ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర !

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారానికి తెర పడింది. దాదాపు నెలన్నర రోజులుగా ఏడు మండలాల పరిధిలో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. రోడ్‌షోలు ఆగిపోవడంతో రోడ్లు ప్రశాంతంగా మారాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది వాహనాలు తిరుగు ప్రయాణమయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆఖరి రోజు ప్రచారంతో నియోజకవర్గం హోరెత్తింది. మూడు పార్టీల నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి […]

Update: 2020-11-01 13:01 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారానికి తెర పడింది. దాదాపు నెలన్నర రోజులుగా ఏడు మండలాల పరిధిలో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. రోడ్‌షోలు ఆగిపోవడంతో రోడ్లు ప్రశాంతంగా మారాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది వాహనాలు తిరుగు ప్రయాణమయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆఖరి రోజు ప్రచారంతో నియోజకవర్గం హోరెత్తింది. మూడు పార్టీల నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడు పార్టీల అభ్యర్థులు గెలుస్తామన్న ధీమాతోనే ఉన్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలకు గాను 89సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కేంద్ర పారా మిలిటరీ బలగాలతో భద్రత పటిష్టం చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.

దుబ్బాకలో గెలిచేదెవరో అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. హోరాహోరీ ప్రచారం, పోటాపోటీ పరిస్థితిపై మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌కు ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు మద్యం, డబ్బు పంపిణీపై దృష్టి పెట్టారు. ఇన్ని రోజుల పాటు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా నోట్లు పంచే ప్రక్రియ మరో ఎత్తు. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్ల వారీగా, కుటుంబాల వారీగా డబ్బు పంపకాలు షురూ చేశారు. యువజన సంఘాల, కుల సంఘాల వారీగా మందు బాటిళ్ళను పంపిణీ చేస్తున్నారు. ఇక బిర్యానీ ప్యాకెట్ల సంగతి సరేసరి.

ఓటర్ల బలహీనతలకు అనుగుణంగా కొన్ని చోట్ల పార్టీల స్థానిక నేతలు వస్తువులు, గిఫ్టులు, సామగ్రి వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈనెల 3న పోలింగ్ జరగనుండడంతో బతుకుతెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లను పోలింగ్ రోజు రప్పించడానికి నాయకులు గాలం వేస్తున్నారు. ఫోన్ చేసి మరీ రాను పోను ఖర్చులు భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు గరిష్టంగా నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా పార్టీలు వెనుకాడటం లేదు.

దుబ్బాకలో 144 సెక్షన్

దుబ్బాక ఉప ఎన్నికల్లో కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల విధుల్లో సుమారు రెండు వేల మంది భద్రతా విధుల్లో ఉంటున్నట్లు పోలీసు కమిషనర్ జోయల్‌ డేవిస్ తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు దుబ్బాక చేరుకున్న పోలీసు పరిశీలకులు సరోజ్ కుమార్ ఠాకూర్ (ఐపీఎస్ అధికారి) ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న 89పోలింగ్ కేంద్రాల దగ్గర అదనపు భద్రతను ఏర్పాటుచేయనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 144సెక్షన్ అమలవుతోంది. ఈనెల 4వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పటివరకూ ఎన్నికల్లో ప్రచారం కోసం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ పార్టీల కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు.

గుట్టుగా ప్రచారం

ఎన్నికల ప్రచారం ముగిసినా ఆయా పార్టీల అభ్యర్థులు, పార్టీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఇందుకోసం రహస్య ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 144సెక్షన్ అమల్లోకి రావడంతో ప్రచారం ముగిసిన వెంటనే రహస్య క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడా పార్టీ కండువాలు కనబడకుండా, ఏ పార్టీకి చెందినవారో తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

నిఘా పెంచిన పోలీస్ శాఖ

పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పోలీసులకు తెలియందేమీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లాడ్జీలు, అద్దె ఇళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, గెస్ట్ హౌజ్‌లు లాంటివాటిలో బయట ప్రాంతాలవారిని గుర్తించి తిప్పి పంపడంపై ఫోకస్ పెట్టారు. పార్టీల నుంచి ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే పోలీసులను సంప్రదించవచ్చంటూ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినందువల్ల భయపడకుండా ఓటు వేయడానికి వెళ్ళవచ్చని అర్థం చేయించారు. ఇబ్బంది సమయాల్లోనూ, అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు.

పోలీస్ కమిషనర్ వాట్సాప్ 7901100100
దుబ్బాక అసెంబ్లీ నోడల్ అధికారి, ఏసీపీ బాలాజీ 7901640499
సిద్దిపేట ఏసీపీ విశ్వ ప్రసాద్ 9490617009
గజ్వేల్ ఏసీపీ 8333998684
తుప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ 9490617008
కంట్రోల్ రూం నెంబర్ 8333998699

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ వివరాలు:

మొత్తం ఓటర్లు: 1,98,807
మహిళలు : 1,00,778
పురుషులు : 97,978
సర్వీస్ ఓటర్లు : 51
పోలింగ్ కేంద్రాలు : 315
ఇందులో సమస్యాత్మకమైనవి : 89
మొత్తం బ్యాలట్ యూనిట్లు : 882
మొత్తం కంట్రోల్ యూనిట్లు : 441
మొత్తం వీవీప్యాట్‌లు : 473
ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు : 14 (58 మంది) టీమ్‌లు
నిఘా బృందాలు : 6 (36 మంది)

Tags:    

Similar News