సామాజిక భద్రతకు వారే బాధ్యులా?

Update: 2022-05-04 18:30 GMT

సామాజిక విలువలలో అనూహ్యమైన మార్పుల కారణంగా వ్యక్తిగత ప్రవర్తనలో వింత పోకడలు ప్రవేశించాయి. అది అతిగా మారి స్వార్థం ఎక్కువైంది. దాంతో ప్రజలలో నేరతత్వం పెరిగిపోయి ధన సంపాదన, కీర్తి కాంక్షలు ప్రధానాంశాలుగా మారినాయి. అలాగే కుటుంబ విధానంలో మార్పుల కారణంగా వ్యక్తులు ఎవరికి వారు విడిపోయారు. దీంతో కూడా చట్ట వక్రీకరణ, అతిక్రమణ సాధారణ క్రియలుగా మారిపోయాయి. రవాణా సదుపాయానికి రోడ్డు మీదకు రావడం, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించడంతో ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

వ్యక్తిగత, వాహన భద్రత లోపభూయిష్టంగా పరిణమించాయి. నేరపూరితమైన ఆలోచన లేకున్ననూ రోడ్డు ప్రయాణాలలో నియమ నిబంధనల పట్ల, స్వీయభద్రత, ఇతర వ్యక్తుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణితో జరుగుచున్న నేరాలే అవన్నీ. రోడ్డు ప్రమాదాలలో ప్రపంచ దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దీంతో కుటుంబపరంగా, వృత్తిపరంగా సామాజిక జీవన పరంగా దేశ ప్రతిష్ట తీవ్రమైన కష్టనష్టాలకు గురి కావలసి వస్తున్నది. పర్యవసానంగా, ప్రజాస్వామ్య పరిపాలన విధానం సమాజానికి అవసరమైన భద్రత నందించలేకున్నది.

వారిలో అది కుంటుబడిపోయింది

దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఆర్థిక నేరాలు ఉద్దేశపూర్వకంగా జరిగేవిగానే ఎంచవలసి ఉంటుంది. వాటిలో స్వలాభాపేక్షతో జరిగేవి కొన్ని, కక్ష సాధింపు చర్యలు కొన్ని. అలా జరిగే ప్రతి నేరానికి ఒక ఉద్దేశ పూర్వక కోణం ఉంటుంది. బాధితులకు ప్రతిష్ట భంగం, ఆస్తినష్టం, ప్రాణనష్టంలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం, లేదా నష్టపోవడం జరుగుతుంటుంది. చిన్న నేరాలను మానవ తప్పిదంగా ఎంచబడిన రోజుల నుండి స్వార్థం, కక్షల కారణంగా ఆలోచనలు తీవ్రతరం కావడం మూలంగా నేరాల తీవ్రత పెరిగింది. ఇప్పటి కాలంలో దొంగతనం చేయుటలో అడ్డు తగిలిన మనుషులను హతమార్చడానికి నేరస్థులు వెనుకాడటం లేదు. వారిలాగే అవినీతి, ఆస్తుల నేరాలందు పాలకవర్గంలో బాధ్యత గలవారే పెద్ద పెద్ద స్కాములకు పాల్పడడం మూలంగా దేశ సంపదకు తీరని నష్టం జరుగుతుంది. దొరికిపోయిన వారు జైలులో బంధింపబడుతున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు బయటి వ్యక్తుల కంటే అంతర్గత అవినీతి పరుల వలన నష్టం వాటిల్లుచున్నది. తద్వారా అవినీతి భరితమైన పలు ప్రభుత్వ శాఖలు బలహీనతలు సామాజిక భద్రతకు,అభివృద్ధికి అవరోధాలుగా పరిణమించాయి. దాంతో సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయి. వ్యక్తులందు పరస్పర అవగాహన, విశ్వాస ధోరణులు క్షీణ దశ వైపు పరుగెడుతున్నాయి. ఒక జట్టుగా, సంఘటిత శక్తిగా బాధ్యతలో నిర్వహించవలసిన పనుల యందు ఆశించిన పటుత్వం కానరావడం లేదు.సేవలందించడంలో మార్గదర్శకులుగా నిలవగలరని ఎంచి పలు ఉన్నతాధికారుల హోదాలను అన్ని ప్రభుత్వ శాఖలలో సృష్టించారు ఆశ్చర్యకరమైన విషయమేమిటనగా ఆశించిన నాయకత్వ పోకడలు నీతి నీజాయితీ వాసనలు వారిలో కుంటుబడిపోయాయి. గ్రామ వ్యవస్థ అదుపు ఉంచడంలో పట్టు కోల్పోయింది. ఫలితంగా నేర ప్రవృత్తి పెరిగి హత్యలు వరకట్న దురాచార నేరాలు పెరిగిపోయాయి. పరిపాలన వ్యవస్థపై, ప్రత్యేకంగా భద్రత విషయంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందనుకోవడం సమంజసమని భావించాలి.

వారికి స్వేచ్ఛనివ్వాలి

పౌర విలువలు క్షీణించడంతో పరిశ్రమలు, విద్యాలయాలలో, వ్యాపార రంగాలలో పని చేయు విధానాలు, యాజమాన్య విధానాలలో సంకుచిత ధోరణి ఆవరించింది. ఫలితంగా అవినీతి పెరిగి ప్రమాణాత్మక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. ధరల స్థిరీకరణ లోపంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఫలితంగా దేశ స్థూల ఆదాయ వనరులను కోల్పోతున్నది. వాస్తవానికి దేశ ప్రజలు బలహీనులు కారు. వారిలో అమితమైన తెలివితేటలు శక్తి సామర్థ్యలున్నాయి. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతో తలపడగల వ్యక్తిగత విలువలు, శక్తి సామర్థ్యాలున్నాయనుట అక్షరాల సత్యం. కాకపోతే అది ఏకవర్గ, ఏక భాషా, ఏక సంస్కృతి గల దేశం కాదు. అన్ని భిన్నాలను ఏకకరించి, దేశ క్షేమం, భద్రత, అభివృద్ధియే లక్ష్యంగా ఎంచి పరిపాలించగల వ్యవస్థను నిర్మించుకోగలిగినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య పాలన ప్రపంచదేశాలకు తలమానికంగా విలువ గలదనుటలో సందేహం లేదు.

పాలకుల చిత్తంలో స్వార్థం చోటు చేసుకొని ఉన్నంత కాలం ప్రజాస్వామ్య పాలన సాధ్యాసాధ్యాల విషయం ప్రశ్నార్థ కరంగానే మిగులుతుంది. ఆ స్థితిని అధిగమించుటకు నిస్వార్ధ,నిజాయితీగల సమర్థ పోలీసు వ్యవస్థ నిర్మాణం తక్షణ అవసరం. ప్రజా పాలకులు, పోలీసు వ్యవస్థ నిర్మాణం తక్షణ అవసరం. వారికి బాధ్యతాయుత స్వేచ్ఛను పంచి, జవాబుదారీతనాన్ని పెంచినచో సామాజిక రుగ్మతలకు సరియైన చికిత్సగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఆ బాధ్యత ప్రజాస్వామ్య పాలనకు దేవుళ్ళైన ప్రజలదే!

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Tags:    

Similar News