ఆ శివాలయంలో అద్భుతం.. రెండు మతాల ప్రజల పూజలందుకుంటున్న భోలేనాధుడు..
భారత దేశం అనేక హిందూ దేవాలయాలకు ప్రసిద్ది.
దిశ, ఫీచర్స్ : భారత దేశం అనేక హిందూ దేవాలయాలకు ప్రసిద్ది. ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయాల్లో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆలయం లాహౌల్, స్పితి జిల్లాలో చంద్రభాగ నది ఒడ్డున ఉన్న ఉదయపూర్ అనే చిన్న పట్టణంలో ఉన్న శివాలయం. ఈ ఆయంలో అంతుచిక్కని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. సంవత్సరంలో దాదాపు 6 నెలల పాటు మంచుతో కప్పి ఉండే ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. సముద్ర మట్టానికి 2,742 మీటర్ల ఎత్తులో ఉన్న ఉదయపూర్ కు వేసవి కాలంలో మాత్రమే బయటి వ్యక్తులు చేరుకోవచ్చు. తక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతం త్రిలోకినాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం కూడా చాలా ప్రత్యేకమైనది. హిందువులు, బౌద్ధమత అనుచరులు కలిసి ఈ ఆలయంలో పూజలు చేస్తారు. రెండు మతాల వారు కలిసి ఒకే విగ్రహాన్ని పూజించే ఆలయం ప్రపంచంలో బహుశా ఇదే.
శివుని రూపం..
హిమాచల్ టూరిజం ప్రకారం హిందువులలో త్రిలోకనాథున్ని శివుని రూపంగా పరిగణిస్తారు. బౌద్ధులు అతన్ని ఆర్య అవలోకితేశ్వరుడిగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని హిందువులు నమ్ముతారు. బౌద్ధ విశ్వాసం ప్రకారం పద్మసంభవుడు 8వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశానికి పూజలు చేశాడు.
ఆలయంలో రహస్యాలు..
స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండా అలానే ఉన్నాయి. అవి ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఇక పురాణాల ప్రకారం కులుకి అనే రాజు ఈ స్వామి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్లాలని అనుకున్నారని చెబుతున్నారు. అయితే ఆ విగ్రహం ఎత్తలేని విధంగా భారీగా మారిందని చెబుతున్నారు. ఈ పాలరాతి విగ్రహానికి కుడి కాలు మీద ఓ గుర్తు కూడా ఉందట. ఆ సమయంలో కులుకి చెందిన సైనికుడి కత్తితో ఈ గుర్తు ఏర్పడిందని నమ్ముతారు. కైలాస, మానస సరోవరం తర్వాత ఈ ఆలయం అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు.
ఇక్కడ రెండు మతాల వారు కలిసి పూజలు చేస్తారు..
త్రిలోకీనాథ్ ఆలయంలో రెండు మతాల ప్రజలు కలిసి పూజలు చేస్తారు. అయితే ఈ ప్రాంతానికి ఇది ఆశ్చర్యం కలిగించదు. లాహౌల్ స్పితి, దాని పక్కనే ఉన్న కిన్నౌర్ జిల్లాలో రెండు మతాల ప్రజలు కలిసి నివసిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా చోట్ల ప్రజలు రెండు మతాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. కిన్నౌర్‌లోని ప్రసిద్ధ గ్రామమైన చిట్కుల్‌లో ఇలాంటిదే కనిపిస్తుంది. ఇది భారతదేశం - చైనా సరిహద్దులో ఉన్న చివరి గ్రామంగా కూడా చెబుతారు. ప్రజలు రెండు మతాలను అనుసరిస్తారని స్థానికులు చెబుతున్నారు. హిమాచల్‌లోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే ఆ గ్రామంలో కూడా ఒక కులదేవి ఉంది. వారు ఆ దేవున్ని పూజిస్తారు. ఆలయంతో పాటు బౌద్ధ దేవాలయమైన గొంప కూడా ఉంది. వారు హిందూ ఆచారాలను అనుసరిస్తారు కానీ పూజారి స్థానంలో బౌద్ధ లామా ఉంటారు.