ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేసిందా? లేదా?- రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల గళాలను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము సమావేశాలకు అంతరాయం కల్పించాలనే లక్ష్యంతో లేమని, అతి ముఖ్యమైన స్పైవేర్ పెగాసస్‌పై చర్చను డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పెగాసస్‌తో భారత ప్రజలు, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యం చేసుకున్నారని, తద్వారా దేశ ప్రజాస్వామ్య ఆత్మపై దాడి చేస్తున్నారని అన్నారు. టెర్రరిస్టు, దేశద్రోహులపై నిఘా వేయడానికి దీన్ని ప్రయోగించాలని, కానీ, సొంత ప్రజలపైనే ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని […]
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల గళాలను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము సమావేశాలకు అంతరాయం కల్పించాలనే లక్ష్యంతో లేమని, అతి ముఖ్యమైన స్పైవేర్ పెగాసస్‌పై చర్చను డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పెగాసస్‌తో భారత ప్రజలు, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యం చేసుకున్నారని, తద్వారా దేశ ప్రజాస్వామ్య ఆత్మపై దాడి చేస్తున్నారని అన్నారు. టెర్రరిస్టు, దేశద్రోహులపై నిఘా వేయడానికి దీన్ని ప్రయోగించాలని, కానీ, సొంత ప్రజలపైనే ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అందుకే పార్లమెంటులో దీనిపై చర్చను డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందా? లేదా?, సొంత ప్రజలపైనే దీని ప్రయోగం చేసిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోరారు. పెగాసస్ కొనుగోలుపై మౌనం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పౌరులపై నిఘా వేయలేదని చెబుతున్నదని తెలిపారు. పార్లమెంటులో పెగాసస్‌పై చర్చించబోమని చెప్పిందని, ఎందుకు చర్చించదని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎందుకంటే పెగాసస్ స్పైవేర్‌తో గోప్యతకు భంగమని భావించడం కన్నా అదొక దేశ విద్రోహ చర్యగానే చూస్తున్నానని తెలిపారు.
సభలో విపక్షాలు నిరసనలు చేస్తుంటే సోమవారం రెండు బిల్లులు పాస్ చేసుకుందని మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యూహం కోసం 14 పార్టీల ఫ్లోర్ లీడర్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఇందులో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, కనిమొళి, ఎన్సీపీ లీడర్ సుప్రియా సూలే, శివసేన నేత అరవింద్ సావంత్, కేరళ కాంగ్రెస్(ఎం) నేత థామస్ చళికాదన్, ఎన్‌సీ లీడర్ హస్నయిన్ మసూదీ, ఆర్ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్, ముస్లిం లీగ్ లీడర్ ఈటీ మొహమ్మద్ బషీర్, సీపీఎం నేత ఎ వెంకటేశన్, ఏఎం ఆరిఫ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో రాహుల్ గాంధీ మాట్లాడారు.