ప్రంట్‌ల సృష్టికర్తలు తెలుగు నేతలే

ఉన్నది ఉన్నట్టు

Update: 2022-02-24 11:45 GMT

దేశంలో 'ఫ్రంట్‌ల' రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో నేషనల్ ఫ్రంట్‌ను ఎన్‌టీఆర్, యునైటెడ్ ఫ్రంట్‌ను చంద్రబాబునాయుడు పెట్టినట్లుగానే ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురూ తెలుగువారే. యాదృచ్ఛికంగా ఈ ముగ్గురి రాజకీయాలూ తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉన్నవే. గతంలోని రెండు ఫ్రంట్‌లు దేశ రాజకీయాలను తాత్కాలికంగా మలుపు తిప్పినా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాయి. ఆ రెండూ ఏదో ఒక జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఉనికిలోకి వచ్చాయి. అనివార్యంగా మరో జాతీయ పార్టీ సపోర్టు తీసుకోవాల్సి వచ్చింది. ఇపుడు కేసీఆర్ ప్రయత్నం మాత్రం భిన్నమైనది. రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఒక్క దగ్గరకు చేర్చాలనుకుంటున్నారు.

పాత అనుభవాల నేపథ్యంలో కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్), కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్) కూటములు ఉండనే ఉన్నాయి. ఈ రెండూ జాతీయ పార్టీల చెప్పుచేతలలో ఉన్నాయి. అందుకే కేసీఆర్ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో మాత్రమే కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పదేపదే కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ అని నొక్కి చెబుతున్నారు. రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. పార్టీల నేతలను కలుస్తున్నారు. సానుకూల స్పందనే వచ్చిందన్న సంతృప్తితో ఉన్నారు. కొందరు థర్డ్ ఫ్రంట్ అనీ, మరికొందరు ఫెడరల్ ఫ్రంట్ అనీ పిలుస్తున్నారు. కేసీఆర్ మాత్రం దీనికి 'పీపుల్స్ ఫ్రంట్' అంటూ పేరు పెట్టారు.

సత్తా చాటుతున్న తెలుగు నేతలు

దేశ రాజకీయాలలో తెలుగువారికి పెద్దగా ఉన్నత పదవులు దక్కలేదు. దక్షిణాది నుంచి ప్రధాని పదవి దక్కింది ఇద్దరికే. ఒకరు దేవెగౌడ, మరొకరు పీవీ నర్సింహారావు. రాజకీయాలలో మాత్రం తెలుగోళ్ల సత్తా ఏంటో మూడు దశాబ్దాల క్రితమే రుజువైంది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడంలో ఎవ్వరికీ తీసిపోలేదని నిరూపించారు. వేర్వేరు పార్టీలతో ఫ్రంట్‌ల ఏర్పాటుకు పునాది వేసింది తెలుగు నేతలే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టీ రామారావు 1988లోనే నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తే, ఆ తర్వాత అదే పార్టీకి చెందిన చంద్రబాబునాయుడు యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రాణం పోశారు. ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే కేసీఆర్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక్కటి చేసి ప్రజలే కేంద్రంగా 'పీపుల్స్ ఫ్రంట్'కు శ్రీకారం చుడుతున్నారు.

గతంలో ఏర్పడిన రెండు ఫ్రంట్‌లకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు ఉన్నది. అయినా, అవి ఎక్కువ కాలం మనలేకపోయాయి. రెండున్నరేండ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయాయి. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీ‌ఏ ఏర్పడింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండూ ఉనికిలోనే ఉన్నాయి. మధ్యలో 2007లో చంద్రబాబు కన్వీనర్‌గా ఏర్పడిన యునైటెడ్ నేషనల్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ కనుమరుగైపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ భావనతో మొదలుపెట్టిన ప్రయత్నాలు 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ ప్రయోగం మొదలైంది.

విఫల ప్రయోగంగా మిగిలి

గతంలో ఏర్పాటైన నేషనల్ ఫ్రంట్, ఆ తర్వాతి యునైటెడ్ ఫ్రంట్ ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయాయి. ముచ్చటగా మూడేళ్ల చొప్పున కూడా అధికారంలో కొనసాగలేకపోయాయి. 1980వ దశకం మధ్యలో జనతాదళ్, డీఎంకే, అస్సాం గణ పరిషత్, సోషలిస్టు కాంగ్రెస్, ఆలస్యంగా చేరిన జార్ఖండ్ ముక్తిమోర్చాలాంటి పార్టీలతో నేషనల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఎన్‌టీఆర్ బీజం వేశారు. వీపీసింగ్, చంద్రశేఖర్ ప్రధానులయ్యారు. కానీ, ఆ ఫ్రంట్ మూడేళ్లు కూడా ఉనికిలో లేకపోయింది. కూటమిలోకి అన్నాడీఎంకేను ఆహ్వానించే ప్రయత్నం జరిగింది. ఆ పార్టీతో ఉప్పు-నిప్పుగా ఉండే డీఎంకే వ్యతిరేకించడంతో సంక్షోభం ఏర్పడి కూటమి విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 1996లో బీజేపీకి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి కాకపోయినా బైట నుంచి మద్దతు ఇచ్చింది. డీఎంకె, అసోం గణ పరిషత్, సమాజ్‌వాదీ పార్టీ, తివారీ కాంగ్రెస్, వామపక్షాలు, తమిళ మానిల కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీలాంటివన్నీ ఫ్రంట్‌లో భాగస్వాములు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులైనా రెండున్నరేళ్లు కూడా ఈ ఫ్రంట్ కొనసాగలేకపోయింది. జాతీయ రాజకీయాలలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

అవకాశవాదం నడుమ దినదిన గండం

రాజకీయాలలో ఫ్రంట్‌లు కొత్తేమీ కాదు. అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. పార్టీల సిద్ధాంతాలు వేరైనా ఒకే కూటమిలో ఉంటున్నాయి. నిర్దిష్టంగా ఒక పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వాటిని ఒక్క దగ్గరకు చేర్చింది. సైద్ధాంతికంగా బలమైన పునాది లేకున్నా జట్టుగానే ఉంటున్నాయి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం, స్థిరత్వం లేకుంటే అవి ఎక్కువ కాలం కొనసాగలేవు. గతంలోని రెండు ఫ్రంట్‌ల అనుభవాలు దీన్నే రుజువుచేశాయి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్‌కు ఇది తెలియందేమీ కాదు. అయినా సాహసంతో ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒకే దగ్గరకు చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ ఎజెండా ఎంతకాలం వాటిని ఒకే బంధంలో బలంగా ఉంచగలుగుతుందన్నది ప్రశ్నార్థకం.

పార్టీల మధ్య పరస్పరం భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలు పుడుతూనే ఉంటాయి. ఫ్రంట్ మనుగడకు అవి ప్రతిబంధకంగా మారుతుంటాయి. యూపీఏ హయాంలో అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు కూటమి నుంచి వైదొలిగాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక ఉన్నా భేదాభిప్రాయాలు తప్పలేదు. ఎన్‌డీఏలోనూ అదే కనిపిస్తున్నది. దీర్ఘకాలంగా ఆ కూటమిలో ఉన్న తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్, శివసేనలాంటి పార్టీలు వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఫ్రంట్‌ల అనుభవాలు కళ్ళ ముందు కదలాడుతున్నా కేసీఆర్ పెద్ద సాహసానికే ఒడిగడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అని ఆర్భాటంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నారు.

ఇపుడు కేసీఆర్ మళ్లీ పీపుల్స్ ఫ్రంట్ అనే రాగమందుకున్నారు. దేశమంతా తిరగాలనుకుంటున్నారు. బీజేపీ మీద కోపంతో ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. అలాంటి వ్యతిరేకత ఉన్న పార్టీలకు దగ్గరవుతున్నారు. పీపుల్స్ ఫ్రంట్ మరో ఫెడరల్ ఫ్రంట్ అవుతుందా? ఒకవేళ ఉనికిలోకి వచ్చినా గతంలోని నేషనల్, యునైటెడ్ ఫ్రంట్‌ల సరసన చేరుతుందా? ఎన్‌టీఆర్, చంద్రబాబులాగా కేసీఆర్ కూడా ఒకరిగా మిగిలిపోతారా? ఏదేమైనా దేశ చరిత్రలో మరో కొత్త ఫ్రంట్‌కు కూడా హైదరాబాద్ నుంచే శ్రీకారం చుట్టడం గమనార్హం. తెలుగుదేశం రాజకీయాలతో సంబంధాలు ఉన్న ఎన్‌టీఆర్, చంద్రబాబులాగానే ఇప్పుడు కొత్త ఫ్రంట్‌కు ఊపిరులూదుతున్న కేసీఆర్ కూడా ఒకప్పుడు ఆ పొలిటికల్ స్కూల్‌కు చెందినవారే. మళ్లీ తెలుగు నేత చేతుల మీదుగానే కొత్త ఫ్రంట్‌కు బీజం పడుతున్నది.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News