కాసుల వర్షం.. ఎర్లీ బర్డ్ స్కీంకు భారీ స్పందన

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిప‌ల్ శాఖ అమ‌లుచేస్తున్న ఎర్లీ బ‌ర్డ్ స్కీంకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. ఆస్తిప‌న్నును మే నెలాఖ‌రులోగా చెల్లిస్తే ప‌న్నులో ఐదు శాతం రాయితీని క‌ల్పిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పన్ను కట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఇందులో భాగంగా క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్టర్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌రిధిలోని 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేష‌న్ల ప‌రిధిలో ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో మే 14వ తేదీ వ‌ర‌కు రూ.101 […]

Update: 2021-05-15 11:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిప‌ల్ శాఖ అమ‌లుచేస్తున్న ఎర్లీ బ‌ర్డ్ స్కీంకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. ఆస్తిప‌న్నును మే నెలాఖ‌రులోగా చెల్లిస్తే ప‌న్నులో ఐదు శాతం రాయితీని క‌ల్పిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పన్ను కట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఇందులో భాగంగా క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్టర్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌రిధిలోని 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేష‌న్ల ప‌రిధిలో ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో మే 14వ తేదీ వ‌ర‌కు రూ.101 కోట్ల ఆస్తి ప‌న్నును ఎర్లీ బ‌ర్డ్ స్కీంలో భాగంగా య‌జ‌మానులు చెల్లించారు.

ఈ స్కీం గ‌డువు ఏప్రిల్‌తో ముగిసినా క‌రోనా నేప‌థ్యంలో మే నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించారు. దీంతో య‌జ‌మానులు ఈ అవ‌కాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 141 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో 14.05 లక్షల ఆస్తులు ఎర్లీ బ‌ర్డ్ స్కీం పరిధిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సీడీఎంఏ ప‌రిధిలో 2.29 లక్షల భ‌వ‌న య‌జ‌మానులు రూ.101.98 కోట్లను చెల్లించారు. దీని ద్వారా రూ.5.1 కోట్ల మేర‌కు భ‌వ‌న య‌జ‌మానులు లబ్ధి పొందారు. స‌గ‌టున 22 శాతం ఆస్తి ప‌న్నును ఇంటి య‌జ‌మానులు ఎర్లీ బ‌ర్డ్ స్కీం ద్వారా చెల్లించారు. మ‌రో 15 రోజుల వ‌ర‌కు ఐదు శాతం రాయితీ పొందేందుకు య‌జ‌మానులకు అవ‌కాశం ఉంది. ఆయా మున్సిపాలిటీలు,కార్పొరేష‌న్లలో ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని మున్సిప‌ల్ శాఖ అధికారులు ఇప్పటికే క‌మిష‌నర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ఎక్కువ మంది ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటార‌ని మున్సిప‌ల్ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ఓరుగల్లులోనే అత్యధికం

ఎర్లీ బ‌ర్డ్ స్కీం ప‌థ‌కాన్ని అత్యధికంగా వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో ప‌రిధిలో స‌ద్వినియోగం చేసుకున్నారు. 28,767 మంది రూ.12.16 కోట్ల మొత్తాన్ని చెల్లించారు. రెండో స్థానంలో నిజాంపేట కార్పొరేష‌న్‌ నిలిచింది. ఇక్కడ రూ.6.84 కోట్లు వ‌సూల‌య్యాయి. క‌రీంన‌గ‌ర్‌లో రూ.4.92 కోట్లు, నిజామాబాద్‌లో రూ.4.44కోట్లు, దుండిగ‌ల్ మున్సిపాలిటి పరిధిలో రూ.3.60 కోట్లు వ‌సూల‌య్యాయి.

క్యూఆర్ కోడ్ తోనూ చెల్లింపులు

ఆస్తి ప‌న్నును చెల్లించ‌డానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు క్యూఆర్ ఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో(జీహెచ్ఎంసీ మినహా) ప్రతి సంవత్సరం అందించే ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుపై ఈ ఏడాది నుండి ప్రత్యేక క్యూఆర్ కోడ్ న ముద్రిస్తున్నారు. దీని ద్వారా పౌరులు తమ ఆస్తి పన్ను చెల్లించడానికి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆస్తి పన్ను వివరాలు ప్రత్యక్షమవుతుండటంతో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే, టీ వ్యాలెట్ వంటి యాప్ ల ద్వారా తక్షణమే చెల్లించి రశీదను ఆన్ లైన్ లో పొందవచ్చు.

వాట్సప్ ద్వారా..

వాట్సప్ ద్వారా ఆస్తి ప‌న్ను చెల్లించే సులువైన విధానాన్ని మున్సిపల్ శాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా ఒక నంబర్ 90002 53342 ను కూడా కేటాయించింది. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగిస్తున్న నేప‌థ్యంలో వాట్సప్ ద్వారా ఆస్తి ప‌న్ను చెల్లించ వెసులుబాటును క‌ల్పించింది. దీంతో పన్ను వ‌సూళ్లు మ‌రింత పెరుగుతాయ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వాట్సప్ ద్వారా ఆస్తి ప‌న్నుతో పాటు నీటి ప‌న్ను, ట్రేడ్ లైసెన్స్‌, రెన్యూవ‌ల్‌, బిల్డింగ్ లేఔట్ ప‌ర్మిష‌న్‌, బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్ ను కూడా పొందే అవకాశాన్ని మున్సిపల్ శాఖ కల్పించింది. తెలుగు, ఇంగ్లిష్ రెండు భాష‌ల్లోనూ ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.

వాట్సప్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ నంబ‌ర్‌ను ఫోన్ లో సేవ్ చేసుకొని ఇంగ్లిష్ లో ‘Hi’ అని టైపు చేస్తే భాష‌ ఎంపిక ఆప్షన్ వస్తుంది. తెలుగు అయితే ఏ అని, ఇంగ్లిష్ అయితే బీ అని ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఇంటి నంబ‌ర్ లేదా పీ టిన్ నంబ‌ర్ దేని ద్వారా స‌మాచారం తెలుసుకుంటార‌ని అడుగుతుంది. మీ ఆప్షన్ ను సమాధానంగా ఇచ్చిన వెంటనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లతో జాబితా వ‌స్తుంది. అందులో ప‌ట్టణ నంబర్ ను ఎంచుకొని ఇంటి నంబ‌ర్ లేదా పీ టిన్ ఎంట‌ర్ చేస్తే వివ‌రాలు వ‌స్తాయి. అనంతరం ఎంటర్ నొక్కితే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆన్ లైన్ లోనే చెల్లింపులు చేయొచ్చు.

Tags:    

Similar News