ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు షాకింగ్ న్యూస్

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కోడ్​ అమల్లో ఉండగా సీఎం కేసీఆర్​ను ఎలా కలుస్తారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నోటీసులు జారీచేసింది. సీఎంను కలవడమే కాకుండా ఫిట్​మెంట్​ 29 శాతం, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలను మీడియా ముందు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించింది. మరోవైపు సీఎం కేసీఆర్​తో పాటు పలువురు మంత్రులకు కూడా ఈసీ నోటీసులు జారీచేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు […]

Update: 2021-03-15 13:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కోడ్​ అమల్లో ఉండగా సీఎం కేసీఆర్​ను ఎలా కలుస్తారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నోటీసులు జారీచేసింది. సీఎంను కలవడమే కాకుండా ఫిట్​మెంట్​ 29 శాతం, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలను మీడియా ముందు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించింది. మరోవైపు సీఎం కేసీఆర్​తో పాటు పలువురు మంత్రులకు కూడా ఈసీ నోటీసులు జారీచేసినట్లు సమాచారం.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈనెల 10న ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యాయి. అంతేకాకుండా ఫిట్​మెంట్​పై సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రగతిభవన్​ బయట మీడియాతో మాట్లాడాయి. మండలి ఎన్నికల నేపథ్యంలో గతనెల 11వ తేదీ నుంచి ఎన్నికల కోడ్​ రాష్ట్రంలో అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కోడ్​ అమల్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్​ను కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ నేత నిరంజన్​​ ఫిర్యాదు చేశారు.

దీంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కోడ్​ అమల్లో ఉండగా సీఎం కేసీఆర్​తో ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించింది. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్​రెడ్డి, సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్​రావు, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, టీజీవో అధ్యక్షురాలు మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్​టీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావుకు షోకాజ్​ నోటీసులు జారీ అయ్యాయి.

మండలి ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్​తో సమావేశం కావడం, పీఆర్సీపై మీడియాకు ప్రకటన చేయడం కోడ్​ ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నేత నిరంజన్​ ఫిర్యాదు చేశారు. పీఆర్సీ ప్రకటనతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లను ప్రభావితం చేసినట్లేనని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు కేటీఆర్​, ఎస్.నిరంజన్​రెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్​కు కూడా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఈసీ నోటీసులు ఎందుకంటే..?

ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్​ సమావేశం కాగా, మంత్రి కేటీఆర్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. దీంతోపాటు పలుమార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​ కూడా మంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​, జయేష్​ రంజన్​కు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఉన్నత విద్యా మండలి చైర్మన్​ పాపిరెడ్డికి కూడా ఈసీ నుంచి సంజాయిషీ నోటీసు వచ్చినట్లు సమాచారం. ఇక కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్​ ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డిని పిలిచారు. దీంతో ఆయనకు కూడా నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఇచ్చి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఈసీ సూచించింది. కానీ రాత్రి వరకు కూడా నోటీసులు ఉద్యోగ సంఘాల నేతలు, సీఎం, మంత్రులకు చేరలేదు.

Tags:    

Similar News