ఆరె కులస్తులను ఆదుకోరా?

ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులాలలో మరింత వెనుకబడిన కులం ఆరె కులం.

Update: 2024-07-08 23:08 GMT

ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులాలలో మరింత వెనుకబడిన కులం ఆరె కులం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పది లక్షలకు పైచిలుకుగా వున్న ఆరె కులస్తులను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. స్వాతంత్రం సిద్ధించి 76 ఏళ్లు కావస్తున్నా ఆరె కులస్తులకు శాసనసభ, శాసనమండలి, పార్లమెంట్‌లలో ఇప్పటివరకు అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల వరకు ఓటర్లు ఉన్నటువంటి తమను గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం ఆరె కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆరె కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరె కులస్తులు ఉన్నప్పటికీ ఎక్కువగా 23 జిల్లాల్లో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసేటువంటి శాసనసభ్యుల గెలుపు, ఓటములను శాసించే దిశగా కూడా ఆరె కులస్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

వచ్చిన వారు ఆరెలు

ఆరె అంటే ఉర్దూ భాషలో వచ్చినవారు అని అర్థం. అవిభాజ్య హైదరాబాద్ రాజ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతంతో పాటు, కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన బీదర్, రాయచూర్, బీజాపూర్, యాద్గిర్ వంటి ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. అప్పట్లో నిజాం తన పాలనపరమైన అవసరాలకు మరాఠీ సామాజిక వర్గానికి చెందిన వారిని పాటిల్స్‌గా, పట్వారీలుగా, పోలీస్ పటేల్స్‌గా నియమించుకునేవారు. చాలామంది ఆరె కులస్తులను ఆరె పటేల్ అని సంబోధించేవారు. ఆరె కులస్తులు వారి కుటుంబాలను పోషించుకోవడానికి ప్రధానంగా వ్యవసాయం చేసుకునf జీవనం సాగిస్తారు. వీరు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నివసిస్తున్నారు.

ఎప్పటికీ కార్యకర్తలుగానే...

ఆరె కులస్తులను రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలు గానే చూస్తున్నాయి తప్ప, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం లేదు. ఆరె కులస్తులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆ పై స్థాయిలలో పదవులు పొందలేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల వరకు ఓటర్లు ఉన్నటువంటి ఆరె కులస్తులను గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం ఆరె కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆరె కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఆరె కులస్తులు ఎక్కువగా 23 జిల్లాల్లో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసేటువంటి శాసనసభ్యుల గెలుపు, ఓటములను శాసించే దిశగా కూడా ఆరె కులస్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ప్రత్యేక కార్పొరేషన్ అవశ్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. చాకలి,మంగలి వారికి ఉచిత విద్యుత్తు,గౌడ కులస్తులకు పింఛన్లు,చెట్టుపై నుండి పడిపోతే పరిహారం, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా, రైతు బీమా మొదలైన అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇలా తరతరాలుగా వ్యవసాయం పైనే ఆధారపడుతూ, వ్యవసాయం చేస్తూ, ఇంట్లో పిల్లలను చదివించి ప్రయోజకుల్ని చేస్తున్నారు.

ఆరె కులంలోని విద్యార్థులంతా ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరె కులస్తులకు బి సి-డి సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ, కేంద్రంలో ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చనందున ఇప్పుడిప్పుడే చదువుతున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమను ఓబీసీ జాబితాలో త్వరగా చేర్చేందుకు కృషి చేయాలని వీరు కోరుతున్నారు.

ఓబీసీ సర్టిఫికెట్ కోసం ఆరె కుల సంక్షేమ సంఘం నాయకులు గత పదేళ్ల నుండి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలా వ్యవసాయంతో గిట్టుబాటు ధర లేకున్నా, వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆరె కులస్తులను, చదువుతున్నటువంటి యువతను ప్రభుత్వం ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆరె కులస్తుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలి.

- మోటె చిరంజీవి,

రాష్ట్ర అధ్యక్షులు,

ఆరెకుల విద్యావంతుల వేదిక.

99491 94327


Similar News