25 నుంచి దేశీయ విమాన సేవలు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశీయ విమాన సేవలు మే 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించి కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విమాన సర్వీసులను నడపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విమాన సర్వీసులను నడపడానికి జీఎంఆర్ ఇప్పటికే సిద్ధమైంది. దీనికి అనుగుణంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఓలా, ఉబర్, మేరు, స్కై లాంటి క్యాబ్, […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశీయ విమాన సేవలు మే 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించి కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విమాన సర్వీసులను నడపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విమాన సర్వీసులను నడపడానికి జీఎంఆర్ ఇప్పటికే సిద్ధమైంది. దీనికి అనుగుణంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఓలా, ఉబర్, మేరు, స్కై లాంటి క్యాబ్, టాక్సీ సర్వీసులు 24గంటలూ నడుస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు రాత్రిపూట కర్ప్యూ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పుడు విమాన సర్వీసులతో హైదరాబాద్-శంషాబాద్ మధ్య ఆ నిబంధన అటకెక్కుతోంది.
కేంద్ర ప్రభుత్వం నాల్గో విడత లాక్‌డౌన్‌ను ఈ నెల 17 నుంచి కొనసాగిస్తూ కొన్ని ఆంక్షలను తొలగిస్తూ మార్గదర్శకాలను జారీ చేయగా వాటిని అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను (నెం. 68) ఈనెల 18వ తేదీన జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసును నిషేధిత జాబితాలో పెట్టింది (అంశం నెం. 6-ఏ). కానీ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రానికి పలు ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు సోమవారం నుంచే నడుస్తున్నాయి. అయితే జీవో ప్రకారం నిషేధం అయినా సర్వీసులను నడపడానికే జీఎంఆర్ మొగ్గు చూపినందున ప్రభుత్వం దీనిపై ఆదివారం రాత్రి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ విమాన సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లయితే ఆ జీవోలో మార్పులు చేస్తూ మరో కొత్త జీవోను వెలువరించాల్సి ఉంటుంది.
రాత్రిపూట కర్ఫ్యూ బేఖాతర్
కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో యధావిధిగా దుకాణాలు తెరుచుకోవచ్చని, సాయంత్రం ఏడు గంటలకల్లా మూసివేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ ఈ నెల 18వ తేదీన స్పష్టం చేశారు. ఆ ప్రకారం రాత్రి ఏడు గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల పాటు ప్రతీరోజు కర్ఫ్యూ కొనసాగుతుంది. కానీ విమాన సర్వీసుల నేపథ్యంలో క్యాబ్ సర్వీసులు, వాటితో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా తిరగడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అనుమతి ఇచ్చారు. దీంతో కర్ఫ్యూ స్ఫూర్తి ప్రశ్నార్థకంగా మారింది. విమాన సర్వీసుల విషయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జీఎంఆర్ యాజమాన్యం స్వతంత్ర నిర్ణయం తీసుకుంది.
విమాన సర్వీసులను ఇప్పట్లో నడపవద్దంటూ ప్రధానికి వీడియో కాన్ఫరెన్సులోనే విజ్ఞప్తి చేసినట్లు సీఎం కేసీఆర్ మూడవ లాక్‌డౌన్ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిషేధించబడినా సోమవారం నుంచి మాత్రం నడుస్తున్నాయి. పైగా విమానాల ద్వారా వచ్చిన ప్రయాణీకులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేదు. ఢిల్లీ, ముంబయి, చెన్నయ్ నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచి విమానాలు శంషాబాద్‌కు వచ్చినట్లయితే ఎంత మందికి పాజిటివ్ ఉంటుందో తెలియదు. లక్షణాలు లేకుండానే వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతోందని రాష్ట్ర వైద్యారోగ్య అధికారులు మొత్తుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో థర్మల్ స్క్రీనింగ్ చేసినా కరోనా పాజిటివ్ ప్రయాణీకులు ఇక్కడకు చేరుకుని క్వారంటైన్‌తో సంబంధం లేకుండా రోడ్లమీదకు వస్తే అది ఎంత మందికి అంటుకుందో అనే భయం వైద్యుల్లో వ్యక్తమవుతోంది.
మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లోనే క్వారంటైన్ నిబంధన లేనప్పుడు తాము ఎందుకు ప్రయాణీకులను నిర్బంధం చేస్తామని ఆ శాఖ అధికారి ఒకరు ప్రశ్నించారు.