అప్పటికీ, ఇప్పటికీ ఏం మారినట్లు?
దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ సరిగ్గా ఒక్కరోజు ముందు నడిరేయిన కలకత్తా ఆర్.జి కర్ మెడికల్
దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ సరిగ్గా ఒక్కరోజు ముందు నడిరేయిన కలకత్తా ఆర్.జి కర్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్‌లో ద్వితీయ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ పల్మనాలజీ విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న 31 ఏండ్ల వైద్య విద్యార్థినిపై దారుణమైన లైంగిక దాడి చేసి హత్య చేశారు. అత్యంత అమానవీయమైన ఈ హత్యాచారాన్ని నిరసిస్తూ, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని, గంటల తరబడి డ్యూటీ చేస్తున్న మహిళా డాక్టర్లకు కనీస విశ్రాంతి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు కావాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు, ప్రజలు నిరసన కార్యక్రమాలు చేశారు.
కోల్‌కతాలో అర్థరాత్రి మహిళలు రోడ్డెక్కిన తీరు 1970లో మహిళలపై లైంగిక వేధింపులు, లింగ వివక్షతకు నిరసనగా లింగ సమానత్వం కోసం సాగిన మహిళా ఉద్యమాలను గుర్తు చేశాయి. 12 సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యంతో దేశ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయంకై దేశం నలుమూలలా సాగిన ఆందోళనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కలకత్తాలోని జాదవ్ పుర వీధుల్లో ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న ఓ స్త్రీవాది తన టీ- షర్ట్‌పై అప్పటి నుండి ఇప్పటికీ ఏం మారింది? అని ఆంగ్ల భాషలో రాసి ఉన్న అక్షరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. వాస్తవానికి ఢిల్లీ నిర్భయ ఘటన నుండి నేటి కలకత్తా ఘటన వరకు మహిళల సంరక్షణలో ప్రభుత్వాలు ఏం ప్రగతిని సాధించాయి? అందరిలో తలెత్తే సాధారణ ప్రశ్న ఏంటంటే అసలు ఈ దేశంలో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, వారి పట్ల కనీస పట్టింపు ఎక్కడుందీ?
విశ్రాంతి గదులు లేవు..
ఆగస్టు 9న విరామం లేకుండా సుమారుగా 36 గంటల పాటు డ్యూటీ చేసిన వైద్య విద్యార్థిని, రాత్రి 2 గంటల ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు సెమినార్ హాల్‌కి వెళ్లింది. గంటల తరబడి పనిచేసే అనేక విభాగాల డాక్టర్లకు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ రూములు లేవని పలువురు డాక్టర్లు ఆయా సందర్భాలలో వెల్లడించారు. దీని కారణంగా విశ్రాంతి కోసం పేషంట్ బెడ్‌పై లేదా వెయిటింగ్ హాల్స్‌లలో లేదా ఖాళీ గదుల్లో పడుకోవడం తప్ప జూనియర్ డాక్టర్లకు వేరే మార్గం లేదు. ఆ రాత్రి చనిపోయిన వైద్య విద్యార్థిని తమ కుటుంబీకులతో ఎప్పటిలాగానే ఆ రోజూ మాట్లాడింది. కానీ ఒక్క రోజులోనే తన కలల సౌధం కుప్పకూలింది. తల్లిదండ్రులు తన భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.
రేపు నేనే అయ్యుండొచ్చు?
ఆగస్టు 9 నుండి వైద్య విద్య శిక్షణ పొందుతున్న ప్రతీ డాక్టర్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ, ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ తమ సేవలను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చిప్పటికీ వైద్యులు తమ సేవలకు ముందుకు రాలేదు. బెంగాల్ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మంది రోగులు రోజువారీగా ఓపీ తీసుకుంటారు, 12 వేల మందికి పైగా అడ్మిట్ అవుతుంటారు. రాధా గోవిందా కార్ ఆసుపత్రిలో 1600 బెడ్స్ ఉన్నాయి. రోజూ 3600 మంది రోగులు ఓపీ తీసుకుంటుంటారు, 245 మంది రోజూ అడ్మిట్ అవుతుంటారు. వైద్య సేవల అంతరాయం ఏర్పడిన అసౌకర్యంతో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణ ప్రజలూ నిరసన తెలుపుతున్న డాక్టర్లతో చేతులు కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలపై గొంతెత్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17 నుండి 18 వరకు సమ్మెకు పిలుపు నిచ్చింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా, సాధారణ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నేడు ట్రైనీ డాక్టర్ రేపు నేనే అయ్యుండొచ్చు అంటూ జూనియర్ డాక్టర్లందరూ రోడ్డెక్కారు. తాము ఎంతో కష్టపడి అత్యంత కష్టతరమైన నీట్ పరీక్ష పాసై అడ్మిషన్ సాధిస్తే మేం పనిచేసే చోట ఇటువంటి పరిస్థితితులుంటాయని ఊహించలేదంటూ, తమకు రోగులకు సేవ చేయాలనే ఆలోచనలోనే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అదే ఆసుపత్రిలో 30 గంటలకు పైగా డ్యూటీ చేసిన మరో మహిళా డాక్టర్ రేపు నేనే అయ్యుండొచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడపిల్లలకు రక్షణ ఏదీ?
దేశంలో ఇటువంటి ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాలు ఘటన జరిగిన 4 రోజుల పాటూ, పలు మహిళా సంరక్షణ చర్యలు చేపడతామని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పిస్తామనీ, లింగ సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఊదరగొడుతున్నారు. దోషుల ను గుర్తించడంలో, వారిపై చర్యలకు ఆదేశించడంలో, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకులే నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్నప్పుడు ఇంకా బాధితులకు న్యాయం ఎలా దక్కుతుంది? మహిళలకు రక్షణ కల్పించాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను ఆపాలని, సురక్షిత పని ప్రదేశాలను కల్పించాలని ఇంకెంతకాలం రోడ్డెక్కాలి? ఢిల్లీ కలకత్తా అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేసాయి. ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. మనం మారితేనే సమాజం మారుతుంది మన స్పృహ అందరిలోనూ రావాలి.
బుర్ర వీరభద్రం,
ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర సహాయ కార్యదర్శి
94929 30835