పాటలా సాగిపోయే సినిమా..

19 1(A) Movie review

Update: 2024-10-01 00:45 GMT

పాటలా సాగిపోయే సినిమా ఎప్పుడన్నా చూశారా? 19 (1) (a) అలాంటి మెత్తటి అనుభూతినే ఇస్తుంది. కత్తి లాంటి ఇష్యూని సుతిమెత్తగా డీల్ చేస్తుంది. సినిమా అనేది విజువల్ మీడియం. విషయం చెప్పడానికి చాంతాడంత డైలాగ్స్ అవసరం లేదు, అర్థం కాని కవిత్వమూ అక్కరలేదు, అర్థవంతమైన నాలుగు మాటలు, కనికట్టు చేస్తూనే కథను నడిపించే కాసిని aesthetic shots చాలని నిరూపించింది డైరెక్టర్ ఇందు వి.ఎస్. ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా తనే రాసుకుంది. ఇంతకుముందు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సలీం అహ్మద్ దగ్గర పని చేసిన ఇందుకి ఇది తొలి సినిమా. తొలి సినిమాతోనే చాలా విషయాలను బోల్డ్‌గా చెప్పినందుకు ఈ అమ్మాయిని మెచ్చుకోకుండా ఉండలేం!  

19 (1) (a) పేరుకు తగ్గట్లే వాక్ స్వాతంత్ర్య హక్కు చుట్టూ తిరుగుతుంది. కానీ నెరేటివ్ మనం ఇన్నాళ్ళూ చూసిన సినిమాల కంటే చాలా భిన్నం. ఎక్కడా లౌడ్‌గా అనిపించదు. చాలా సెటిల్డ్‌గా, డీప్‌గా, ఆలోచించే విధంగా ఉంటుంది. పెన్ కుట్టి (నిత్యా మీనన్) ఒక జిరాక్స్ షాప్ నడుపుతుంటుంది (ఎండ్ టైటిల్స్‌లో తప్ప పెన్ కుట్టి అనే పేరు సినిమాలో ఎక్కడా కనపడదు, వినపడదు- ఈ సినిమాలో ఇదో విశేషం. నిజానికి అది పేరు కూడా కాదు. మలయాళంలో అమ్మాయిని అలాగే అంటారు). తండ్రి ఇంట్లో ఏమీ పట్టించుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు మానుకుని తనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఓ రోజు గౌరీశంకర్ అనే విప్లవ రచయిత (విజయ్ సేతుపతి) చేత్తో రాసిన కాగితాల కట్ట తెచ్చి జిరాక్స్ తీసి పెట్టమని పెన్ కుట్టికి ఇస్తాడు. ఎంత లేటయినా వస్తానని, వెయిట్ చేయమని చెబుతాడు. జిరాక్స్ కాపీ బైండింగ్ చేయాలా అని అడిగితే “నీకు నచ్చినట్లు చెయ్యి” అనేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు.

వ్యక్తిగా ఎదిగిన పెన్ కుట్టి

అలా వెళ్లిన వాడు ఎప్పటికీ తిరిగి రాడు. రెండు రోజుల తర్వాత అతనెవరో, అతనికేమైందో టీవీలో న్యూస్ చూసి తెలుసుకున్న పెన్ కుట్టి ఉలిక్కిపడుతుంది. నింపాదిగా సాగిపోతున్న ఆ అమ్మాయి జీవితాన్ని ఈ ఘటన కుదిపేస్తుంది. అంతదాకా గౌరీశంకర్ కాగితాల కట్టను పట్టించుకోని పెన్ కుట్టి ఇప్పుడు చదవడం మొదలుపెడుతుంది. గౌరీశంకర్ మీద గౌరవం ఇనుమడిస్తుంది. అది క్రమంగా ఆరాధనగా మారుతుంది. పబ్లిష్ చేయని ఆ పుస్తకం ఎంత గొప్పదో, గౌరీ శంకర్ దృష్టిలో దాని విలువేంటో తెలిశాక తన మీద ఎంతటి బాధ్యత ఉందో పెన్ కుట్టికి అర్థమవుతుంది. “నీకు నచ్చినట్లు చెయ్యి” అని గౌరీశంకర్ యథాలాపంగా అన్న మాటలే తనని నడిపిస్తాయి. పుస్తకాన్ని చేరాల్సిన చోటుకు చేర్చే క్రమంలో తనూ వ్యక్తిగా ఎదుగుతుంది. ప్రశ్నించిన పాపానికి తుపాకీ తూటాలకు బలైన జర్నలిస్టు గౌరీ లంకేశ్, గౌరీ శంకర్ పాత్రకు స్ఫూర్తిగా కనిపిస్తారు. పేరులో సామ్యం కూడా అందుకే!

రెండు దృక్పథాల మధ్య కథ

ఈ సినిమా నేరేషన్‌లో రెండు ధృక్పధాలు ఉంటాయి. గౌరీ శంకర్ (విజయ్ సేతుపతి) ఫోకల్ పాయింట్‌గా ఉన్నది ఒకటైతే, రెండోది పెన్ కుట్టి (నిత్య మీనన్) పాయింట్ ఆఫ్ వ్యూ. గౌరీ శంకర్ క్యారెక్టర్ వెంటే నడిస్తే సినిమా వెలితిగా అనిపిస్తుంది. అతను సమాజానికి చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పినట్లు అనిపించదు. అతని హత్యకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లే కనిపిస్తుంది కానీ చివరిదాకా ఏమీ తేలదు. ఇంతటి వివాదానికి కారణమైన పుస్తకంలో అతనసలు ఏం రాశాడన్నది కూడా పూర్తిగా చెప్పరు. హింట్ ఇచ్చి వదిలేస్తారు. అసలీ సినిమాకి 19 (1) (a) పేరు పెట్టారు కానీ దాని గురించి గట్టిగా చర్చించనే లేదు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు.

మిడిల్ క్లాస్ అమ్మాయిలో మార్పు

ఇదంతా ఓ రకంగా నిజమే! కానీ ఒక్కసారి గౌరీ శంకర్‌ని పక్కనబెట్టి పెన్ కుట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూడండి. పిక్చర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా గౌరీ శంకర్ గురించి కాదు, పెన్ కుట్టి గురించి. గౌరీ శంకర్ సిద్ధాంతాలు, అతను రాసిన పుస్తకాలు, అతనిపై దాడి, ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించిన చర్చ, దాని చుట్టూ ముసురుకున్న రాజకీయాలు- ఇవన్నీ సినిమాలో అండర్ కరెంట్ గా ఉంటాయి. వీటిని ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటుంది, చివరికి తనని తాను ఎలా ఉద్ధరించుకుంటుంది అనేదే అసలు కథ. మంచి సాహిత్యం ఉద్దేశం కూడా ఇదే అని డైరెక్టర్ చెప్పకనే చెబుతుంది.

ఆడపిల్ల ధైర్యంగా ముందడుగు వేసిన క్షణం

నేనెప్పుడూ ఎదుటి వారి అంచనాలకు తగ్గట్లే బతుకుతుంటాను అని పెన్ కుట్టి ఓ సందర్భంలో అంటుంది. ఆ సందర్భం చాలా ప్రత్యేకమైనది. పరిస్థితులకు రాజీపడి బతుకుతున్న ఓ మామూలు ఆడపిల్ల ధైర్యంగా ముందడుగు వేసిన క్షణమది. ఇలాంటి ఓ క్షణాన్ని సృష్టించుకోమని ఆ అమ్మాయి వెన్ను తట్టి ప్రోత్సహించింది గౌరీ శంకర్ సిద్ధాంతాలే! అంతకుముందు స్నేహితురాలు పెళ్లి ఇష్టం లేదని చెబితే పెన్ కుట్టి విని ఊరుకుంటుంది. తనలో మార్పు మొదలయ్యాక ఫ్రెండ్‌ని నిలదీస్తుంది. రాజీపడిపోతున్న ఆ అమ్మాయిని చూసి కోప్పడుతుంది, బాధపడుతుంది. మనోవేదనతో కుంగిపోతున్న తండ్రితో చాన్నాళ్ళ తర్వాత మనసు విప్పి మాట్లాడుతుంది. దెబ్బకి ఆయన కుటుంబ బాధ్యత మళ్ళీ తీసుకుంటాడు. అన్నాళ్లూ బాధ్యతల మధ్య మగ్గిన ఆ అమ్మాయి పై చదువులకి అప్లికేషన్ పెట్టుకుంటుంది. ఇదంతా భావ ప్రకటన ఫలితమే! భావ ప్రకటనా స్వేచ్ఛ గౌరీ శంకర్ లాంటి విప్లవ రచయితలకు ఎంత అవసరమో రాజీ పడి బతికేస్తున్న పెన్ కుట్టి లాంటి వాళ్ళకీ అంతే అవసరం. అందుకే ఇద్దరికీ కలిసొచ్చేలాగా సినిమాకి ఆ టైటిల్ పెట్టి ఉంటారు.

సినిమాకు జవజీవాలు వాళ్లిద్దరూ

నిత్యా మీనన్‌ని చాలా వరకు చలాకీ కేరెక్టర్స్‌లోనే చూశాను. అవసరమైతే నాలుగు తగిలించే గడసరి అనిపిస్తుంది తను. అలాంటిది ఈ సినిమాలో పరిస్థితులకు లొంగిపోయిన బేలలాగా, సుతిమెత్తటి మనసున్న తెలివైన పిల్లలాగా బాగా చేసింది. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పేదేముంది సినిమాకే మూల స్తంభం లాంటి పాత్రకు ఆయన అతికినట్లుగా సరిపోయాడు.

సినీ ప్రేమికులకు కనువిందు

కానీ నాకు మాత్రం ఈ సినిమా అంతా డైరెక్టర్ ఇందునే కనిపించింది. తను ఇంట్రోవర్ట్ అని ఇందు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెన్ కుట్టి క్యారెక్టర్ లో ఆ షేడ్స్ కనిపించాయి. పెన్ కుట్టి ఎక్కువగా మాట్లాడదు. ఆలోచిస్తుంది, ఊహిస్తుంది. ఆ ఊహలను ఇందు ఎంత బాగా విజువలైజ్ చేసిందని! అందుకే సినిమా ఓ పాటలా సాగిపోతుంది అన్నది! సినిమాటోగ్రాఫర్ మనీష్ మాధవన్, డైరెక్టర్ ఊహని విజువల్స్‌‌లోకి చక్కగా మార్చాడు. చిత్రమేంటంటే అతను ఇందు కంటే మితభాషి. ఇద్దరు మితభాషిలు కలిసి ఎంత గొప్పగా భావ ప్రకటన చేశారో బహుశా 19 (1) (a) అనే టైటిల్ ఈ ఇద్దరికి కూడా వర్తిస్తుందేమో! సినిమాని సినిమాగా ప్రేమించేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా 19 (1) (a)!

(లభ్యం: డిస్ని+ హాట్‌స్టార్, యూట్యూబ్)

శాంతి ఇషాన్

సినీ సమీక్షకురాలు

Tags:    

Similar News