ఆప్యాయతల రక్షా బంధనం

సోదరి ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఉన్న సంప్రదాయం. ప్రపంచాన్ని జయించాలనే ఆశతో

Update: 2022-08-11 18:45 GMT

సోదరి ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఉన్న సంప్రదాయం. ప్రపంచాన్ని జయించాలనే ఆశతో క్రీ.పూ 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. ఈ క్రమంలో అలెగ్జాండర్ అఫ్ఘానిస్తాన్‌కు చెందిన యువరాణి రోక్సానాను వివాహమాడి ఆసియా దేశాల మధ్య రాజ్యాలను జయించడానికి వస్తాడు. తక్షశిల రాజు పురుషోత్తముడి శత్రువు అంబి. అతడు అలెగ్జాండర్‌ను దేశంలోకి ఆహ్వానిస్తాడు.

యుద్ధ సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపొద్దని భర్తను కోరుతుంది. ఫలితంగా అలెగ్జాండర్ యుద్ధ విరమణ చేస్తాడు. మొఘల్ చక్రవర్తి హుమయూన్ చిత్తోర్‌గఢ్‌ను ఆక్రమించిన సమయంలో రాణా సతీమణి కర్మవతి హుమయూన్‌కు రక్షను పంపుతుంది. ఇలా పూర్వకాలం నుండి భార్య ప్రేమకు, అనురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షా బంధనానికి ప్రత్యేకత ఉంది. హిందువులలో అన్ని తరగతుల వారు వర్షాకాలపు రాకకు సంతసిస్తూ, మధుర పదార్థాలు భుజించడం ఆనవాయితీ. ఈ రోజునే వేద విద్య ప్రారంభించడం జరిగేది.

ప్రాశస్త్యం

ఉపాకర్మ పండుగ కాక అధ్యయనానికి సంబంధించిన కర్మ. ఉప నయనం అనగా అదనపు కన్ను. గురువు తన ప్రజ్ఞా ప్రాభవముల చేత వటువునకు జ్ఞాన నేత్రమును తెరిపించడమన్నది పరమార్థం. యజ్ఞం, ఉపవీతంతో కలిస్తే యజ్నోపవీతం. ఉపవీతమంటే దారము. యాగకర్మ చేత పునీతమైన మూడు పోచల దారం. సృష్టి స్థితి, లయ కారులైన త్రిమూర్తులను సూచించేవి ఒక్కో ముడిలోని మూడు తాళ్లు. సర్వ రోగ ఉపశమనం, సర్వ అశుభ వినాశనం కోసం ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఉపాయం అడుగగా రక్షాబంధన విధి ఉపదేశించాడని చెబుతారు.

రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా ఆచరణలో సోదరియో, కూతురో కట్టే ఆచారాన్ని ప్రతోత్సవ చంద్రిక వివరిస్తుంది. శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ. రాఖీ అంటే తోరము. తోరం పట్టుదారముతో లేదా నూలు దారంతో చేయబడుతుంది. రాఖీ అనేది ఒక ఆభరణం లాంటిది. రంగు దారంతో లేదా కాగితంతో చేసి, దానికి తోరం జోడించి, దానిని సోదరి సోదరుని ముంజేతికి కట్టడం సంప్రదాయం. బొట్టు పెట్టి హారతి నివ్వడం, సోదరుడు, సోదరికి కట్న కానుకలు సమర్పించడం ఆహారం. రాఖీ ప్రాధాన్యత వలననే ఒక మహిళ పురుషులకు రాఖీ పంపి లేదా కట్టి రక్ష కోరే ఆచారం ఏర్పడింది. దానిని అందుకోవడంతోనే అతడు ఆమెకు సోదరుడై రక్షకుడవుతాడని భావన.

రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

Tags:    

Similar News