గ్లోబల్ సిటీకి మరో నగిషీ

గ్లోబల్ సిటీగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం నాలుగో నగరానికి నాంది పలికింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తోడుగా

Update: 2024-09-22 01:15 GMT

గ్లోబల్ సిటీగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం నాలుగో నగరానికి నాంది పలికింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తోడుగా సైబరాబాద్ ఏర్పడినప్పటికీ రోజురోజుకూ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల సంఖ్య పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందిపుచ్చుకోవాలనుకునే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఇదో మెరుగైన అవకాశంగా అభివర్ణిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ శివారులో సకల సౌకర్యాలతో నాలుగో నగరం దర్శనం ఇవ్వబోతుంది. దాదాపు 14 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుంది. 

దేశవ్యాప్తంగా 2010లో 700 వరకు ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల సంఖ్య 2023 నాటికి 1600 లకు పెరిగింది. 2028 నాటికి వీటి సంఖ్య 2,100కు చేరుకుంటుందని భావిస్తున్నారు. దేశంలోని ఆరు ఐటీ నగరాల్లో కొత్తగా ఏర్పడనున్న జీసీసీలు 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభు త్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ నాలుగో నగరానికి నాంది పలికింది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవ లను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఉప కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ విధంగా ఇప్పటికే అనేక సంస్థలు హైదరాబాద్‌లో ఉప కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. వేలాది మందికి ఉపాధి కల్పించాయి. నైపుణ్యమే అర్హతగా వార్షిక వేతనాలను కనీసం 5.7 లక్షల నుండి 21.8 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నాయి. దీంతో దేశ, విదేశీ నిపుణులకు హైదరాబాద్ పని ప్రాంతంగా విరాజిల్లుతోంది.

హైదరాబాద్ శివారులో ఫ్యూచర్ సిటీ

తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్న కార్పొరేట్ సంస్థ లను పరిగణలోకి తీసుకొని, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో మెరుగైన వేతన వ్యవస్థలతో వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఆలోచన చేశారు. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో ఫ్యూచర్ సిటీ ఆలోచన కార్యరూపం దాల్చింది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ శివారులో సకల సౌకర్యాలతో నాలుగో నగరం దర్శనం ఇవ్వబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 20 శాతానికి పైగా హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా ఐటీ సంస్థలు బెంగుళూరు తర్వాత హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

కొలువుదీరనున్న గ్లోబల్ సంస్థలు..

సైబరాబాద్ ఇప్పటికే ఐటీ కంపెనీలతో నిండిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఏర్పటవుతున్నాయి. కొత్తగా తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుండి ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్న ప్రపంచ దేశాల సంస్థలకు అవసరమైన ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని సకల సౌకర్యాలతో అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్దికి మహేశ్వరం, కందు కూరు, ఇబ్రహీంపట్నం, మండలాల్లో భూసేకరణ చేపట్టింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. దాదాపు 14 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుంది. అందులో విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం అని నాలుగు జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.

2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు..

దాదాపు 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫార్మా కంపెనీలు, వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, మరో వెయ్యి ఎకరాల్లో జపాన్ కంపెనీ పార్క్ ఏర్పాటు కానుంది. ఫ్యూచర్ సిటీలో 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడగలవని భావిస్తున్నారు. ‘ఫ్యూచర్‌ సిటీ’ న్యూయార్క్‌ను తలదన్నేలా ఉంటుందని, మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు కడతాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆయన కలలను నిజం చేసే దిశగా 13,972 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి అత్యంత కీలకం. వ్యవ సాయం, పరిశ్రమలు సమాంతరంగా వృద్ధి సాధించడం ద్వారానే రాష్ట్రం ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పేదరికం తగ్గుముఖం పడుతుంది. కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతాయి. ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారానే అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలవు అనే ముఖ్యమంత్రి ఆలోచనలు మరింత దూరదృష్టితో ముందుకు సాగాలని ఆశిద్దాం. 

కొలను వెంకటేశ్వర రెడ్డి,

ఎస్.పి, జైల్స్ ( రిటైర్డు)

80960 95555

Tags:    

Similar News