డబుల్ మర్డర్ : కూతురిను చంపిన తల్లి.. చెల్లిపై ప్రేమతో తల్లిని హత్య చేసిన కొడుకు
దిశ, ఏపీ బ్యూరో: క్షణికావేశంలో తల్లి చేసిన చిన్న తప్పు ఇద్దరి ప్రాణాలను తీసింది. కూతురుని భయపెట్టాలని తల్లి చేసిన ప్రయత్నం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. చెల్లిపై అన్నకు ఉన్న ప్రేమ అమ్మని చంపేలా చేసింది. కూతురిని తల్లి.. తల్లిని కుమారుడు.. ఇలా ఒకే ఇంట్లో రెండు మర్డర్లు జరిగాయి. దీనికి అంతటికి ప్రధాన కారణం మొబైల్ కావడం గమనార్హం. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని […]
దిశ, ఏపీ బ్యూరో: క్షణికావేశంలో తల్లి చేసిన చిన్న తప్పు ఇద్దరి ప్రాణాలను తీసింది. కూతురుని భయపెట్టాలని తల్లి చేసిన ప్రయత్నం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. చెల్లిపై అన్నకు ఉన్న ప్రేమ అమ్మని చంపేలా చేసింది. కూతురిని తల్లి.. తల్లిని కుమారుడు.. ఇలా ఒకే ఇంట్లో రెండు మర్డర్లు జరిగాయి. దీనికి అంతటికి ప్రధాన కారణం మొబైల్ కావడం గమనార్హం. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడపలోని నకాష్ వీధిలో కుషిదా అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. అయితే కూతురు అలీమా ఫోన్‌కు బానిసగా మారింది. నిత్యం ఫోన్ చూస్తుండటంతో తల్లికి కోపం వచ్చింది. బుధవారం అర్ధరాత్రి కుమార్తె అలీమాను గట్టిగా బెదిరించేందుకు తల్లి చున్నీతో ఉరి వేయబోయింది. అయితే హఠాత్తుగా ఉరి బిగుసుకు పోవడంతో అలీమా మృతి చెందింది. తన కళ్లెదుటే చెల్లిని తల్లి చంపడంతో కుషిదా కొడుకు తట్టుకోలేకపోయాడు. చెల్లిని చంపిందని కోపంతో తను తల్లి కుషీదాను మెడపై కత్తితో పొడిచి పారిపోయాడు.
తల్లీ కూతురు మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీంతో వచ్చిన పోలీసులు ఆధారాలు సేకరించారు. తల్లి కుషిదా మెడపై కత్తి గాట్లు.. కూతురు అలీమా మెడకు చున్నీ బిగించి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
డబుల్ మర్డర్ జరిగిందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకుడు ఎవరనే దానిపై మృతుల బంధువులను విచారించగా కుషిదాకు కొడుకు కూడా ఉన్నాడని, అతడు కనిపించడం లేదని తెలిపారు. వెంటనే పోలీసులు అతడి కోసం గాలించి అరెస్ట్ చేశారు. హత్యలపై విచారించగా తన సోదరిని తల్లి చంపిందన్న కోపంతో తానే తల్లిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.