రాజులు, చక్రవర్తులు గతించారు.
రాజ దండం మాత్రం మిగిలి ఉంది!
మనువు మళ్ళీ నిద్ర లేచాడు!
అగ్నిగుండాల్లో నేతి డబ్బాలు
దొర్లిస్తున్నారు.
ఉత్పత్తి పరికరాల వంతెన కూల్చి
నిప్పు కణికలు పేరుస్తున్నారు.
అక్బర్, షాజహాన్‌లు
భారతదేశంలోనే పుట్టారు.
పూలే, అంబేద్కర్‌లూ
భారతదేశంలోనే పుట్టారు.
ఈ నేలలో నీటి బుగ్గ పుట్టింది.
ఈ భూమికి అగ్నికణం వలస వచ్చింది.
నెయ్యి పుట్టుక తెలియనివాడు
నేతిని నిరంతరం ఆరగిస్తున్నాడు!
ఆ పాలు పిండే దళితుడికి
మజ్జిగ చుక్క కరువైంది.
వల చేపను బంధించింది.
వలను చేసినవాడు
సాంకేతిక నిపుణుడు.
ఉత్తుత్తి మంత్రాలు
చదివే వాడికి అందలాలు!
గొడ్డలి, కొడవలి చేసిన వాడు
నూత్న సమాజ సృష్టికర్త.
వాడిని నిర్లక్ష్యం చేసినప్పుడంతా
సింహాసనం కూలిపోయింది.
ఆ పార్లమెంటు పైన
ఒక డప్పును వేలాడ తీయండి.
ఒక కొమ్ము బూరతో
దళిత స్వరం వినిపించండి.
ఆ గోండీ కళాకారులతో
గుండె డప్పులు మోగించండి.
అప్పుడు ఆ నిర్మాణం
శతాబ్దాలు వర్ధిల్లుతుంది.
భూమిని తవ్వి
ఆ రెడ్ స్టోన్‌ను తీసినవాడు,
చెట్టు కొట్టి చందనాన్ని గుర్తించినవాడు,
నాగుబామును మునివేలితో ఆడించిన వాడు,
గంగా, యమునలను
అలవోకగా ఈదినవాడు
పార్లమెంటుకు నిజమైన
వారసుడు కాదా!
మొదట భారతీయ చక్రవర్తి
బెస్త రాజేగా!
ఆయన కుమార్తేగా సత్యవతి.
ఆమె బిడ్డేగా వ్యాసుడు.
ఎవరి శ్రమోత్పత్తితో
మీ సంపన్నత ఆధారపడి ఉందో..
ఆ స్త్రీలు మునివేళ్ళతో
కోసిన తే ఆకులతోనేగా
మీ భవనంలో విందులు జరుగుతుంది.
వాటిని మరుస్తున్నారా!
పార్లమెంటు భవన్
ఏ రాష్ట్రపతి అధీనంలో ఉండాలో
ఆ గిరిజన రాణిని నిర్లక్ష్యం చేయడం
రాజనీతికి ద్రోహం కదా!
ఆ బ్రాహ్మణులు ఉచ్చరించే
మంత్ర ధ్వనులు మీకు అర్థం కావు.
అర్థరహిత ధ్వనుల మధ్య
అసంకల్పిత చర్యలు!
మళ్లీ బ్రాహ్మణాధీనం లోకి భారతం!
ఎందరో వచ్చారు ఎందరో పోయారు
ఆ పడవ మీద వెళ్లే జాలరి ఈలపాటకు
సూర్యుడు వంగి నమస్కరిస్తున్నాడు.
చంద్రుడు సాయంత్రాలు
లాంతరు వెలిగిస్తున్నాడు.
ఆ యానాది తీసిన తేనె కోసం
ఔషధం ఎదురుచూస్తుంది.
ఎప్పటికీ మూలికలు - ఏలికలు
నేల బిడ్డలేగా!
వారికి నదీమతల్లి
అలల చప్పుళ్లే జీవన మంత్రాలు.
జీవితం.... ఆ వేప చెట్టు రాలుస్తున్న
తెల్ల పూల పాన్పుపై పండిన దళితులదే!
కాశ్మీరంలో కాస్తున్న
యాపిల్ సౌందర్యం
దేశానికి చెరగని గుర్తు.
ఆ జలపాతాల సవ్వడిలో
నృత్యం చేస్తున్న
నెమలి కాళ్ళ చప్పుళ్ళు
దేశం ఎల్లలు దాటాయి.
ఆ అశోకుని ధర్మ చక్రం
ప్రపంచ అవనిక మీద
వెలుగుతున్న తార.
ఆ అంబేద్కర్ చూపుడు వేలు
భారతదేశ ఆత్మగౌరవానికి
చెరగని చారిత్రక గుర్తు.
ఆ పార్లమెంటును ప్రశ్నిస్తున్న
అంబేద్కర్ చూపుడువేలు.
చరిత్ర చెరిగిపోయే
చాక్ పీస్ రాత కాదు.
అది ఆకాశ నక్షత్రాలతో
చేయబడిన శాసనం.
బంగారం, వెండి, కంచు
అన్నింటికీ ముందటిది ఇనుమే!
ఇనుమును కరిగించి
గొడ్డలి చేసిన వాడే జ్ఞాని.
తగలబడేది జ్ఞానం కాదు. సృష్టించేదే జ్ఞానం.
ఎప్పటికీ మూలవాసులదే గెలుపు.
డా. కత్తి పద్మారావు
93815 22247