మహబూబ్‌నగర్ జిల్లాలో రాజీనామాల పర్వం
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిని కొవిడ్ భయపెడుతోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుండగా.. మరోవైపు ఓపీ కేసులూ పెరుగుతున్నాయి. కరోనా బాధితులకు సహాయం అందించాల్సిన సిబ్బంది అవసరమైన స్థాయిలో అందుబాటులో లేదు. 35 మంది సిబ్బందికి కరోనా సోకడంతో మిగతా సిబ్బందిలో భయం నెలకొంది. దీనికి తోడు 27 మంది జూనియర్ డాక్టర్లు రాజీనామా చేశారు. కొత్త వైద్యులు సైతం రావడం లేదు. దీంతో ఉన్న సిబ్బంది పైనే పని భారం పెరుగుతోంది. […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిని కొవిడ్ భయపెడుతోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుండగా.. మరోవైపు ఓపీ కేసులూ పెరుగుతున్నాయి. కరోనా బాధితులకు సహాయం అందించాల్సిన సిబ్బంది అవసరమైన స్థాయిలో అందుబాటులో లేదు. 35 మంది సిబ్బందికి కరోనా సోకడంతో మిగతా సిబ్బందిలో భయం నెలకొంది. దీనికి తోడు 27 మంది జూనియర్ డాక్టర్లు రాజీనామా చేశారు. కొత్త వైద్యులు సైతం రావడం లేదు. దీంతో ఉన్న సిబ్బంది పైనే పని భారం పెరుగుతోంది.
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3 వేలు దాటింది. మొదట్లో అంకెలతో మొదలైన కేసులు ఇప్పుల్లో సంఖ్యలో నమోదువుతున్నాయి. దీని వల్ల కొవిడ్ ఆస్పత్రులకు బాధితుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో వారికి చికిత్స అందించే సిబ్బంది సైతం వైరస్ బారిన పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో ముఖ్యంగా కొవిడ్‌కు సంబంధించి చికిత్స అందించేందుకు కేవలం ఆరుగురు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇందులో ఐదుగురు జనరల్ ఫీజిషియన్స్ ఉండగా ఒక్కరు పలమోనరి డాక్టర్ ఉన్నారు. ఒక్కో వైద్యుడు సుమారు 10మందికి పైగా బాధితులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకింది. కొత్తగా పెద్ద ఎత్తున కేసులు నమోదువుతుండటంతో వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. కిందిస్థాయి సిబ్బంది సైతం అవసరమైనంత మేర లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య తీర్చేందుకు వివిధ ఆస్పత్రుల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసురావడంతో కొంత మేర సమస్యను అధిగమిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు.
భయంతో రాజీనామా..
కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సుమారు 35మంది సిబ్బంది ఇప్పటికే కరోనా సోకింది. వీరికి జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. దీంతో మిగతా సిబ్బంది, కొత్తగా వచ్చేవారు జంకుతున్నారు. జిల్లా ఆస్పత్రికి జనవరిలో 31 మంది జూనియర్ డాక్టర్లను నియమించగా.. కరోనా భయంతో ఇప్పటికే 27 మంది రాజీనామా చేశారు. తాజాగా ఎస్‌ఆర్ పద్దతిలో 40 మందిని నియమిస్తే వారిలో 7మంది మాత్రమే ఇక్కడ విధులకు హాజరయ్యారు. మరికొంతమంది పైరవీలు చేసుకుని హైదరాబాద్‌లో డిప్యుటేషన్ వేసుకున్నట్టు సమాచారం.
పెరిగిన ఓపీలు, రికార్డ్ స్థాయిలో డెలివరీలు
జిల్లాలో కొవిడ్ విజృంభిస్తున్నా నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు చాలా మంది వైద్యులు నిరాకరిస్తున్నారు. దీంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. స్థానకంగానే కాకుండా వికారాబాద్, పరిగి లాంటి ప్రాంతాల నుంచి సైతం రోగులు జిల్లాకు వస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో ఓపీ కేసుల సంఖ్య సుమారు 1200కు చేరుకుంది. జూలై నెలలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 702 డెలివరీలు ఈ ఆస్పత్రిలో నిర్వహించడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో ఆస్పత్రులు, కరోనా చికిత్స
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 7 కొవిడ్ ఆస్పత్రులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా చాలా మంది కరోనా రోగులను హోం క్వారంటైన్‌లోనే ఉంచుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 7 ఐసొలేషన్ సెంటర్లలో 504 పడకలను ఏర్పాటు చేశారు. వీటిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు 63 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు.ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ కోసం 100 పడకలను ఏర్పాటు చేశారు. ఈ సంఖ్యను 220కి పెంచుతామని ఇటీవలే రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. అలా చేస్తే వైద్యులు, సిబ్బందిపై మరింత భారం పడే అవకాశాలు లేకపోలేదు. ముందుగా సిబ్బందిని నియమించాక పడకల సంఖ్య పెంచితే బాగుంటుందని పలురువు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బంది కొరత ఉన్నా వైద్యం అందిస్తున్నాం: రాంకిషన్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
ఆసుపత్రిలో సిబ్బంది, బెడ్ల కొరత ఉన్నా.. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలి. ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స చేసుకున్న వారు చాలా మంది తమ ఇండ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల వారితో పాటు కుటుంబ సభ్యులు సైతం వారిని దూరం పెట్టడమే దీనికి కారణం. కొన్ని చోట్ల కిరాయి ఇండ్లలో ఉన్నవారిని ఇల్లు ఖాళీ చేయిస్తుండటం దారణం. కొవిడ్ వచ్చిన వారికి భరోసా ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యం పెంచాలి.