అప్పగింతల్లో వధువు వీడ్కోలు చెబుతూ బియ్యం ఎందుకు విసిరేస్తుంది..

హిందూ వివాహంలో అనేక రకాల ఆచారవ్యవహారాలను పాటిస్తారు.

Update: 2024-03-14 08:29 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ వివాహంలో అనేక రకాల ఆచారవ్యవహారాలను పాటిస్తారు. వివాహానికి ముందు కొన్ని ఆచారాలు, వివాహ సమయంలో, వివాహం తరువాత కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ప్రతి ఆచారానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ ఆచారాలని, క్రతువులను తప్పకుండా ఇప్పటికీ పాటిస్తారు. అయితే హిందూ వివాహంలో పాటించే అన్ని ఆచారాల్లో వధువు అప్పగింతలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి. అప్పగింతల తరువాత వధువు తన వెనుక బియ్యం విసిరే ఆచారం ఉంటుంది. ప్రతి హిందూ వివాహంలో ఈ ఆచారం చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే ఈ తంతును ఎందుకు చేయాలి, దీని వెనక దాగి ఉన్న ఆంతర్యం ఏంటో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వవివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహానంతరం వధువు పుట్టింటి వారికి వీడ్కోలు చెబుతూ బియ్యం విసరడం ఆచారం. వధువు తన తల్లి ఇంటిని విడిచిపెట్టి తన అత్తమామల ఇంటికి వెళ్లినప్పుడు మాత్రమే ఈ ఆచారం నిర్వహిస్తారు. ఈ క్రతువులో వధువు తన రెండు అరచేతులను జోడించి బియ్యంతో నింపి, తన చేతుల్లో నింపిన బియ్యాన్ని ఆమె తల పైకి తీసుకొని వెనుకకు విసిరివేస్తుంది.

వధువు విసిరిన బియ్యం కింద పడకుండా చూసుకోవాలి. అందుకే వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె వెనుక ఉంటారు. వారందరూ తమ కొంగులో లేదా కండువాల్లో వధువు విసిరిన బియ్యాన్ని పట్టుకోవాలి. వధువు బియ్యం ఐదుసార్లు విసిరిన తర్వాత ఈ క్రతువు ముగుస్తుంది. ఈ సమయంలో వధువు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు.

ఈ ఆచారం వెనుక నమ్మకం..

హిందూ మతంలో ఆడపిల్లలను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. వివాహానంతరం ఆడపిల్లలు తల్లిదండ్రులను విడిచి పెట్టి అత్తమామల ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబానికి బియ్యం రూపంలో ఐశ్వర్యం, దీవెనలు ఇస్తారని నమ్మకం. అందుకే అమ్మాయిలు వీడ్కోలు సమయంలో తల పై నుంచి బియ్యం విసిరే ఆచారం నిర్వహిస్తారు.

చెడు కన్ను నుండి రక్షిస్తుంది..

ఈ ఆచారం నిర్వహిస్తే ఎలాంటి చెడు దృష్టి వధువు పుట్టింటి పై పడకుండా రక్షిస్తుందని చెబుతారు. ఈ ఆచారం ద్వారా వధువు తన తల్లిదండ్రుల నుండి పొందిన ప్రేమ, ఆప్యాయత, గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

Tags:    

Similar News