దుబ్బాక ఉపఎన్నిక : తెరపైకి కీలక అంశం 

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ దుబ్బాక విషయంలో మాత్రం కొత్త ఆసుపత్రి నిర్మాణం నత్తతో పోటీపడుతోంది. ఐదేళ్ళయినా నిర్మాణం పనులే పూర్తికాలేదు. దానికి పక్కనే ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు వందలాది కోట్ల రూపాయల నిధులతో సర్వ హంగులూ సమకూరాయి. కానీ దుబ్బాకకు మాత్రం నిధుల జబ్బు పట్టుకుంది. 2016 జనవరిలో […]

Update: 2020-10-07 03:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ దుబ్బాక విషయంలో మాత్రం కొత్త ఆసుపత్రి నిర్మాణం నత్తతో పోటీపడుతోంది. ఐదేళ్ళయినా నిర్మాణం పనులే పూర్తికాలేదు. దానికి పక్కనే ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు వందలాది కోట్ల రూపాయల నిధులతో సర్వ హంగులూ సమకూరాయి. కానీ దుబ్బాకకు మాత్రం నిధుల జబ్బు పట్టుకుంది. 2016 జనవరిలో వంద పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసినా ఇప్పటికీ అది నిర్మాణం దశలోనే ఉంది. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. ఈ సందర్భంగా దుబ్బాక ప్రభుత్వాసుపత్రి అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకలకు పెంచుతామని జీవో నంబర్ 19ని 2016 జనవరి 11న ప్రభుత్వం జారీ చేసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఇందుకోసం రూ.21.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీనికి ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన ఆమోదం లభించింది. కానీ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాచారం మేరకు వైద్య విధాన పరిషత్ నుంచి ఆసుపత్రి అభివృద్ధి కోసం కేవలం రూ.13.05 లక్షలు మాత్రమే నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. నిధుల సమస్య కారణంగా నిర్మాణపు పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపేశారన్నది ఆసుపత్రి వర్గాల సమాచారం. ఇప్పుడు ఉప ఎన్నికల సమయంలో ఆసుపత్రి అభివృద్ధిని ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని అధికార పార్టీ గురించి ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి.

అక్కడలా.. ఇక్కడిలా..

మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిని 300 పడకల స్థాయికి పెంచడానికి ప్రభుత్వం రూ.158.70 కోట్ల మేరకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ ఆసుపత్రి పనులు పూర్తయ్యి ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని ఆసుపత్రిని వంద పడకల స్థాయికి తీర్చిదిద్దడానికి, పది పడకల ఐసీయూ వార్డును నెలకొల్పడానికి వేర్వేరు జీవోల ద్వారా ప్రభుత్వం రూ.55.42 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.

ఈ ఆసుపత్రి కూడా అంతా సిద్ధమై ప్రజలకు సేవలందిస్తోంది. ఇక మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని మాతాశిశు ఆసుపత్రినివంద పడకల ఆసుపత్రి స్థాయికి వృద్ధి చేయడంతో పాటు వైద్య కళాశాల కూడా పనిచేయడం మొదలైంది. దుబ్బాక చుట్టూ ఉన్న ఈ మూడు నియోజకవర్గాల్లోని ఆసుపత్రులకు మహర్దశ పడితే దుబ్బాక ఆసుపత్రి అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోయింది. ఇప్పటికీ పిల్లర్లు, శ్లాబ్ దశలోనే ఉంది.

భారీగా ఖాళీలు..

దుబ్బాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరాల ప్రకారం.. ఈ ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నప్పుడు ఐదు రెగ్యులర్ వైద్యుల పోస్టులు మంజూరైతే ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. మిగిలిన మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం వైద్య సిబ్బంది పోస్టులు 13 మంజూరైతే కేవలం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఎనిమిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక వంద పడకల స్థాయిని పరిగణనలోకి తీసుకుని మంజూరు చేసిన పోస్టులను పరిశీలిస్తే సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్ స్పెషలిస్టు, డిప్యూటీ సివిల్ సర్జన్, గైనకాలజిస్టు, అనెస్థటిస్టు, పీడియాట్రిషియన్, రేడియాలజీ స్పెషలిస్టు, జనరల్ సర్జన్, ఆర్ఎంఓ, ఫోరెన్సిక్ మెడిసిన్, ల్యాబ్ టెక్నీషియన్.. ఇలా మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Tags:    

Similar News