అక్కడ కేటీఆర్.. ఇక్కడ హరీష్.. నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే ధర్నాలకు కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కేంద్రంలో మంత్రులు పాల్గొననున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు పాల్గొననున్నారు. ధర్నాలను విజయవంతం చేసి కేంద్రానికి గట్టిగా ధాన్యం కొనుగోళ్లపై వాదనను వినిపించనున్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే ధర్నాలకు కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కేంద్రంలో మంత్రులు పాల్గొననున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు పాల్గొననున్నారు. ధర్నాలను విజయవంతం చేసి కేంద్రానికి గట్టిగా ధాన్యం కొనుగోళ్లపై వాదనను వినిపించనున్నారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రైతుల పక్షాన ధర్నాలకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 12న నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులతో పాటు రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. నేడు అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ ఆదేశాల మేరకు కలెక్టర్ల నుంచి అనుమతులు సైతం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ధర్నాలను చేయాలని నిర్ణయించారు. అయితే ధర్నాల్లో ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో, మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో పాల్గొంటుండగా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగే ధర్నాలో గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా ధర్నా చౌక్ లో పాల్గొంటారు. మండల కేంద్రంలో జరిగే ధర్నాలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు పార్టీ నాయకులు పాల్గొననున్నారు.
కేసీఆర్ ధర్నాలో పాల్గొనరు..
కేసీఆర్ మాత్రం ధర్నాలో పాల్గొనడం లేదని, ముఖ్యమంత్రి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై వైఖరి మార్చుకోకపోతే ఢిల్లీలో కేసీఆర్ ఆధ్వర్యంలోనే ధర్నా నిర్వహిస్తారని స్పష్టం చేశారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీస్తారని తెలిపారు. కేంద్రం వైఖరి మారకపోతే మరిన్ని ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు.