ఆంక్షలు సామాన్యులకేనా?

ఉన్నది ఉన్నట్టు

Update: 2022-01-13 10:45 GMT

ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొవిడ్ నిబంధనలు ఎవరి కోసం? అమలుచేస్తున్న ఆంక్షలు దేనికోసం? అవన్నీ కేవలం సామాన్యుల కోసమేనా? అధికారులకు, అధికార పార్టీ నేతలకు వర్తించవా? మాస్కు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలూ అంతేనా? ప్రజలకో రూలు, ప్రజాప్రతినిధులకు మరో రూలు ఉంటుందా? పోలీసులు కూడా ఆ తేడాతోనే పనిచేస్తారా? దేశవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు అమలవుతున్న తీరు చూస్తుంటే అదే తేటతెల్లమవుతున్నది. జీవోలను రూపొందించే ప్రభుత్వాలే వాటిని ఉల్లంఘిస్తున్నాయి. కేంద్రం మొదలు రాష్ట్రాల వరకు అదే జరుగుతున్నది. చట్టాలు కొద్దిమందికి చుట్టాలు అనేది ప్రస్ఫుటమవుతున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు అనేక దేశాలు కొన్ని జాగ్రత్తలు సూచించాయి. వైరస్ స్వభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి వీటిని నిర్దేశించాయి. తప్పనిసరిగా మాస్కు ధరించాలని, నిత్యం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తుల మధ్య కనీసమైన ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని నొక్కిచెప్పాయి. దీనికి అనుగుణంగా ప్రధాని మోడీ సైతం 'దో గజ్ కీ దూరీ' (రెండు గజాల దూరం) అంటూ పిలుపునిచ్చారు. కానీ, ఇది నినాదానికే పరిమితమైంది. కేంద్ర మంత్రులు మొదలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వరకు ఈ నిబంధనలను పాటించడంలేదు.

అమలులో అలసత్వం

నిబంధనలను తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, వాటి అమలుపై ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆచరణను చూస్తే స్పష్టమవుతున్నది. తెలంగాణ సర్కారు సైతం గత నెల చివరలో పొలిటికల్ మీటింగులు, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించింది. ఇప్పటికీ అది అమలులోనే ఉన్నది. అదే సమయంలో అధికార పార్టీ 'రైతుబంధు ర్యాలీల' పేరుతో ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆరడగుల దూరం, మాస్కు లాంటి నిబంధనలన్నీ బేఖాతర్. మాస్కు ధరించనందుకు సామాన్యుల నుంచి పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఉద్యోగుల సమస్యలపై నిరసన మీటింగులు పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్రనేతలు, ముఖ్యమంత్రులు వచ్చి బహిరంగసభలలో ప్రసంగిస్తున్నారు. మీటింగులపై నిషేధం ఉన్నా ఇవి యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. రాజకీయ నాయకులు తమకు తాముగా వీఐపీలుగా చెలామణి అవుతున్నారు. పోలీసు యంత్రాంగమూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. కరోనా వైరస్ పేద, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. పోలీసుల, ప్రభుత్వ ఆచరణ మాత్రం సామాన్యుల పట్ల ఒక రకంగా, సోకాల్డ్ వీఐపీల పట్ల మరో రకంగా ఉంటున్నది.

వారి మీద కేసులు ఉండవు

నిజంగా ప్రభుత్వానికి కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలనే చిత్తశుద్ధి లేదు. గుంపులుగా తిరగొద్దు, సంక్రాంతిని ఇంట్లోనే చేసుకోవాలంటూ పిలుపునిస్తూనే పబ్‌లు, బార్లను, థియేటర్లను, ఎగ్జిబిషన్‌లను కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటికీ థియేటర్లలో సీట్లన్నీ ఫుల్ అవుతున్నాయి. జీవో ద్వారా చెప్పిన సోషల్ డిస్టెన్స్ నిబంధన ఏమైనట్లు? ప్రజలలో ఎప్పుడూ నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉంటుంది. ఎన్‌పోర్స్‌మెంట్ ద్వారా కట్టడి చేయాల్సింది ప్రభుత్వమే. అందులో భాగమే చలాన్లు. అదే చలాన్ల వ్యవస్థ ప్రజా ప్రతినిధుల విషయంలో ఎందుకు అమలు కావడంలేదు? దీనికి సమాధానం దొరకదు. ప్రభుత్వ యంత్రాంగం వివక్షతో వ్యవహరిస్తే అర్థమే లేదు. ఇప్పటికీ మాస్కు ధరించని మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు ఒక్క చలాన్ కూడా వేయలేదు. పైగా ఆ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పేరుతో పోలీసులు భద్రత కల్పిస్తూనే ఉన్నారు. మాస్కులు ధరించనందుకు గతేడాది రాష్ట్రంలో 58 వేలకు పైగా చలాన్లు విధించినట్లు డీజీపీ ఇటీవల చెప్పారు. అందులో దాదాపు సగం హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఈ ఫైన్‌‌లన్నీ సామాన్యులపై విధించినవే. శంకుస్థాపనలు, ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవాలు, రైతుబంధు సంబురాలు. వీటిలో ఎక్కడా కొవిడ్ నిబంధనలు అమలుకావడంలేదు. అయినా పోలీసులు చోద్యం చూస్తుంటారు. కేసులు పెట్టరు. చలాన్లు వేయరు. ప్రెస్‌మీట్ పేరుతో మాస్కు లేకుండానే పోటోలకు పోజులిస్తారు. కెమెరాలలో కనిపించడానికి, పబ్లిసిటీ పిచ్చి కోసం సోషల్ డిస్టెన్స్ నిబంధనను పాతరేస్తారు. వీరికి ఎలాంటి జరిమానా ఉండదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో రద్దీని చూస్తే కొవిడ్ నిబంధనలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది.

ముప్పు ముంచుకొస్తున్నా

ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు ప్రజలను కష్టాలలోకి నెడుతున్నాయి. ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ టైమ్‌లో వందల కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ టైమ్‌లో ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు థర్డ్ వేవ్ లాంటి ఒమిక్రాన్ ముంచుకొస్తున్నది. విదేశీ ప్రయాణికులపై దృష్టి పెట్టి మిగిలిన అంశాలను గాలికొదిలేశాయి. రోజుల వ్యవధిలోనే అది కమ్యూనిటీ వ్యాప్తిలోకి వెళ్ళిపోయిందని ప్రజారోగ్య శాఖ అధికారులే వెల్లడించారు. ప్రభుత్వానికి ఉత్తర్వుల అమలుపై చిత్తశుద్ధి లేదు. ప్రజలూ నిర్లక్ష్యంగానే ఉన్నారు. చివరకు ఆస్పత్రులు, బెడ్‌లు, ఆక్సిజన్, మందులు సిద్ధం చేసుకోవాల్సి వస్తున్నది. నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఆంక్షలు సామాన్యుల జీవితాలకే ముప్పుగా మారుతున్నాయి. సామాన్యులే సమిధలుగా మారుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరూ అలాగే ఉన్నది. జనం గుమికూడితే వైరస్ వ్యాపిస్తుందని తెలిసినా రాజకీయ సభలు, సమావేశాలు, ర్యాలీలపై తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించక తప్పదనే నిర్ణయాన్ని తీసుకున్నది.

కోర్టుల ఆదేశాలతో

గతేడాది తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో సెకండ్ వేవ్ విజృంభించింది. ఎన్నికల క్యాంపెయిన్ కారణంగా తమిళనాడులో 159 శాతం, కేరళలో 103 శాతం, పుదుచ్చేరిలో 165 శాతం, పశ్చిమబెంగాల్‌లో 420 శాతం, అసోంలో 532 శాతం మేర కరోనా కేసులు పెరిగినట్లు తేలింది. ఒక దశలో మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకుని 'ఎన్నికల సంఘం ఈ భూమి మీదనే ఉన్నదా? లేక మరో గ్రహం నుంచి ఊడిపడిందా? వ్యక్తిగతంగా అధికారులపై మర్డర్ కేసు పెట్టాల్సి వస్తుంది' అంటూ హెచ్చరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడంపై ఆలోచించాలని సూచించింది. ఈ ఎన్నికలతో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో పెరుగుతుందోననే ఆందోళన ప్రజలలో లేకపోలేదు. ర్యాలీలపై సంక్రాంతి వరకు నిషేధం ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్పినా జరుగుతూనే ఉన్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగమూ నిర్లక్ష్యంగానే ఉన్నది. పాలకులకు చిత్తశుద్ధి లేదు. ప్రజలకు బుద్ధి లేదు. ఉత్తర్వులు బుట్ట దాఖలు.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Similar News