Tirumala: మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున శ్రీనివాసుడు భక్తులకు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఆయన్ను దర్శించుకున్న భక్తులు ముగ్ధమనోహర రూపాన్ని చూసి మంత్ర ముగ్ధులయ్యారు.

Update: 2024-10-08 03:51 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి సాలకోట్ల బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మలయప్పస్వామివారు భక్తులకు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. శృంగార రసాధి దేవతగా.. సర్వాలంకార భూషితుడై శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అవతారంలో ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ ముగ్ధమనోహర రూపాన్ని చూసి భక్తులు మంత్ర ముగ్ధలయ్యారు. తిరుమల గిరులన్నీ శ్రీనివాస నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.

తిరుమాఢ వీధుల్లో స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తుండగా.. ఆయన ముందు కోలాటాలు, నృత్యాలు, చెక్క భజనలు, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అడుగడుగునా ఆయనకు కర్పూర హారతులు పట్టి.. ఈ జన్మధన్యమైంది స్వామి అంటూ సాష్టాంగం చేస్తున్నారు భక్తులు. క్షీరసాగర మథనం చేసేటపుడు.. అసురులను మాయచేసి, దేవతలకు అమృతం పంచేందుకు స్వామివారు మోహినిగా ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాయాలోకం నుంచి భక్తుల్ని బయటపడేయడమే మోహినీ రూపం వెనుక ఉన్న పరమార్థమంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 10 గంటల వరకూ స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహిస్తారు. 


Similar News