శతవసంతాల ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’
A birth centenary tribute to Mrinal Sen
భారతీయ నవ్య సినిమా ప్రపంచానికి ఆధునికతను, ప్రగతిశీల భావనలను, సామాజిక వ్యాఖ్యానాన్ని జోడించి ఆవిష్కరించిన సినీ వైతాళికుడు మృణాల్ సేన్. తన సినీ జీవితం మొదటి రోజుల్లో ఆయన సామాజిక వాస్తవవాద దృక్పథం తోనూ, అనంతర కాలంలో అంతర్ముఖీనుడై తనదైన ఆధునిక సినిమా భాష్యంతో సినిమాలు తీసి లెజెండరీ ఫిలిం మేకర్‌గా నిలిచాడు. తన సినిమాల్లో సెల్యులాయిడ్ పైన తన తాత్వికతను ఆవిష్కరించిన వారు సేన్. కలకత్తా నగరం భారతీయ సినిమా రంగానికి అందించిన ముగ్గురు ఫిలిం మేకర్స్ గురించి ఆలోచన రాగానే ట్రయాలజీ లాగా రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే మృణాల్ సేన్ స్పురణకు వస్తారు. అయితే ముగ్గురూ తమ తమ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాలు తీసి తమదైన చిరస్మరణీయమైన ‘సంతకాన్ని’ చెరపలేని సిగ్నేచర్‌ని లిఖించి పోయారు.
నెహ్రూ మెచ్చిన సినిమా..
ఈ మే 14 మృణాల్ సేన్ నూరవ జయంతి. ఇప్పుడు మన మధ్య లేకున్నా తన సృజనాత్మక జీవితంతో మన మధ్యే వున్న ‘నూరేళ్ళ యువకుడు’ ఆయన. మృణాల్ సేన్ Sir Charles Chaplin, Sergei Eisenstein, Vittorio De Sica, Jean Luc Godard లాంటి దర్శకుల సినిమాలతో ప్రభావితుడైన వాడు. అంతే కాదు Akira Kurosawa సినిమాల్ని కూడా అమితంగా అభిమానించేవారు.
‘కొత్త భావనలు, కొత్త ఆలోచనలు కలిగించడానికి, వాటిని అభివృద్ధి పరిచి వాటి ద్వారా కళాత్మక ఆనందం పంచడానికి సినిమా కృషి చేయాలి. అంతే తప్ప కేవలం సాంకేతిక మాయాజాలంతో మ్యాజిక్కులు సృష్టించడం సినిమా పని కాదు’ అని విశ్వసించిన వాడు ఆయన. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో మృణాల్ సేన్ 30కి పైగా సినిమాలు రూపొందించాడు. తన తొలి నాళ్ళల్లో ఆయన తీసిన ఇంటర్వ్యూ, కలకత్తా 71, పదాతిక్ సినిమాల ట్రైయాలజీతో ఆయన ప్రగతిశీల రాజకీయ భావాలు కలిగిన దర్శకుడిగా నిలబడ్డాడు. వామపక్ష భావాల్ని అభిమానించిన మృణాల్ సేన్‌కి కలకత్తా యే చిరునామా. అక్కడి వీధుల్ని, మనుషుల్ని, వారి తత్వాల్నీ పరిశీలించడమే కాదు వారిలో మమేకమై దృశ్యాల్ని చిత్రబద్ధం చేశారు. మృణాల్ దా అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మృణాల్ సేన్ సహచరి గీతా సేన్ గొప్ప నటి.
మృణాల్ సేన్ 1923 మే 14 న తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లోని ఫరీద్పూర్‌లో జన్మించాడు. తన ఇంటర్ విద్య పూర్తి చేసుకుని కలకత్తా చేరుకున్నాడు. మృణాల్ సేన్ తన యవ్వన దశలోనే స్పానిష్ సివిల్ వార్, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలతో అమితంగా ప్రభావితుడయ్యాడు. సేన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కార్యకర్తగా పనిచేసాడు. తన కార్యరంగాన్ని పూర్తిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్‌తో పెనవేసుకున్నాడు. అక్కడే పరిచయమైన గీతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీ చదువు పూర్తయ్యాక సేన్ ఆర్ధిక స్థితి దయనీయంగా ఉండేది. రోజూ తన సమయాన్ని అధిక శాతం ఇంపీరియల్ లైబ్రరీలో గడుపుతూ సినిమాకు సంబంధించిన అనేక పుస్తకాలు చదవడంతో పాటు చార్లీ చాప్లిన్ పైన ఒక పుస్తకం కూడా రాశాడు. 1947 రే, చిదాదాండ్ దాస్ గుప్తా, నిమాయ్ ఘోష్‌లతో కలిసి కలకత్తా ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి దాని వెలుగులో అనేక గొప్ప సినిమాల్ని చూశాడు. ప్రపంచ సినిమాతో పరిచయం అవగాహన ఫిల్మ్ సొసైటీ తోనే కలిగింది. పారడైస్ కేఫ్‌లో ఘటక్ రే తదితరులతో పాటు సినిమా చర్చల్లో పాల్గొనే వాడు. 1952లో దేశంలో మొట్టమొదటి సారి జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రోషమాన్, ఓపెన్ సిటీ, బైసికిల్ తీఫ్ లాంటి సినిమాలు చూసి తన దృక్పధానికి పదును పెట్టుకున్నాడు మృణాల్ సేన్. 1956 తన మొదటి సినిమా ‘రాత్ భూరు’ రూపొందించాడు. తన మొదటి ప్రయత్నాన్ని విఫల ప్రయత్నంగానే భావించినప్పటికీ తర్వాత సేన్ ‘నీల్ ఆకాశార్ నీచే’ రూపొందించాడు. చైనా యువకుడికి, బెంగాల్ యువతికి నడుమ జరిగిన ప్రేమ అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించాడు. ప్రధాని నెహ్రూ ఆ సినిమాను గొప్ప సినిమాగా అభినందించాడు. తర్వాతి కాలంలో చైనా యుద్ధ సమయంలో ఆ సినిమాను నిషేధించారు.
నాటి పరిస్థితులను ఆవిష్కరించి..
‘బైసే శ్రావణ్’ మృణాల్ సేన్ తీసిన మూడవ సినిమా. వెనిస్, లండన్ తదితర ఫెస్టివల్స్‌లో ప్రశంసల్ని అందుకుంది. ఆ తర్వాతి కాలంలో ఫ్రెంచ్ మాస్టర్స్ ప్రభావంతో మృణాల్ సేన్ సినిమా నిర్మాణ సరళిలో పెద్ద మార్పు వచ్చింది. వివరణాత్మక ధోరణి నుండి వైదొలిగి తనదైన క్లాసిక్ ధోరణికి మారిపోయాడు. తర్వాత ఉన్నత వర్గాల పైన పేరడీగా సేన్ 1965 లో ‘ఆకాష్ కుసుం’ సినిమా నిర్మించాడు. తర్వాత ఒడియా భాషలో సేన్ ‘ మథిర మనిషి’ సినిమా తీసాడు.
1969 లో మృణాల్ సేన్ ‘ భువన శోం’ రూపొందించాడు. అది మృణాల్ సిగ్నేచర్ ఫిలింగా మిగిలిపోయింది. ఉత్పల్ దత్, సుహాసిని మూలే లు ప్రధాన పాత్రల్ని ధరించిన ఈ సినిమా ప్రముఖ రచయిత బలాయి చంద్ ముఖోపాధ్యాయ్ రాసిన చిన్న కథ ఆధారంగా నిర్మించబడింది. గ్రామీణ నగరాల నడుమ ఉండే అంతరాల్ని, మోనో టానీ, ఒంటరితనం తదితర అనేక అంశాల్ని ఆవిష్కరించిన హిందీ సినిమా అది. భారతీయ నవ్య సినిమా చరిత్రలో భువన శోం ది గొప్ప స్థానం. అందులో సేన్ వ్యంగ్యాన్ని ప్రధానంగా వాడుకుని సమాజం లోని డొల్లతనాన్ని చూపించాడు. ఈ సినిమా సెన్ సినిమాల్లోకెల్లా ఆర్థికంగా గొప్ప విజయవంతమైన సినిమా. అంతే కాదు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా వుంది ‘సాత్ హిందూస్థానీ’తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించకముందే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. కేవలం 300 రూపాయల పారితోషకంతో ఈ సినిమాకు అమితాబ్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిప్పుడు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.
ఆ తర్వాత మృణాల్ సేన్ తన రాజకీయ విశ్వాసాల బహిరంగ ప్రకరణలుగా చెప్పుకొనే కలకత్తా ట్రిలోజీ సినిమాలు వచ్చాయి. అప్పటి కలకత్తా నగరంలో పెల్లుబికిన రాజకీయ అంతర్మధన స్థితులు, ఉడికిపోతున్న సామాజిక స్థితిగతుల్ని ఈ మూడు సినిమాలు గొప్పగా ప్రతిభావంతంగా చూపించాయి. మొదట 1970లో ‘ ఇంటర్వ్యూ’ వచ్చింది. 72లో ‘కలకత్తా 71', 73లో ‘పదాతిక్' లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఎగిసిన నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందాయి. అత్యంత విశ్లేషణాత్మకంగా నిర్మాణమైన ఈ సినిమాలు ఆనాటి పరిస్థితులను గొప్పగా ఆవిష్కరించాయి.
లివింగ్ లెజెండ్..మృణాల్
తర్వాత సేన్ 74 లో ‘కోరస్’ సినిమా తీసాడు. అది జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా అవార్డును గెలుచుకుంది. 1976 లో మృణాల్ సేన్ తీసిన ‘ మృగయా’ 1930 ల నాటి స్థితిగతుల పైన తీసిన సినిమా. అడవిలో మనుషుల్ని చంపుతూ వున్న మృగాలను చంపితే ఓ యువకునికి బహుమతిచ్చిన వారే, మనుషుల్ని పీక్కుతింటున్న మానవ మృగాన్ని చంపితే ఉరిశిక్ష వేస్తారెందుకని ప్రశ్నిస్తాడు సేన్. కె. రాజేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఒడియా రచయిత భగవతీ చరణ్ పాణిగ్రాహి రచించిన నవల మూలం. ఈ సినిమా చూసిన తర్వాత నేను అత్యంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది సరిగ్గా ప్రముఖ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారి ‘యజ్ఞం’ కథను గుర్తుకు తెస్తుంది. మిథున్ చక్రవర్తి మొట్టమొదటిసారిగా నటించిన ఈ సిన్మాకుగాను ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.
ఇక తెలుగులో మృణాల్ సేన్ ‘ ఒక ఊరి కథ’ తీసాడు. మున్షి ప్రేమ్ చంద్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తిక్కవరపు పట్టాభి రామ్ రెడ్డి నిర్మాత. తర్వాత సేన్ ‘ఏక్ దిన్ ప్రతిదిన్’, ‘అకాలేర్ సంధానే’, ‘చల చిత్ర’, ‘ఖరీజ్’, ‘ఖండహార్’ తదితర సినిమాల్ని తీసాడు. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో ఆయన తీసిన ‘జెనెసిస్’ రాజస్థాన్ ఎడారుల్లో నిర్మితమై వినూత్న సినిమాగా పేరొందింది. ఇక బెర్లిన్ గోడ పగలగొట్టడం, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిజం విఫలం చెందడం తదితర నేపధ్యాలతో సేన్ తీసిన సినిమా ‘మహా పృథ్వీ’. కలకత్తాలోని ఒక మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలోంచి అంతర్జాతీయ రాజకీయాల్ని సేన్ చర్చిస్తాడు. తర్వాత తన 76 ఏళ్ల వయసులో సేన్ ‘అంతరీన్’ సినిమా తీసాడు. తన మొత్తం సినిమా కెరీర్ లో 27 ఫీచర్ ఫిలిమ్స్, 13 ఎపిసోడ్స్ టివి సీరియల్ తీసిన మృణాల్ సేన్ ప్రపంచవ్యాప్తంగా సినిమాకు సంబంధించి భారతీయ ప్రగతి శీల సంతకం. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ఆయన సినిమాలు ప్రదర్శితమై అవార్డులు అందుకున్నాయి. దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఫిలిం సొసైటీ ఉద్యమంలో కూడా ఆయన కృషి గొప్పది.
ఈ సంవత్సరం మృణాల్ సేన్ శతజయంతి సంవత్సరం. ప్రపంచంలోని మంచి సినిమా అభిమానులంతా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. భారతీయ సినిమాకు సంబంధించి ఓ లివింగ్ లెజెండ్ అయిన మృణాల్ ఆయన సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
(మే 14 నుంచి మృణాల్ సేన్ శతజయంతి ఉత్సవాలు)
-వారాల ఆనంద్
94405 01281