అందరూ దొరలే... దొరికితేనే దొంగలు

మనకు ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారు. అందరికీ రాజకీయ నేతలు అంటే చిన్నచూపే. చాలా మంది దృష్టిలో రాజకీయ నేతలు సమాజంలో

Update: 2024-06-27 00:45 GMT

మనకు ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారు. అందరికీ రాజకీయ నేతలు అంటే చిన్నచూపే. చాలా మంది దృష్టిలో రాజకీయ నేతలు సమాజంలో చీడపురుగులు. వారి వల్లనే, వారి అండదండలతోనే దేశంలో అవినీతి, దౌర్జన్యాలు, మాఫియాలు, మహిళలపై నేరాలు, ఇతరత్రా అక్రమాలు.. అవుతున్నాయని మనం అనుకుంటున్నాం. అయితే, ఒకసారి అంతరాత్మ తోడుగా మనలోనికి మనం తొంగి చూద్దాం. మనం చేస్తున్న పనులు ఎంత బాధ్యతాయుతమైనవో మనం నేతల కంటే ఎంత తేడానో..!

ఒక తరగతికి చెందిన ఉద్యోగులు అసలు పని చేయరు. కార్యాలయాలకు సమయానికి వెళ్లరు. అందుకే కార్యాలయాలు వేలిముద్రలు తప్పనిసరి చేసాయి, కానీ ఈ పనిదొంగ సిద్ధహస్తులు దీనిలో కూడా ఏవో లొసుగులు కనుక్కుంటారు. లేకపోతే సృష్టిస్తారు. కొందరు కార్యాలయాలకు వెళ్లినా, వారి దృష్టి కార్యాలయ పని మీద ఉండదు. చక్కగా పక్క వ్యాపారాలు (స్థలాల లావాదేవీలు, చిట్టీ కార్యకలాపాలు లాంటివి ఎన్నో ఉన్నాయి) చేసుకుంటారు. వీరిలో నిమ్న తరగతి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకూ ఉంటారు. ఉన్నత విద్యనభ్యసించి వారు కూడా ఉంటారు. ఇంత చదువు చదివి మీరే ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తే, నేతలు మాత్రమే నీచులయినట్టు నిందించే నైతిక హక్కు వీరికి ఎక్కడిది

విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ..

ఉదాహరణకు మన విద్యా వ్యవస్థను పరిశీలిద్దాం. ఈ లోపం విద్యా వ్యవస్థకు మాత్రమే ప్రత్యేకం కాదు, అన్నింట్లో ఉన్నదే, కేవలం ఉదాహరణకు మాత్రమే దీన్ని తీసుకుంటున్నాం. పదేళ్ల క్రితం యూట్యూబ్ లో 'ది వైవా బై శబరీష్ కంద్రేగుల' అని ఒక వీడియో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇంచుమించు 2.4 కోట్ల వీక్షణలు సాధించింది. చాలా మంది దీన్ని హాస్యభరితంగా తీసుకుంటారు కానీ, ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.

నేను ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసరుగా ప్రవేశించినప్పుడు చాలా అవకతవకలు చూసాను. పాఠ్యాంశాల నిర్మాణమే సరిగా జరగదు. పాఠ్యాంశాలు వర్తమాన సాంకేతికతకు తగ్గట్టు ఉండవు. అది అందరికీ తెలిసినదే. ఉన్న పాఠ్యాంశాల్లో కూడా తప్పులు ఉంటాయి. అచ్చు పుస్తకాలు, సంబంధిత పుస్తకాల జాబితాలో ప్రామాణిక పుస్తకాలు పెట్టినా, ఆ పుస్తకాలు వాడరు. ఏ స్థానిక రచయితదో తప్పుల తడకల పుస్తకం వాడతారు. యువ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తారు.

ప్రయోగశాలలో ప్రయోగాలు సరిగా జరగవు. ఉద్దేశించిన ఫలితాలు రావు, రాక పోయినా సరే, ప్రయోగం జరిగినట్లు, ఫలితాలు అనుకున్నట్టు వచ్చినట్టు అన్పించేస్తారు. పరీక్షలలో మూల్యాంకనం సరిగా చేయరు. ఒక విశ్వవిద్యాలయంలో మూల్యాంకన కేంద్రానికి పరీక్షకులు ఆలస్యంగా వచ్చి, తొందర తొందరగా మూల్యాంకనం చేసి వెళ్లిపోతున్నారని, ప్రతి జవాబుపత్రానికి కనీసం నాలుగు నిమిషాలు మూల్యాంకనం కోసం గడపాలని నిబంధన పెట్టారు. ఒకవేళ అంతకంటే ముందే చేసేస్తే, దానికి కారణం చెప్పాలి. చాలామంది ఏదో ఒక కారణం చెప్పి ముందే ముగించేవారు. విశ్వవిద్యాలయం వారు ఇది గమనించి, ఈ నాలుగు నిమిషాల నిబంధనను తప్పనిసరి చేశారు.

మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది?

పరీక్షకులు ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే నాలుగు నిమిషాలకి ముందే మూల్యాంకనం చేసేసి, పక్కవారితో మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. కళాశాలలో జరిగే వర్కుషాపులు, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు అన్నీ నామమాత్రమే. చెప్పేది ఒకటి, చేసేది జరిగేది ఒకటి. విద్యార్థులు, యువత, దేశం ఏమైపోయినా ఫరవాలేదు. తమ ఉద్యోగం భద్రంగా ఉంటే చాలు. వీరు ఇంత ఉద్యోగాలు, జీతాల కొరకే అక్రమాలతో ఇంత రాజీపడి పని చేస్తే, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ప్రాణాలకు తెగించి, ఎండనక, వాననక తిరిగి, ఎన్నికల్లో గెలిచి, నేతలు అక్రమాలకు పాల్పడితే వారిని నిందించి, చెండాడే నైతిక హక్కు సామాన్య జనానికి ఎక్కడిది

ప్రొ. సీతారామ రాజు సనపల,

రక్షణ శాఖ పూర్వ శాస్త్రజ్ఞులు.

72595 20872

Tags:    

Similar News