తక్కువ ధరకే డీజిల్ ఆఫర్.. నమ్మి వెంట వచ్చిన వ్యక్తికి ఊహించని షాక్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : అమాయకుల ఆశలే పెట్టుబడిగా మార్చుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్న ఘరానా మోసగాడిని హుజురాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్స్, మిషన్ భగీరథలో పనిచేస్తున్నానని మాయమాటలు చెబుతూ, వరంగల్‌లోని లాడ్జీలను అడ్డాలుగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసులు పెట్టారు. హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి సోమవారం మీడియాకు నిందితుడి గురించి వివరాలు వెల్లడించారు. కేశవపట్నం మండలం గద్దపాకకు చెందిన రాచర్ల శ్రీనివాస్ వద్దకు వచ్చిన అగంతకుడు తాను సెల్‌టవర్స్‌లో పని […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : అమాయకుల ఆశలే పెట్టుబడిగా మార్చుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్న ఘరానా మోసగాడిని హుజురాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్స్, మిషన్ భగీరథలో పనిచేస్తున్నానని మాయమాటలు చెబుతూ, వరంగల్‌లోని లాడ్జీలను అడ్డాలుగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసులు పెట్టారు. హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి సోమవారం మీడియాకు నిందితుడి గురించి వివరాలు వెల్లడించారు. కేశవపట్నం మండలం గద్దపాకకు చెందిన రాచర్ల శ్రీనివాస్ వద్దకు వచ్చిన అగంతకుడు తాను సెల్‌టవర్స్‌లో పని చేస్తానని రూ. 70కే లీటర్ డీజిల్ అమ్ముతానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినట్టు ఏసీపీ తెలిపారు. తనవద్ద 400 లీటర్ల డీజిల్ ఉందని ఇందుకు రూ. 28000 అవుతాయని, అడ్వాన్స్‌గా రూ. 14 వేలు ఇవ్వాలని వసూలు చేసినట్టు తెలిపారు. అనంతరం బాధితుడిని తనతో రావాలని కోరడంతో ట్రాక్టర్‌లో రెండు డ్రమ్ములు పెట్టించుకుని కేశవపట్నం పెట్రోల్ బంక్‌కు వెళ్లగా అక్కడ డీజిల్ లేదని చెప్పి, అక్కడి నుంచి వారిని మరొకబంకుకు, అలా చివరగా మొలంగూర్ పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్లి, మీరు ఇక్కడే ఉండమని చెప్పాడన్నారు.
పలు బంకులను తిప్పిన నిందితుడు భరత్ రెడ్డి చివరకు మొలంగూరు బంక్ వద్దకు తీసుకెళ్లి ఓనర్ పూజ చేస్తున్నాడని చెప్పిన నిందితుడు అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని సమీపంలోని వైన్ షాపుకు వెళ్లి మద్యం తాగుదామని కోరడంతో వారంతా అక్కడకు వెళ్లారన్నారు. మద్యం తాగుతుండగా మధ్యలో తన వద్ద పనిచేస్తున్న వర్కర్ కూడా వస్తున్నాడని, మీకు గ్రీస్ కూడా ఫ్రీగా ఇస్తానని మాయమాటలు చెప్పాడని ఏసీపీ వివరించారు. తన వర్కర్‌ను తీసుకొస్తానని వారికి చెప్పి బాధితుడి బైక్ తీసుకుని పరారయ్యాడని వెల్లడించారు.
బాధితుడు ఎంతసేపు ఎదురు చూసినా భరత్ రెడ్డి రాకపోవడం తో అనుమానం వచ్చి కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుని ఆచూకీ కోసం గాలించి పట్టుకున్నట్టు ఏసీపీ తెలిపారు. భరత్ రెడ్డి జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఈ తరహా మోసాలకు పాల్పడున్నట్టు వెకంటరెడ్డి చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తిరుగుతూ బస్ స్టాండ్లు, హోటళ్లు, కిరాణా షాపుల వద్ద అడ్డా వేసి ఆ ప్రాంతాలకు వచ్చిన వారికి మాయమాటలు చెబుతూ మోసం చేసేవాడన్నారు. ఇలా పలు చోట్ల మోసాలకు పాల్పడుతూ అవకాశం చిక్కగానే బాధితుల బైక్ తీసుకుని పరార్ అయ్యేవాడన్నారు.
దొంగిలించిన ద్విచక్ర వాహనాలను అమ్ముకుని జల్సాలు చేయడమే గాక మరో ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడి వారిని మోసం చేస్తుండేవాడని వివరించారు. భరత్ రెడ్డిపై ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జనగామ జిల్లాల్లో 18 కేసులు ఉన్నాయని ఏసీపీ చెప్పారు. గతంలో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపినా నిందితుడు మాత్రం ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. నిందితునిపై కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం జమ్మికుంట, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జాఫర్ గడ్‌లలో మూడు కేసులు నమోదు అయ్యాయన్నారు. భరత్ రెడ్డి వద్ద రెండు బైకులు, రూ. 8500ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో హుజురాబాద్ సీఐ ఎర్రాల కిరణ్, ఎస్సై ప్రశాంత్ రావులు కూడా పాల్గొన్నారు.