక్రముడి కీర్తిని యావత ప్రపంచానికి ఘనంగా చాటింది మన దేశం.1957 లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ "స్పుత్నిక్" ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తు అంతా అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలతోనే ముడిపడి వుందని గమనించి మన దేశంలో వున్న పేదరికం, నిరుద్యోగం నిరక్షరాస్యత వంటి మహామ్మారులను ఈ దేశం నుంచి తరిమేయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా వుండాలని,మన దేశంలోని సామాన్యుల చెంతకు సాంకేతిక పరిజ్ఞానం చేరినప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశంగా వుండగలమని బలంగా విశ్వసించిన విక్రమ్ సారాభాయ్ అప్పటి ప్రధాని నెహ్రూని ఒప్పించి, మరో విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త, భారతీయ అణ్వాస్త్ర రంగ పితామహుడు హోమి జె బాబా పర్యవేక్షణలో 1962 లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు.అది 1969 లో నేటి ఇస్రో గా ఆవిర్భవించింది.కాలక్రమంలో ఉపగ్రహా భాగాలను దేశీయంగా తయారు చేసుకుంటూ తద్వారా ఉపగ్రహ వాహక నౌకలను కూడా తయారుచేసే స్థాయికి ఎదిగాం.చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో అసాధారణ మైన ప్రయోగాలు చేసి అగ్రరాజ్యాలకు సైతం శాస్త్రీయంగా సవాళ్లు విసిరాం.

1975 ఏప్రిల్ 19 సోవియట్ యూనియన్ నుండి మన మొదటి శాటిలైట్ "ఆర్యభట్ట"ను విజయవంతంగా ప్రయోగించాం.1980 లో ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని మనదేశం నుంచే ప్రయోగించి మనసత్తా చాటాం.ఇక అప్పటి నుంచి ఎన్నో ఘన విజయాలు సాధించాం.అప్పుడప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు, అవమానాలు, అవరోధాలు,వైపల్యాలు ఎదురైనా నిరాశచెందకుండా,పట్టుదల వదలకుండా మన అంతరిక్ష ప్రయాణం అనంత విశ్వాన్వేషణే ఉద్దేశంతో ఎన్నో లక్ష్యాలతో విజయవంతంగా కొనసాగుతూనే వుంది.పి యస్ ఎల్ వీ,జి యస్ ఎల్వీ,భారతీయ అత్యంత బరువైన రాకెట్ వాహాక నౌక మార్క్ 3 (ఎల్ వి ఎమ్-3),చంద్రుని పరిశోధనే లక్ష్యంగా చంద్రయాన్ -1,2,3 మిషన్ లతో పాటు మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహానికి సంబంధించిన విజయవంతమైన ప్రయోగం(2014)మంగళయాన్,సూర్యునిఉపరితలం రహాస్యాన్వేషణే లక్ష్యంగా ఆదిత్య ఎల్ 1 మిషన్ తో పాటు ఎన్నో ప్రయోగాల విజయాలతో మన జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ అంతరిక్ష వేదకలపై రెపరెపలాడించాం.పాములను ఆడించే దేశం అని ఒకప్పుడు అవమానించబడ్డ మనమే అంతరిక్ష రాకెట్ ప్రయోగాలను శాసించే స్థాయికి ఎదిగాం.వేరే దేశాల సాయంతో,సైకిల్ పై ఉపగ్రహాల విడిభాగాలు మోసుకెళ్ళి ప్రయోగాలు చేసిన మనం ఒకే రాకెట్ లో 104 ఉపగ్రహాలను పంపించి నేడు అంతరిక్ష వ్యాపారంలో దూసుకెళ్తున్నాం.స్పేస్ నుంచి ఇండియా ఎలా కనిపించిందని ఇందిరాగాంధీ రాకెశ్ శర్మను అడిగితే " సారే జహాసే అచ్ఛా" అంటూ ఆయన బదులిచ్చారు.నిజమే నేడు మనమంతా గట్టిగా అనాల్సిందే మేరా భారత్ మహాన్.

ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే భారతదేశం ప్రపంచ విజ్ఞానానికి గణితం, వైద్యశాస్త్రంతో పాటు ఖగోళశాస్త్రంలో కూడా తన కృషిని అందించింది.కానీ వీటి అభివృద్ధి కొన్ని అంశాలలో కొంతకాలం పాటు మాత్రమే సాగి ఆ తర్వాత కొనసాగ లేకపోయింది.మధ్యయుగంలోనే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ఆర్యభట్ట,బ్రహ్మగుప్త,మహావీర,వరాహమీర, భాస్కర అతి విశిష్ట ప్రజ్ఞావంతులు.ఆర్యభట్టీయం పుస్తకం భారతీయ ఖగోళ శాస్త్రానికి పునాదయ్యింది.సూర్యచంద్ర క్యాలెండర్,1724 లోనే "జంతర్ మంతర్" ఖగోళ పరిశీలన కేంద్రం వంటివి మన చరిత్రకు సాక్ష్యాలు.స్వాతంత్ర్య భారతంలో కూడా విక్రమ్ సారాభాయ్,సతీష్ ధావన్, అబ్దుల్ కలామ్,మాధవన్ నాయర్ వంటి విఖ్యాత శాస్త్రవేత్తల కృషి అమోఘం.అత్తారింట్లో వంటలకే ఆడవాళ్ళు పరిమితం అనే వివక్షతను దాటి నేడు మన అంతరిక్ష ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల పాత్ర అమోఘం, ఆదర్శ దాయకం, అభినందనీయం,అనుసరణీయం."మిస్సైల్ మహిళ" టెస్సీ థామస్,నిగర్ షాజీ,కల్పనా కాళహస్తి,నందిని హరినాథ్ వంటి మహిళా శాస్త్రవేత్తలు మనందరికీ స్ఫూర్తి.

మన దేశం యొక్క అంతరిక్ష యాత్రల విజయాలను ప్రదర్శించడానికి మరియు యువతను ప్రేరేపించడానికి మన ప్రభుత్వం తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 సందర్భంగా"చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం: భారతదేశం యొక్క అంతరిక్ష సాగా" అనే థీమ్ తో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.స్పేస్ ఆన్ వీల్స్ -సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్,ఇస్రో స్పేస్ ట్యూటర్స్, భారతీయ అంతరిక్ష హ్యాక్ థాన్, ఫిషరీస్ రంగంలో స్పేస్ టెక్నాలజీ, లెట్స్ బిల్డ్ ఎ స్పేస్ రోబోట్ వంటి అంశాలపై ఎన్నో సెమినార్లు,ప్రదర్శనలు,పోటీలు తదితర వినూత్న కార్యక్రమాలను మన ప్రభుత్వం నిర్వహిస్తుంది.ఈ సందర్భంగా యావత్ దేశం మన శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, ఇంజనీర్ల తదితరుల కృషిని అభినందించాలి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి.ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ గగనయాన్, చంద్రయాన్ -4,5 వంటి ప్రయోగాల గురించి కూడా మీడియాలో ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో మన అంతరిక్ష ప్రయోగాలన్నీ విజయవంతం కావాలని ఆశిద్దాం.ఫలితాలు ఏమైనా మన దేశం కోసం అహార్నిశలు శ్రమిస్తున్న మన శాస్త్రవేత్తలను రియల్ హీరోలు గా గౌరవిద్దాం.భారతరత్న అబ్దుల్ కలాం అన్నట్లు "ఆకాశంలోకి నక్షత్రాలను అందుకోవడం లక్ష్యం గా పెట్టుకొండి.ఆ సంకల్పం మీలో బలంగా వుంటే చాలు..! ఏదో ఓ రోజు ఆ నక్షత్రాలే మీ పాదాక్రాంతమవుతాయి" వంటి స్ఫూర్తి వచనాలతో భవిష్యత్తు యువతరం కలాం స్వప్నాలు గా, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి. 

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

M.Sc(OU Campus),AP SET,(Ph.d),B.Ed

(మోటివేషనల్ స్పీకర్, ప్రైవేటు ఫిజిక్స్ ఫ్యాకల్టీ,

కవి, రచయిత, సామాజిక కార్యకర్త, నాగర్ కర్నూల్ )

ఫోన్: 9394749536


Similar News