మనం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవర్నో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగానే జరుగుతుంది. అలా జరగకుంటే మనిషి జీవితానికి అర్థం ఉండదు. మన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనకు తోడు నిలిచేవారు అవసరం. మనల్ని నమ్మిన వ్యక్తి మనకు ఇచ్చే కొండంత ధైర్యం తోడుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించింది ఈ సినిమా!
మనోజ్ శర్మ అనే 12వ తరగతి ఫెయిల్ అయిన ఐపీఎస్ అధికారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమా '12th Fail'. మనోజ్ తండ్రి నిజాయితీ గల చిన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆ నిజాయితీతోనే ఉద్యోగం పోతుంది. దీంతో కుటుంబ భారం అంతా వారిద్దరి కొడుకులైన మనోజ్ శర్మ, కమలేష్‌లపై పడుతుంది. అప్పుడే 12వ తరగతి చదువుతున్న మనోజ్ శర్మ చీటింగ్ చేస్తూ పరీక్షలు రాస్తూ పాసవుతుంటాడు. కానీ ఆ సంవత్సరం పరీక్షల సమయంలో డీఎస్పీ దుష్యంత్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంతో మనోజ్ ఫెయిల్ అవుతాడు. దీంతో కుటుంబం కోసం ఆటో నడపడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఎమ్మెల్యేకు చెందిన ప్రైవేట్ మాఫియా వారితో గొడవ జరగడంతో కమలేష్, మనోజ్ అరెస్ట్ అవుతారు. కమలేశ్‌ను పోలీసులు విపరీతంగా కొట్టి మీ నాన్న అవినీతిపరుడు అని తిడతారు. ఆ మాటలకు కోపం వచ్చిన మనోజ్ శర్మ ఆగ్రహంగా మాట్లాడడంతో పోలీసులు కోపంతో నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటారు. దీంతో కోపంతో మనోజ్ శర్మ డీఎస్పీ దృశ్యంత్ సింగ్ ఇంటి దగ్గరికి వెళ్లి, నీవే గనక ఎగ్జామ్స్‌లో చీటింగ్ జరగనిచ్చి ఉంటే ఈ పాటికి నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడినని ఆగ్రహంగా మాట్లాడతాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న దుశ్యంత్ సింగ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కమలేష్‌ని విడిపిస్తాడు. దీంతో మనోజ్ మీలా అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దీంతో డీఎస్పీ చీటింగ్ చేయడం మానేస్తే ఏదైనా సాధించవచ్చు అని అంటాడు. చీటింగ్ చేయడం మానేయడం అనే మాట మనోజ్ శర్మ మనసులో గట్టిగా నాటుకుపోయి ఆ సంవత్సరం కష్టపడి చదివి 12వ తరగతి పాస్ అవుతాడు.. తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో.. దుష్యంత్‌ని రోల్ మోడల్‌గా తీసుకొని డీఎస్పి అవ్వాలని PCS కోచింగ్ కోసం గ్వాలియర్ వెళ్తాడు. పీసీఎస్ కోచింగ్ వెళ్ళి, సివిల్ సర్వీసెస్ ఎలా సాధించాడు? అది సాధించడంలో హీరోయిన్ పాత్ర ఎంత? అనేది మిగతా కథ. ఈ సినిమాలో సివిల్స్ సాధించగానే, తన ఇన్‌స్పిరేషన్ అయిన డీఎస్పీ దుష్యంత్ సింగ్‌ని కలిసి మీరు చెప్పినట్లే చీటింగ్ మానేశానని అనుకున్నది సాధించానని చెప్పడం సినిమాకు హైలెట్.
అంచనాలు లేకున్నా సంచలనాలు..
ఎటువంటి అంచనాలు లేకుండా ఆగస్టు 27న విడుదలైన ఈ సినిమా, కేవలం 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ ఎవరూ ఊహించనంతగా విజయం సాధించింది. ఈ సినిమాను ప్రస్తుతం పలు భాషల్లో ఓటీటీలలో కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వల్లనే ఎక్కువ మందికి తెలిసింది. మౌత్ టాక్‌తోనే సినిమా మంచి పేరును సంపాదించుకుంది.
ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతీ నిరుపేద అభ్యర్థి జీవితాన్ని ప్రతిబింబిస్తూ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమాను ఇండిపెండెంట్ మూవీ నామినేషన్ కింద ఆస్కార్ నామినేషన్‌కు సైతం పంపారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలించక ఆ లక్ష్యం వరకు చేరుకోలేమన్న భయంతో మధ్యలోనే ఆగిపోతారు కొందరు.. కానీ ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికీ విధితో పోరాడి మరీ అనుకున్నది సాధిస్తారు మరికొందరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఏ కొంచెం డీమోటివేట్‌గా అనిపించినా ఈ సినిమా మీకు ఒక రీబూస్టర్‌గా, ఒక రీస్టార్టింగ్ టాబ్లెట్‌గా ఉపయోగపడుతుంది.
సినిమా: 12th ఫెయిల్
నిర్మాత-దర్శకుడు విధు వినోద్ చోప్రా
నటీనటులు: విక్రాంత్ మాసే, మేధా శంకర్, ప్రియాన్షు ఛటర్జీ
ఓటీటీ: డీస్నీ + హాట్‌స్టార్
నేరడిగొండ సచిన్,
87907 47628