మహిళా బిల్లుపై.. నిజాయితీ ఏది?

Are the political parties honest in the Women's Bill

Update: 2023-09-26 00:45 GMT

ప్రస్తుతం సమాజంలో మహిళా ఒక తల్లిగా, కూతురుగా, సోదరిగా, భార్యగా వీటిని అన్నిటికీ మించి ఒక పోరాట యోధురాలుగా, శక్తి యుక్తులు కలిగిన నారీమణిగా, వంటింటి నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.. అగ్గిపెట్టె తయారీ దగ్గర నుంచి, యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింట్లో ఆమె ఉనికి కనిపిస్తోంది. అలా సమాజంలో సగభాగం కలిగిన మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ కొరకు ఎన్నో ఏళ్ళుగా, ఎంతోమంది మహిళలు పోరాటాలు చేశారు. ఫలితంగా దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఆ వెంటనే భారత్ నూతన పార్లమెంటులో నారీ శక్తికి వందనం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును వెంటనే లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించడం చారిత్రాత్మక శుభ పరిణామం. ఇది మహిళల విజయంగా చెప్పాలి.

నాన్చివేత ధోరణితో..

సమాజంలో సగం భాగం అంటూనే ఆ సగభాగానికి రాజ్యాధికారం ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు. పార్లమెంట్లో రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% శాతం రిజర్వేషన్ కేటాయించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటిగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. దాదాపు 27 ఏళ్ళు పూర్తయ్యాక నేటికి గానీ ఇది చట్టం కాలేదు. ప్రతిసారీ బిల్లు పెట్టడం ఏదో నాటకీయ పరిణామాల మధ్య బిల్లు వీగిపోవడం వచ్చింది. ఈ బిల్లును అడ్డుకోవడంలో దాదాపు అన్ని పార్టీలూ ఐక్యత ప్రదర్శించాయి. అయితే మళ్లీ ఇప్పుడు మన కొత్త పార్లమెంటు కొత్త భవనంలో మొదటిగా నారీ శక్తికి వందనం పేరుతో బిల్లు పరిశీలనకు రావడం, ఆమోదించడం జరిగాక, ఇంత కాలం తర్వాత వచ్చిన ఈ బిల్లు వెంటనే అమల్లోకి వస్తుందేమోనని మహిళలు ఎదురు చూశారు. కానీ దానికి జన గణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లంకె పెట్టడంతో అది ఇప్పట్లో అయ్యే పనికాదని తేలిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాలు నిరీక్షణ తప్పదు అనే చెప్పాలి. పాలకులకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే తక్షణం అమల్లోకి తెచ్చేలా ఆలోచించి ఉండొచ్చు. కానీ జనాభా లెక్కలంటూ నాన్చివేత ధోరణికి తెరలేపారు. ఒకవైపు జనాభాలో సగం అని చెప్తూనే మళ్ళీ ఆ లెక్కలకు లింకు పెట్టడం మహిళా లోకానికి మింగుడుపడలేదు. పాలకులకు ఈ బిల్లుపై నిజాయితీ ఏ పాటిదో స్పష్టమవుతున్నది. ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే మహిళలకు 33% రిజర్వు చేయడానికి వచ్చే ఇబ్బందేమీ లేకున్నా నియోజకవర్గాల పునర్విభజనకు జోడించడం చూస్తే కాలయాపన చేయడానికే ఈ ప్రయత్నం అనుకోవాలి.

కావాలనే వాటికి లంకె..

ఇప్పటికే 2019 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు 78 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పటికి ఇప్పుడు మహిళా బిల్లు అమలులోకి తెస్తే 2024 సాధారణ ఎన్నికలో సుమారు 180 సభ్యులు ఎన్నిక అయ్యే అవకాశాలున్నాయి. కానీ కొత్త నియోజకవర్గాలు వచ్చిన తర్వాతే అనే షరతుపెట్టడమంటేనే ఇప్పుడున్న స్థానాల్లో వారికి అవకాశం కల్పించడానికి మనసు రాలేదనేది అర్థం చేసుకోవాలి. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు రాజకీయంగా పరిమితుల్లోకి నెడుతున్నాయి. మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించడం మీదనే పార్టీల దృష్టంతా ఉంటోంది. బిల్లు పేరుతో వారి ఓట్లుకు గాలం వేస్తున్నట్లు అర్థం అవుతున్నది. నిజంగా మహిళలకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయమే ఉంటే చట్టంతో సంబంధం లేకుండానే టికెట్లు ఇవ్వొచ్చు. కానీ ఏ పార్టీకీ మనసొప్పదు. అందుకే కొత్తగా పెంచే సీట్లనే వారికి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనకు ఎంతో సమయం పడుతుంది. అందుకే దానికి లంకె పెట్టారంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇక్కడి వరకు రావడానికి ఎంతో మంది మహిళలు పోరాడారు. ఇది వారి విజయంగా చెప్పుకోవాలి. మహిళలను గౌరవించడంలో మొదటి వరసలో ఉండే మన దేశంలో చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అంటే మనదేశంలో ఉన్న ప్రతి మహిళనూ సత్కరించినట్లే. ఈ బిల్లు పాలకులు చెప్పినట్లు త్వరలోనే చట్టరూపం దాల్చి మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెంది చట్టసభలలోకి వెళ్లి దేశప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను చేయాలని కోరుకుందాం.

ఎన్. సీతారామయ్య

94409 72048

Tags:    

Similar News