24 ఫ్రేమ్స్: జాతిని తట్టి లేపిన సినిమా
ఇక ప్రధాన స్రవంతి చలన చిత్రపరిశ్రమ కూడా స్వాతంత్ర్యోద్యమాన్నీ, దాని తర్వాతి పరిణామాలనూ పలు సినిమాలుగా రూపొందించింది.
'ఇక ప్రధాన స్రవంతి చలన చిత్రపరిశ్రమ కూడా స్వాతంత్ర్యోద్యమాన్నీ, దాని తర్వాతి పరిణామాలనూ పలు సినిమాలుగా రూపొందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మనం చూడదగిన సినిమాల గురించి ఇవ్వాళ మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుగేతర సినిమాలే. తెలుగు సినిమాల గురించి మన తెలుగువాళ్లందరికీ తెలుసు కనుక నేను వివిధ భారతీయ భాషలలో వచ్చిన స్వాతంత్ర్య భారత నేపథ్యం ఉన్న కొన్ని సినిమాలను ప్రస్తావిస్తున్నాను.'
వ్యక్తికైనా, దేశానికైనా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు శ్వాసతో సమానం. అవి ఉచ్వాస నిశ్వాసాలు. అవి కొరవడిన నాడు ప్రాణం వుండీ లేనట్టే. అయితే, స్వేచ్ఛా స్వాతంత్రాలు వూరికే రావు. ఎంతో పోరాటం చేయాల్సి వుంటుంది. ఎన్నో త్యాగాలకు సిద్ధం కావాల్సి వుంటుంది. ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోవాల్సి వుంటుంది. ఏది పోగొట్టుకున్నా స్వేచ్చా స్వాతంత్రాలు మనషితో పాటు దేశ మనుగడకు అత్యంత అవసరం. అందుకే 200 ఏళ్ల విదేశీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర పోరాటం తర్వాత 75 ఏళ్ల క్రితం మన దేశానికి విదేశీ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. తర్వాత దేశ విభజన జరిగి అంతా అతలాకుతలం అయింది. అక్కడి నుండి క్రమంగా కోలుకుని దేశం నిలదొక్కుకుంది. ఇంకా మరింత మెరుగయిన దేశం కోసం ప్రయత్నాలూ పోరాటాలూ కొనసాగుతూనే వున్నాయి. ఈ మొత్తం దేశ స్వాతంత్ర్యానంతర పరిణామాలను వివిధ కళా రూపాలు అనేక రకాలుగా రికార్డ్ చేసాయి. కథలు, నవలలు, పాటలు, పెయింటింగ్స్ చాలా వచ్చాయి. చలనచిత్ర మాధ్యమం గురించి పరిశీలిస్తే ఫిలిమ్స్ డివిజన్ తమ డాక్యుమెంటరీలలో చరిత్రను యథాతథంగా బంధించే యత్నం చేసింది. న్యూస్ రీళ్లుగానూ ఇతరత్రా కూడా ఫిలిమ్స్ డివిజన్ తన పరిమితుల మేరకు ఎన్నదగిన కృషినే చేసింది.
ఏడాది పొడవునా చూపితే..
ఇక ప్రధాన స్రవంతి చలన చిత్రపరిశ్రమ కూడా స్వాతంత్ర్యోద్యమాన్నీ, దాని తర్వాతి పరిణామాలనూ పలు సినిమాలుగా రూపొందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మనం చూడదగిన సినిమాల గురించి ఇవ్వాళ మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుగేతర సినిమాలే. తెలుగు సినిమాల గురించి మన తెలుగువాళ్లందరికీ తెలుసు కనుక నేను వివిధ భారతీయ భాషలలో వచ్చిన స్వాతంత్ర్య భారత నేపథ్యం ఉన్న కొన్ని సినిమాలను ప్రస్తావిస్తున్నాను. ఇది సమగ్ర లిస్టు అని కూడా నేను అనడం లేదు. పెరిగిన సాంకేతికత ఫలితంగా దాదాపు అన్ని సినిమాలూ అందుబాటులో వున్నాయి. వీలైనవాళ్లు ఈ సందర్భంగా ఆయా సినిమాలను వీక్షించాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం 'గాంధీ' సినిమాను విద్యార్థులకు చూపిన్స్తున్నది. ఇదే రీతిలో సంవత్సరం మొత్తం స్వాతంత్ర్య సినిమాలను చూపిస్తే బాగుంటుంది. మంచి సెలెబ్రేషన్ అవుతుంది. ప్రభుత్వ పెద్దలు సలహాదారులూ ఆలోచించాలి.
* చిన్నమ్మూల్: దేశ విభజన పైన మొట్టమొదటి సినిమా ఇది. దీన్ని సుప్రసిద్ధ దర్శకుడు, కెమెరామన్ నిమాయ్ ఘోష్ తీసాడు. బెంగాలీలో నిర్మించబడిన ఈ సినిమా ప్రధానంగా తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చిన వేలాది ప్రజల గోసను చిత్రించింది. వేదనా భరితమైన వారి జీవితాలని అత్యంత హృద్యంగా చిత్రించాడు నిమాయి ఘోష్. చిన్నమ్మూల్‌ను పుదోవ్కిన్ చొరవతో రష్యాలో విడుదల చేస్తే విజయవంతంగా ఆడింది. నిమాయ్ ఘోష్ 1983 లో కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్య్వర్యంలో నిర్వహించిన అభినందన సభకు అతిథిగా వచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు.
* గరంహవా: ఎం.ఎస్.సత్యు దర్శకత్వంలో వచ్చిన ఈ 'గరంహవా' దేశ విభజన పైన రూపొందిన అత్యుత్తమ సినిమాగా చెప్పుకోవచ్చు. బల్రాజ్ సాహానీ, షౌకత్ ఆజ్మి, ఫరూఖ్ షేఖ్ లాంటి గొప్ప నటీనటులు నటించారు. దేశ విభజన కాలం నాటి దయనీయ స్థితిగతులను నిజాయితీగా వాస్తవికంగా చూపించిందీ సినిమా.
* మేఘే ధాకా తారా: సుప్రసిద్ధ దర్శకుడు రిత్విక్ ఘటక్ దేశ విభజన పైన నిర్మించిన మూడు సినిమాల పరంపరలో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అధ్యయన సినిమాగా నిలబడింది. మిగతా రెండు సినిమాలు 'కోమల్ గాంధార్', 'సుబర్నలేఖ'. దేశ విభజన పర్యవసానంగా తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి కాంప్స్‌లో వున్న వాళ్ల జీవితాలను ఆవిష్కరించిన సినిమాలు.
* తమస్: భీష్మ సహానీ రాసిన నవల ఆధారంగా గోవింద్ నిహలానీ తీసిన ఈ టీవీ సీరియల్ స్వాతంత్ర్యానంతరం పంజాబ్‌లోని హిందూ సిక్కుల స్థితి గతులను అత్యంత నిజాయితీగా వివరించిందీ చిత్రం. దూరదర్శన్‌లో ప్రసారమైనప్పుడు 'తమస్' ఒక ట్రెండ్. ఓంపూరి, అమ్రిష్‌పూరి, దీనాపాఠక్, దీపా సాహి లాంటి నటులు ఇందులో నటించారు. డీడీ ఆర్కయివ్స్‌లో ఉందీ సీరియల్
* మదర్ ఇండియా: స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఒక మహిళ చేసిన జీవన పోరాటమీ సినిమా. మోసకారి అయిన జమీందార్, వడ్డీ వ్యాపారస్తుడి నుంచి తనను తాను కాపాడుకుంటూ తన ఇద్దరు పిల్లలను సాకిన తల్లి జీవితాన్ని హృద్యంగా చూపించిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా. నర్గిస్ ఇందులో చాలా గొప్పగా నటించారు. ఇది ఆ రోజులలోనే ఆస్కార్‌కి నామినేట్ అయింది
* షహీద్: భగత్‌సింగ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది ఇది 1965లో వచ్చింది. మనోజ్‌కుమార్ ప్రధాన భూమిక పోషించారు.
* గాంధీ : మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో వచ్చిన రిచర్డ్ అటెన్‌బరో చిత్రమిది. అహింస, సహాయనిరాకరణ తదితర అనేక పోరాట రూపాలలో బ్రిటష్‌కు వ్యతిరేకంగా గాంధీ చేసిన ఉద్యమాలను 'గాంధీ' సినిమా బాగా చూపించింది. దక్షిణాఫ్రికాలో రైల్ నుండి పడదోయడం నుంచి చివరికి గాంధీ హత్య దాకా మొత్తం గాంధీ జీవితాన్ని ఈ బయోపిక్ సినిమా ఆవిష్కరిస్తుంది. బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్రను, రోహిని హత్తంగడి కస్తూరిబా పాత్రను పోషించారు. అంతర్జాతీయంగా ఆస్కార్ సహా అనేక అవార్డులను అందుకుంది. ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు తెలుగులోకి డబ్ చేసారు. NFDC వద్ద వుంది .
* ట్రైన్ టు పాకిస్తాన్: ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ రచన ఆధారంగా రూపొందిందీ చిత్రం. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ గ్రామంలో ఎంతో సఖ్యంగా వున్న హిందూ-ముస్లిమ్ ప్రజలలో పాకిస్తాన్ నుంచి శవాలతో ఒక ట్రైన్ రావడంతో కలిగిన పరిణామాలను గొప్పగా చూపిందీ సినిమా. ఒక సంఘటన ఒక వూరిలో ఒక ప్రాంతంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీస్తుందో ఈ సినిమా వాస్తవీకరించి చూపింది.
* క్రాంతి : ఇది ప్రధానంగా 1825–1875 నడుమ జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుంది. జావేద్ అక్తర్ రచన చేసిన ఈ సినిమాలో చాలా గొప్ప పాటలున్నాయి.
* మంగళ్‌పాండే : స్వాతంత్ర్యోద్యమ మొట్ట మొదటి వీరుడు మంగళ్‌పాండే జీవితం ఆధారంగా రూపొందించబడిందీ సినిమా. మన పోరాట వీరుడి చరిత్ర చూసి మన రక్తం ఉడుకుతుంది. పాండేగా ఆమిర్‌ఖాన్ బాగా చేసాడు. అమీషా పటేల్, రాణీ ముఖర్జీ తదితరులు ప్రధాన భూమికలను పోషించారు.
* ఖేలెంగే హం జీ జాన్ సే : 1930ల నాటి చిట్టగాంగ్ తిరుగుబాటును ఆధారం చేసుకుని నిర్మించారు. మానినీ చటర్జీ రాసిన 'డు అండ్ డై' నవల ఆధారంగా తీసారు. అభిషేక్ బచ్చన్, దీపికా పాడుకొనే ప్రధాన పాత్రధారులు.
* రంగ్ దే బసంతి : ప్రజాదరణపరంగానూ, విమర్శనాత్మకంగానూ ఈ సినిమా విశేష ప్రశంసలు అందుకుంది. భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు, అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ పోరాట పటిమను జీవితాలను ఆధారం చేసుకుని సినిమా తీద్దామని వచ్చిన విదేశీయురాలు ఇందులో ప్రదాన పాత్ర. అయిదుగురు భారతీయ యువకులని ఆ పాత్రలకు ఎంపిక చేస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం ఈ సినిమా. ఆమిర్ ఖాన్, సిద్దార్థ, మాధవన్ తదితరులు ప్రధాన భూమికలను మంచి విలువైన సినిమా.
* ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్: భగత్‌సింగ్ పాత్రని సమున్నతంగా చూపిన సినిమా ఇది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ మంచి నటనను ప్రదర్శించాడు.
* నేతాజీ సుభాస్ చంద్రబోస్ : నేతాజీ జీవనయానాన్ని ప్రతిభావంతంగా చిత్రించింది ఈ సినిమా. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో మన దేశ స్వాతంత్ర్య పోరాటం ఎట్లా సాగిందీ బోస్ జీవితం ఎట్లా ఉద్వేగభరితమయిందీ కూడా ఈ సినిమా చెబుతుంది. అనేక అవార్డులు అందుకుందీ సినిమా.
* డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ : మమ్ముట్టి అంబేద్కర్‌గా నటించిన ఈ సినిమాకు జబ్బార్ పటేల్ దర్శకత్వం వహించారు. హిందీ ఇంగ్లీష్ భాషలలో వచ్చిన ఈ సినిమాలో అణచివేతకు గురైన వర్గాల ప్రజకోసం అంబేద్కర్ చేసిన కృషిని బాగా చిత్రీకరించారు. అంబేద్కర్ జీవితంపై వచ్చిన మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. జాతీయస్థాయిలో మమ్ముట్టికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
ఇలా పలు సినిమాలు జాతీయ స్వాతంత్ర్య ఉద్యమమూ, స్వాతంత్ర్యానంతర భారతదేశమూ ప్రధానాంశాలుగా వచ్చాయి. పుస్తకాలు చదవడం వలన కాకుండా, సినిమాలు వీడియోలు చూడడం ద్వారా విషయ పరిజ్ఞానం తెలుసుకుంటున్న యువతరానికి కనీసం ఈ సినిమాల ద్వారానైనా మన దేశ చరిత్ర కొంత తెలిసినా సంతోషమే కదా. పుస్తకాల అధ్యయనాన్ని ప్రోత్సహించే పని చేయడమే ఉత్తమమని నేను భావిస్తాను.
వారాల ఆనంద్
94405 01281